వీళ్లా మన నేతలు?

మనం ఓట్లు వేస్తే గెలిచిన మన నేతలు అసెంబ్లీకి వెళ్ళి ఏమిచేయాలి? ప్రతి గంటకు లక్షలాది రూపాయల ఖర్చుతో నిర్వహించే అసెంబ్లీ సమావేశాలకు హాజరయిన ప్రజాప్రతినిధులు ఏమి సాధిస్తున్నారు? ఎన్నికలపుడే ప్రజాసమస్యల గురించి మాట్లాడే మన నేతలు ఆయా సమస్యల్ని పెంచి పోషిస్తున్నారే తప్ప,వాటిని పరిష్కరించే దిశగా ఏమాత్రం చొరవచూపడం లేదనడానికి మన అసెంబ్లీ సమావేశాలు జరుగుతోన్న తీరుచూస్తే తెలిసిపోతుంది.దాడులకు ఎదురు దాడులు మినహా సమస్యలకు పరిష్కారం చూపలేకపోతున్నారు. అధికారంలో ఉన్నామని,తాము ఏమైనా చేస్తామని తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తుంటే, బలమైన ప్రతిపక్షంలో ఉండి కూడా వైఎస్సార్‌ పార్టీ ధీటుగా ఎదుర్కోలేకపోతోంది. ఒక్క జగన్మోహన్‌రెడ్డి మినహా మిగిలిన సభ్యులు సభలో మాట్లాడే తీరు, అంశాలను లేవనెత్తే విధానంలో చాలా లోపం కన్పిస్తోంది. ఇంత బలమైన ప్రతిపక్షంలో ఉన్నపుడు అధికార పక్షాన్ని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించవచ్చు.కానీ అది జరగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. మొత్తం మీద అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలేవీ చర్చకు రావడం లేదు. పరిష్కారానికి నోచుకోవడం లేదు.

అసెంబ్లీలో సాగుతోన్న నాటకీయపరిణామాలనుచూసి ప్రజలు విస్తుపోతున్నారు. ఎన్నికల్లో తమ దగ్గరకువచ్చి ఓట్లు అడిగిన నాయకులు వీరేనా అని ఆశ్చర్యపోతున్నారు. వంగి వంగి నమస్కరించి,అడిగనవీ,అడగనవీ ఇచ్చేస్తామని చెప్పిన నేతలు ఇపుడు అసెంబ్లీ సాక్షిగా బూతులు తిట్టుకుంటూ,జబ్బలు చరుచుకుంటూ సవాళ్లకు ప్రతిసవాళ్లు విసురుకుంటుంటూ ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో సమస్యలు ఏమీ లేనట్లు ఒకరి పై మరొకరు పోటీ పడి మరీ తిట్ల దండకం అందుకొని,జీవిత చరిత్రలు తవ్వుకోవడం చూస్తుంటే, నవ్యాంధ్రప్రదేశ్‌ను ఏదిశగా వీరు తీసుకెళతారో అని ఆందోళన వ్యక్తం అవుతోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీ అధినేతల సమక్షంలోనే ఉభయ పార్టీల నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడటం చూస్తే భావి భారత పౌరులకు ఏమనిపిస్తుంది? రాజకీయాలంటే ఇప్పటికే నీచమైనవని, దీనిలోకి మంచివారెవరూ రాకూడదనే దురభిప్రాయం ఏర్పడిన నేపథ్యంలో వాటిని సవరించి,సంస్కరించాల్సిన నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతుంటే వాటిని మరిచి, ప్రజాధనంలో నిర్వహించే అసెంబ్లీ సమావేశాలను తప్పుదారి పట్టించి మరీ వీరంగం వేసేవారిని ఏమనాలి? అధికారం ఉంది కదాఅని,పదవులు ఉన్నాయి కదాఅని నోరుపారేసుకుంటే వారిని ఏమిచేయాలి? ప్రజలు ఇచ్చిన అధికారాన్ని స్వప్రయోజనాలకోసం దుర్వినియోగం చేసే వారిని ఎందుకు ఉపేక్షించాలి? అసెంబ్లీలో ఇరు పక్షాలు చేసే గలభాను రాష్ట్ర ప్రజలుచూసి ఈసడించుకుంటున్నారు. శాసనసభ్యుల్ని సముదాయించి,సర్దిచెప్పే పని కూడా ఆయా పార్టీల నేతలుచేయకపోవడం పట్ల మరింత విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధినేతల ప్రాపకం కోసం,అసెంబ్లీనే బరిగా చేసుకొని,మరీ వీరంగం వేసే నాయకులను అదుపుచేసే వ్యవస్థ ఎక్కడ? ప్రజా సమస్యలపై వారిని తీసుకెళ్లే దారి ఏదీ?

