Telugu Global
POLITICAL ROUNDUP

ఏడుస్తున్న ఏపీలో నవ్వుతోందెవరు?

విభజిత ఆంధ్రప్రదేశ్‌ ప్రస్థానం ఏడుపుతో ఆరంభమవడం ఒక వాస్తవిక అనివార్యత కావడమో ఏమో అదే మిగులుతోందిప్పుడు. రాష్ట్రాన్ని  విభజించ వద్దంటూ, తెలంగాణ రాదంటూ దొంగ రోదనలతో నాయకులు ప్రజలను భ్రమల్లో ఉంచారు కొన్నాళ్లు. విడిపోవడం తప్పదని తెలిసాక ఏపీకి ఏం కావాలో అది అడగడం మానేసి హైదరాబాద్‌ మాదే అని మరికొంత కాలం శోకాలు అందుకున్నారు. విడిపోయాక విశాఖ ఉంది కదా అనుకుంటే   హుద్‌ హుద్‌  వచ్చి ఏడిపించింది. మధ్యలో ఎన్నికలు జరిగి చంద్రబాబునాయుడు సీఎం కావడం […]

ఏడుస్తున్న ఏపీలో నవ్వుతోందెవరు?
X

విభజిత ఆంధ్రప్రదేశ్‌ ప్రస్థానం ఏడుపుతో ఆరంభమవడం ఒక వాస్తవిక అనివార్యత కావడమో ఏమో అదే మిగులుతోందిప్పుడు. రాష్ట్రాన్ని విభజించ వద్దంటూ, తెలంగాణ రాదంటూ దొంగ రోదనలతో నాయకులు ప్రజలను భ్రమల్లో ఉంచారు కొన్నాళ్లు.

విడిపోవడం తప్పదని తెలిసాక ఏపీకి ఏం కావాలో అది అడగడం మానేసి హైదరాబాద్‌ మాదే అని మరికొంత కాలం శోకాలు అందుకున్నారు. విడిపోయాక విశాఖ ఉంది కదా అనుకుంటే హుద్‌ హుద్‌ వచ్చి ఏడిపించింది. మధ్యలో ఎన్నికలు జరిగి చంద్రబాబునాయుడు సీఎం కావడం మినహా నవ్యాంధ్రప్రదేశ్‌లో జరిగిందేమీ లేదు. ఆ ప్రజలకు ఒరిగిందేమీ లేదు.

చివరకు బాబు వస్తే జాబు వస్తుందనుకున్న యువత, ‘అన్న’ పార్టీతోనే రుణమాఫీ సాధ్యమనుకున్న రైతులు, మహిళలు కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ చారిత్రక సందర్భంలో ఏపీ ప్రజలు ఒక సత్యాన్ని గ్రహించారని చెప్పవచ్చు. అదేమిటంటే లోకం(సమైక్యరాష్ట్రం) కోసం కాదు, మన కోసం మనం ఏడ్వాలీ అని. అందుకే ‘నవ మాసాలు’ దాటిన పాలన మీద నెమ్మదిగానైనా రుసరుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఏపీలో నవ్వుతున్నవారు ఎవరూ లేరని చెబితే సగం సత్యం చెప్పినట్టే అవుతుంది.

మొదటి నాలుగు నెలల వరకు పాపం వీళ్లు కూడా ఏడుస్తూనే ఉండేవారని చెప్పాలి. ఎందుకంటే ప్రజా సమస్యలకంటే చంద్రబాబునాయుడు దగ్గరకు వీళ్లు చేసిన అప్పులే ప్రధానంగా చర్చకు వచ్చాయి కాబట్టి. అలా ఏడుస్తూ….నే చిరు నవ్వులకు దగ్గరైన టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రస్తుతం పరమానందంలో ఉన్నారు. దానిక్కారణం ఒకటి బాబుగారు దయతలచి విదిల్చిన నియోజక వర్గ అభివృద్ధి నిధులు. రెండోది ఆమ్యామ్యాలకు పసుపు జెండా ఊపడం. ఎన్నికలకు ఒక్కో ఎమ్మెల్యే అప్పూ, ఆదా చేసి నాలుగు నుంచి పది కోట్ల వరకు ఖర్చుపెట్టేశారు. అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ఆవిధంగా ‘విత్తు’లేసాక రిజల్టు వచ్చి కుదురుకున్నాక ఎన్నికల్లో ‘తడి’పిన అప్పులవాళ్లు ఎమ్మెల్యేల మీదకు ఎగబడటం మొదలెట్టారు. అది కాస్త ఏడుపుల దాకా వెళ్లింది. ఏం చేయాలో కొంతమంది ఎమ్మెల్యేలకు దిక్కుతోచక చివరకు అంగన్వాడీ పోస్టుల మీద కూడా ఆధారపడి తమకు ‘నీరు’ పోస్తేనే పోస్టుకు ‘నారు’ పడుతుందని తేల్చేశారు. ఈ విషయం చంద్రబాబునాయుడు దగ్గరకు చేరి ఆయన మందలించబోతే ‘తెలుగు’ తమ్ముల్లు చివాలున లేచి మేమేమైనా నారాయణా, సుజనా చౌదరి మాదిరిగా కోట్లు కోసం కక్కుర్తి పడుతున్నామా ! అప్పులకు వడ్డీలు కట్టడానికి తప్పదు కదా బాబూ! అని సవరదీశారట. ఆపై అన్నగారి అల్లుడు దయతలచి సంక్రాంతి కానుకగా నియోజక వర్గ అభివృద్ధి నిధులిచ్చి ఈ సంవత్సరానికి సర్దుకోండి అన్నారట.

