Telugu Global
WOMEN

గౌరవాలు లేవు... గౌరవ వేతనాలు రావు!

అనంతపురంలో సుశీలమ్మ అనే అంగన్‌వాడీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంది. ఆమెది ఆత్మహత్య అనడం సబబేనా? ఇది ప్రభుత్వం చేసిన హత్య కాదా! ఐదు నెలలుగా జీతం రాక ఆర్థిక బాధలతో ఆమె జీవితాన్ని ముగించింది. ఐదు నెలలు కాకపోయినా మరో ఐదు నెలలయినా సరే జీతం కోసం ఎదురు చూసే సహనం ఆమెకి ఉన్నప్పటికీ ఆమెకు వచ్చిన ఖర్చులకు ఆ సహనం లేదు. ఆమెకు సమయానికి జీతం చెల్లించని ప్రభుత్వం… ఆమె కొడుకు పరీక్ష ఫీజు కట్టడంలో […]

గౌరవాలు లేవు... గౌరవ వేతనాలు రావు!
X

అనంతపురంలో సుశీలమ్మ అనే అంగన్‌వాడీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంది. ఆమెది ఆత్మహత్య అనడం సబబేనా? ఇది ప్రభుత్వం చేసిన హత్య కాదా! ఐదు నెలలుగా జీతం రాక ఆర్థిక బాధలతో ఆమె జీవితాన్ని ముగించింది. ఐదు నెలలు కాకపోయినా మరో ఐదు నెలలయినా సరే జీతం కోసం ఎదురు చూసే సహనం ఆమెకి ఉన్నప్పటికీ ఆమెకు వచ్చిన ఖర్చులకు ఆ సహనం లేదు. ఆమెకు సమయానికి జీతం చెల్లించని ప్రభుత్వం… ఆమె కొడుకు పరీక్ష ఫీజు కట్టడంలో ఆలస్యమైతే ఏ మాత్రం సహించదు. ఆ ద్వంద్వ వైఖరే ఆమె ప్రాణాలు తీసింది. అంగన్‌వాడీ వ్యవస్థ తరచూ వార్తల్లో ఉంటుంది. వారికిచ్చే అరకొర వేతనాలే అందుకు కారణం. ఇటీవల వారు ఆందోళను దిగడానికి ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరే కారణం. ఇంతకీ అంగన్‌వాడీ అంటే… అంగన్‌వాడీ అంటే ప్రాంగణంలోనే ఆశ్రయం కల్పించి సంరక్షించడం అని అర్థం. ఐసిడిఎస్- ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ అంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేసింది. అందుకు ప్రభుత్వం వేతనాలతో అధికారులను కూడా నియమించింది. ఈ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి మాత్రం ఉద్యోగులను నియమించ లేదు. ‘అంగన్‌వాడీ’ కార్యకర్తలను నియమించి వారికి నామమాత్రపు వేతనాలతో సరిపుచ్చింది. 1975వ సంవత్సరం అక్టోబరు రెండవ తేదీన ప్రారంభించినప్పుడు వారికి నెలకు 250 రూపాయల వేతనాన్ని ఖరారు చేసింది. దశాబ్దాలు గడుస్తున్నా వారికి జీతాలు పెంచడానికి ప్రతి ప్రభుత్వమూ పెద్ద ఉదారంగా వ్యవహరించినట్లు అభినయిస్తూ రోజుకు వంద రూపాయలకు తెచ్చాయి. గ్రామంలో గర్భిణీ స్త్రీకి వైద్యసదుపాయాలందించడంలో అంగన్‌వాడీ కార్యకర్త పాత్ర కీలకం, అలాగే పుట్టిన బిడ్డకు మూడేళ్లు వచ్చే వరకు వేయించాల్సిన టీకాలు, వ్యాక్సిన్ల బాధ్యత ఆమెదే. ఆ తర్వాత పోషకాహార లోపం కలగకుండా వారికి ప్రభుత్వం అందించిన దినుసులతో వేళకు మంచి ఆహారం వండి పెట్టడమూ ఇందులో భాగమే. వీటన్నింటితోపాటు ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ముందుండాలి. ప్రతి అధికారికీ ముందుగా గుర్తొచ్చేది ఈ మహిళలే. అయితే ఈ అధికారులెవరికీ అంగన్‌వాడీ కార్యకర్తల ఆర్థిక బాధలు పట్టవు. వారికి కనీస వేతనాలు లేవనే విషయం తలకెక్కదు. వారికిచ్చే అరకొర వేతనం కూడా నెలనెలా ఇవ్వరు. నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇటీవల జరిగిన ఆందోళనల సందర్భంగా వారిని నిర్దాక్షిణ్యంగా లాగి పడేయించింది ప్రభుత్వం. గౌరవ వేతనం అడిగినందుకు గౌరవాలూ మంటగలిశాయి. జీవితాలు అంతమవుతున్నాయి. ప్రభుత్వాలకు మహిళల సమస్యలు పట్టవు, మహిళల శ్రమను గుర్తించరనడానికి ఇదో నిదర్శనం.

First Published:  21 March 2015 5:29 AM GMT
Next Story