ముగ్గురు కూతుళ్ళను చంపి…

చిలుకూరు బాలాజీ స‌న్నిధిలోనే ఓ ఘోరం జ‌రిగి పోయింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామానికి చెందిన ఒక మహిళ తన ముగ్గురు కుమార్తెలను చంపి తాను కూడా ఆత్మహత్యకు పాల్ప‌డింది. తన ఇంట్లోనే తన కుమార్తెలతోపాటు తన మీద కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మాహుతికి పాల్ప‌డింది. ముక్కుప‌చ్చ‌లార‌ని ప‌సివాళ్ల‌తో క‌లిసి స‌జీవ ద‌హ‌న‌మై పోయింది. చిలుకూరు గ్రామానికి చెందిన అనిత (25) తన ముగ్గురు కుమార్తెలు అనిత మౌనిక (4), అక్షిత (3), జయలక్ష్మి (1) మీద కిరోసిన్ పోసి నిప్పంటించింది.  అనంతరం తాను కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మాహుతికి పాల్ప‌డింది. ఆమె భర్త గిరీష్ రాత్రి ఎనిమిదన్నర ప్రాంతంలో ఇంటికి వచ్చేస‌రికి తలుపు గడియ‌ వేసి వుంది. ఎంతసేపు తలుపు త‌ట్టినా తీయక పోవడంతో వాటిని బద్దలు కొట్టి చూస్తే లోపల భార్యాబిడ్డ‌ల‌ మృతదేహాలు కాలిపోయి కనిపించాయి. ఈ ఆత్మ‌హ‌త్య‌ల‌కు ఇంకా కార‌ణాలు తెలియ‌రాలేదు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.-పిఆర్‌.