అలా తన వారికి నవ్వులు పంచిన చంద్రబాబునాయుడు రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో జాబు దగ్గరకొచ్చేసరికి ప్రభుత్వం కష్టాల్లో ఉందని కన్నీరు పెడుతున్నారు.

నిజానికి ఫైలిన్‌ తుఫాన్‌ నష్టపరిహారం ఇస్తానని కూడా చంద్రబాబు హామీ ఇచ్చి రైతుల దగ్గర మార్కులు, ఓట్లు పొందారు. చివరకు అది కూడా మరచిపోయారు. ఇప్పుడు దానిని అడుగుతుంటే చంద్రబాబు చిరాకు పడుతున్నారట. ఇటీవల ఉత్తరాంధ్ర రైతులు కొందరు వచ్చి చంద్రబాబును కలిశారు. వారిలో ఎక్కువమంది శ్రీకాకుళం,విజయనగరానికి చెందిన వారు ఉన్నారు. నాటి ఫైలిన్‌ నష్టపరిహారం గురించి ప్రస్తావించడానికి పాపం హైదరాబాద్‌ వరకు వచ్చారు. నాడు బాబుగారు ఇచ్చిన హామీలు, ఫైలిన్‌కు దెబ్బతిన్న కొబ్బరి తోటలు, పంట పొలాలు, కొట్టుకుపోయిన మ‌త్స్య‌కారుల‌ ఇళ్లు, ముక్కలు చెక్కలైన పడవల ఫొటోలు వగైరా తెచ్చి బాబు ముందరపెట్టారు. ఫొటోల్లోకి మారిపోయిన వాస్తవ దృశ్యాలను నాడు స్వయంగా చూసి చలించి, వరాలిచ్చిన చంద్రబాబు, నేడు వాటినే చిత్రాలుగా చూసి కళ్లు చిట్లించి ‘ఇలాంటి ఫొటోలు నా దగ్గర కూడా బోలెడన్ని ఉన్నాయి. చూపించమంటారా?’ అని నిలదీశారట. దాంతో రైతన్నలు బిక్క చచ్చిపోయి వెనుదిరిగారు. కొసమెరుపు ఏమిటంటే ఆ రైతులను తీసుకొచ్చింది టీడీపీ నేతలే అని తెలిశాక చంద్రబాబుకు మరింత కోపమొచ్చింది. ఇలాంటి పిచ్చి పనులు మానుకోవాలని పెద్దలతో వారికి క్లాస్‌ కూడా పీకించారట.

ఇదంతా చూస్తుంటే ఓ కథ గుర్తొస్తోంది… ఓ తల్లికి ఓ బిడ్డ పుడితే వాడిని చూసి ఆమె భయపడింది. సంశయించింది. స్త్రీకి శిశువు పుడితే భయపడాల్సిందీ,సంశయించాల్సిందీ ఏమీ ఉండదు. కాకపోతే అంతకుముందు కెవ్వు మంటూనే కళ్లు మూసిన ఇద్దరు చిన్నారులను చూసి ఉన్న ఆ తల్లి వీడైనా మిగిలితే చాలని అనుకుంది. పసికందును పరీక్షించిన డాక్టరు మాత్రం పెద్దగా ఆశపడొద్దని చెప్పాడు. పీలగా ఉన్న చేతులు, తీగల్లా ఉన్న కాళ్లు, తాటి టెంకలా ఉన్న ఆ జీవి మిగులుతుందని ఆయనకు నమ్మకం లేకపోయింది. రోజులు భయంకరంగా గడుస్తున్నాయి. రోజురోజుకూ నలుసు నీరసపడిపోతున్నాడు. ఆ తల్లి ప్రార్థించని దేవుడు లేడు. అయినా పరిస్థితి మాత్రం మారడం లేదు. చివరకు భగవంతుని దీవెన వలన ఆ బిడ్డ బతికి పెద్దాడయ్యాడు. అలా ఎదిగిన ఆ శిశువును తరువాత అందరూ అడాల్ఫ్‌ హిట్లర్‌ అని పిలిచారు. రెండు సార్లు ప్రతిపక్షంలో కూర్చున్న చంద్రబాబు ప్రజాస్వామ్య తల్లి ఒడిలో మూడో శిశువుగా జన్మించాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తారో అని అందరూ భయపడుతున్నారు. రైతుల రుణమాఫీ చంద్రబాబు సామాజిక వర్గం అధికంగా ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక విధంగా అమలైతే మిగతా రాయలసీమ, ఉత్తరాంధ్రలో అతి తక్కువగా జరిగింది. అలాగే రాజధాని కూడా ఆ సామాజిక వర్గం అధికంగా ఉన్న ప్రాంతంలోనే కడుతున్నారు. చివరకు ఇటీవల ఇచ్చిన ఉగాది పురస్కారాలను కూడా కృష్ణా,గుంటూరు వాళ్లకే కట్టబెట్టారు. కులాభిమానం వేరే, కులదురాభిమానం వేరే. జాత్యహంకారం ఎలాంటిదో ఎవరికైనా కులాహంకారం అలాంటిదే. ఏపీలో తన పార్టీనేతలు, తన సామాజిక వర్గం మాత్రమే నవ్వుతూ బతకాలని కాకుండా ప్రజలందరూ ఆనందంతో జీవించడానికి అవసరమైన పాలనను చంద్రబాబు అందిస్తే మంచిది.

-సంఘమిత్ర

First Published:  26 March 2015 4:23 AM GMT
Next Story