అధికారం ఉంటే ఏమైనాచేస్తారా?
తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు అనేక సంశయాలతో సతమతం అయింది. ఎన్నికల్ని జీవన్మరణ అంశంగా తీసుకొని ఎన్నికల బరిలోకి దిగింది. చావోరేవో అన్నట్లుగానే ఎన్నికల్లో వ్యవహరించింది. దశాబ్దకాలంపాటు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు తనకున్న శక్తి చాలదని భావించి,అధికారం సొంతం చేసుకోవడానికి బిజెపిని, పవన్‌కళ్యాణ్‌ను బరిలోకి దింపారు. అప్పటికీ అధికారం లోకి వస్తామనే నమ్మకం కలగలేదు. వైఎస్‌ఆర్‌సిపి ప్రబంజనం వీసే సమయం అది. అలాంటి పరిస్థితుల్లో అన్ని వర్గాల వారిని అకట్టుకునే ప్రయత్నాలుచేశారు. ఎదురు వచ్చిన ప్రతివారినీ వంచేప్రయత్నం చేశారు. తనవైపునకు తిప్పుకొన్నారు. ఆచరణకు సాధ్యం కాని అనేక హామీలు ఇచ్చారు. ఎలాగైనా అధికారంలోకి రావాలి. వై.సి.సి. అధికారానికి దూరంగా ఉంచాలి. ఇదే ప్రధానమైన అజెండాగా చంద్రబాబు ఎన్నికల బరిలోకి దిగారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ అలాగే చేశారు. వైసిపి అభ్యర్థుల్ని ఎదుర్కోవాలంటే వారికి ధీటైన వారిని రంగంలోకి దింపాలి. ధనం,కులం,ఇంకా అనేక అంశాలను ప్రామాణికంగా తీసుకొని మరీ అభ్యర్థుల్ని ఎంపిక చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చేవరకూ అంతటి ఘనవిజయం సాధిస్తామనే నమ్మకం ఎవరికీ లేదు. అనుకోని రీతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే సమయం వచ్చింది. వాటిని పక్కకు నెట్టేసే లా సకల ప్రయత్నాలు చేశారు. ఇంకా చేస్తున్నారు. రాజధాని నిర్మాణం అంశంలో కూడా ప్రజాగ్రహానికి గురయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకూ,చేస్తోన్న కార్యాచరణకూ ఏమాత్రం పొంతన లేదు. అయినా అధికారం ఉంది ముందుకు పోతున్నారు.

అయితే తెలుగుదేశం పార్టీలోని ఎమ్మెల్యేల విషయంలో కట్టడి,నియంత్రణ లేదనే చెప్పాలి. క్రమశిక్షణకు మారుపేరుగా తెలుగుదేశం పార్టీని వారు అభివర్ణించుకుంటారు. మరి అసెంబ్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన హడావిడి క్రమశిక్షణలో భాగమేనా? దీన్ని సమర్ధించుకునే రీతిలో ఇంకా ఆపార్టీ నేతలు వ్యవహరించడం మరింత ఇబ్బంది కరంగా మారింది. నిండు సభలో వ్యవహరించడం ఎలాగో కూడా తెలీని వారు ప్రజాప్రతినిధులు అవ్వడమే దీనికి కారణంగా భావించాల్సి వస్తోంది.తెలుగుదేశం పార్టీ లో ఎవరు ఏమి మాట్లాడాలన్నా గతంలో అధినేత అనుమతి ఉండేది. రాష్ట్ర పార్టీ నుంచి వచ్చే ఆదేశాలు,సందేశాల అనుగుణంగానే జిల్లా స్థాయిలోనూ,రాష్ట్ర స్థాయిలోనూ మాట్లాడేవారు. మరి ఇపుడు అసెంబ్లీలో కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరు సమర్ధనీయమా? తిట్లపురాణం ఎంతవరకూ సమంజసం? సభలో చర్చించాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి. పరిష్కరించాల్సిన అంశాలు చాలా ఉంటాయి. అవన్నీ మర్చిపోయి అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా నిండు సభలో వ్యవహరించడం ఏమాత్రం సమర్ధనీయం కాదు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఎంత సమర్ధంగా,సౌమ్యంగా వినియోగిస్తున్నామనే దానిపైన నాయకుల పాలన అధార పడి ఉంటుంది. ఈవిషయంలో అధికార పక్ష నేతలు విఫలం అయ్యారనే చెప్పాలి. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాల్సిన అవసరం ఉంది. అధికారంలోకి వచ్చామని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే మళ్లీ అసెంబ్లీ ముఖం చూడకుండా చేసిన సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయి. ఇప్పటికే అనేక వివాదాస్పద అంశాల్లో తలదూర్చి,ప్రజలకు దూరం అయ్యే ఎమ్మెల్యేలు ఎక్కువయ్యారు.భూకబ్జాలు,ప్రైవేలు సెటిల్మెంట్లతో బిజీ అయిన నేతలు ఇపుడు అసెంబ్లీ సాక్షిగా జబ్బలు చరుచుకుంటే సెటిల్మెంట్లు ఎక్కువగా వస్తాయనే భరోసా కూడా ఉన్నట్లు ఉంది. అందుకే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సందర్భంలేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. తగిన సమయంలో అంతిమ తీర్పు ఇస్తారు.

