మాచ్‌ ఫిక్సింగ్‌లో టిడిపి ఒంటరి

తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రశాంతంగా, అతి తక్కువ సమయం వృధా తో సుదీర్గంగా చర్చలు జరగడం అందరినీ విస్తుపరచినప్పటికీ దీని వెనుక లోపాయికారీగా వివిధ పార్టీలు, సభ్యుల మధ్య ఒప్పందం కుదిరినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలని కొన్ని ముఖ్య రాజకీయ పార్టీల మూకుమ్మడి కుట్రలో భాగంగానే తెలుగుదేశం పార్టీని సస్పెన్షన్‌ పేరుతో బయట ఉంచి సభను సజావుగా నడిపించినట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఎప్పుడూ లేని విధంగా తొలిసారిగా శాసనసభలో వివిధ అంశాలపై సుదీర్ఘమైన చర్చ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సభతో పోలిస్తే) జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తరువాత గత ఏడాది సూత్రప్రాయమైన బడ్జెట్‌ను ప్రతిపాదించగా వచ్చే ఆర్దిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ఈసారి పూర్తి స్తాయిలో నిర్వహించారు. మొత్తం సభ జరిగినన్ని రోజులూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పదిమందినీ సస్పెండ్‌ చేసి వారిని ఆఖరుకు శాసనసభ ప్రాంగణంలోకి సైతం రానీయకుండా అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం తన ఆధిపత్యాన్ని చూపిస్తే అందుకు ప్రధాన ప్రతిపక్షంతోపాటు ఇతర పక్షాలూ సమర్ధించాయి. ఫలితంగా తెలుగుదేశం పార్టీ చివరకంటా ఒంటరిగా మిగిలిపోయింది.

బడ్జెట్‌ సమావేశాలు మొత్తం 14 రోజులు జరగ్గా అత్యధికంగా 81 మంది ఎమ్మెల్యేలు చర్చల్లో పాల్గొన్నారు. మొత్తం ఏడు బిల్లులు, మూడు తీర్మానాలు ఆమోదం పొందాయి. అతి తక్కువ కాలంలో 79 గంటలపాటు ప్రసంగాలు సాగే విధంగా సభ నిర్వహించడం దాదాపు ఓ రికార్డుగానే భావించాలి. ఎపి శాసనసభతో పోల్చితే తెలంగాణ సభ ప్రశాంతంగా ముగిసింది. ఎపిలో అధికార పార్టీకి తోడుగా ఏకైక ప్రతిపక్షం ఉంది. కానీ తెలంగాణలో అధికార టిఆరెస్‌తోపాటు ప్రతిపక్షాలుగా కాంగ్రెస్‌, టిడిపి, ఎంఐఎం, బిజెపి, వైకాపా, సిపిఐ, సిపిఎంలతోపాటు స్వతంత్ర ఎమ్మెల్యే ఒకరు కూడా ఉన్నారు. దాంతో ఎపిలో కన్నా తెలంగాణలోనే సభ సజావుగా జరిగే అవకాశాలు తక్కువగా ఉండాలి. కానీ అందుకు విరుద్ధంగా తెలంగాణలో ప్రశాంతంగా జరిగింది. అందుకు తెలుగుదేశం సభ్యులను తొలిరోజు నుంచీ బయట ఉంచడమే కారణంగా కనిపిస్తోంది. ఈ విధమైన అభిప్రాయాన్ని కలిగించడంలో టిఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌, ఎంఐఎం, వైకాపా, సిపిఐ, సిపిఎంలు సహకరించినట్లు కనిపిస్తోంది. ఆఖరికి టిడిపికి మిత్రపక్షంగా వున్న బిజెపి కూడా పరోక్షంగా టిఆర్‌ఎస్‌కు సహకరించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చెప్పుకోదగ్గ బలమే ఉన్నప్పటికీ ముఖ్యంగా హైదరాబాదు, రంగారెడ్డి ప్రాంతాల్లో పదిలంగా ఉండటంతో ఆ పార్టీని దెబ్బతీసేందుకు టిఆర్‌ఎస్‌ సర్వశక్తులూ ఒడ్డుతోంది. తెలుగుదేశం పార్టీ బలహీనపడితే ఎక్కడికక్కడ తమ ప్రయోజనాలు నెరవేరి తమ పార్టీలు రాజకీయంగా బలపడుతాయని టిఆర్‌ఎస్‌తోపాటు బిజెపి, కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు తదితరులు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక వైకాపాకు టిడిపి ప్రధాన శత్రువుగా మిగిలిపోయింది. ఈ పరిస్థితుల్లో సభలో టిడిపిని ఒంటరి చేయడం ద్వారా సభ నుంచి సస్పెండ్‌ చేశారు. జాతీయ జెండాను అవమానించారనే కారణాన్ని ప్రభుత్వం బలంగా చూపడంతో టిడిపికి మద్దతుగా ఆఖరికి బిజెపి కూడా రాలేకపోయింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌, బిజెపి మిగిలిన పక్షాలకూ మాట్లాడేందుకు సమయం కూడా ఎక్కువ లభించింది. ఫలితంగా ఒకటి రెండు అంశాలు మినహా అత్యధికంగా అందరూ కలసి కుమ్మక్కయి ప్రశాంతంగా సభను నిర్వహించుకున్నారు. సభలో టిడిపి లేకపోవడం వల్లనే ఈ అవకాశం లభించి, సభ్యులందరూ సంతృప్తి చెందే విధంగా తమ లక్ష్యాలను సాధించుకోగలిగారు. అందువల్ల అత్యధిక సమయం చర్చలతో మాచ్‌ ఫిక్సింగ్‌ తరహాలో సాగిపోయింది. తెలుగుదేశం మాత్రం వీధుల్లోనే ఆందోళనకు పరిమితమై ఒంటరిగా మిగిలిపోయింది.