జగన్‌ ఒంటరిపోరు!
వైఎస్సార్‌ సిపి అధినేత జగన్మోహన్‌రెడ్డి దాదాపు ఒంటరిపోరాటం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడిన విధానం,లేవనెత్తిన అంశాలను చూస్తే జగన్‌లోతైన మనిషి అని తెలుస్తుంది. వైసిపి నేతలే కాకుండా,ప్రతిపక్షంలో ఉన్నవారూ సైతం జగన్‌ మాట్లాడే తీరును మెచ్చుకుంటున్నారు.

బలమైన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై పోరాడే విషయంలో అనుకున్న స్థాయిలో ముందుకు పోలేని స్థితి. కారణాలు ఏమైనా ప్రజలు కోరుకున్నది వేరు,వైసిపి చేస్తోంది వేరు. ఇపుడు అసెంబ్లీలో ఆపార్టీ వ్యవహరించే విధానంపైన కూడా ప్రజాసమ్మతంగా లేదు. ఆపార్టీ ఎమ్మెల్యేల విషయంలో నియంత్రణ లేదన్నట్లుగానే కన్పిస్తోంది. వైసిపి అధినేత ఇపుడు ఏమి మాట్లాడినా దాన్ని తప్పుదారి పట్టించే దిశగా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దీన్ని వైసిపి సరైన దిశగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం అయిందనే చెప్పాలి. బలమైన ప్రతిపక్షంగా ఉండి, ప్రజావ్యతిరేకతను కొద్దికాలంలోనే పోదిచేసుకున్న తెలుగుదేశం పార్టీపై వైసిపి సరైన దిశలో బాణం ఎక్కుపెట్టలేదు. వైసిపి తమకు ఏమాత్రం పోటీ ఇవ్వలేదని దేశం నేతలు భావిస్తున్నారు. ఈదిశగానే వారి కార్యక్రమాలు ఉంటున్నాయి. వాస్తవానికి తొమ్మిది నెలల కాలంలో ఇంత ప్రజావ్యతిరేకతను మూటకట్టుకున్న ప్రభుత్వం గతంలో ఎపుడూ లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు చాలు ఆపార్టీని ,ప్రభుత్వాన్ని తూర్పారపట్టడానికి. కానీ వైసిపి ఏమిచేస్తోంది? పార్టీ ఎమ్మెల్యేలు ఏమిచేస్తున్నారు? నిత్యం ప్రజలు ఎదుర్కొనే అనేక సమస్యలను పట్టించుకుంటున్నారా? అధికార పార్టీ నేతలు చేసే దందాలను నిలదీస్తున్నారా? ప్రజలకు అండగా నిలుస్తున్నారా? వారే ఓకసారి ఆత్మవిమర్శచేసుకోవాలి. వైసిపి నేత జగన్‌ ఒక్కరే పోరాటం చేస్తే సరిపోతుందా? ఇపుడు అసెంబ్లీలోనూ అదే జరిగింది. బూతుపురాణాలు విప్పినా,ప్రజావ్యతిరేక విధానాలను అమలుకు పూనుకున్నా ఎవరూ ఏమీ అనలేని దుస్థితి. వైసిపి నోరువిప్పితే వైఎస్సార్‌ అలా చేశారు,..జగన్‌ లక్షకోట్లు మింగేశారు అంటూ విషయాన్ని తప్పుదారి పట్టిస్తున్నారే తప్ప లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు. ఈవిషయాన్ని సరైన రీతిలో ప్రశ్నించ వారూ లేరు.

రాజకీయ నాయకుడు అవ్వాలంటే దందాలుచేయాలి. పంచాయతీలు నిర్వహించాలి. కోట్లకు పడగలెత్తాలి. ఎన్ని అవలక్షణాలు ఉంటే అంతగా అధికారంలోకి రావచ్చనే ఏకైక లక్ష్యంతో మన నేతలు ఉన్నారు. అవినీతి, అక్రమాలు ఇపుడు పెద్ద క్వాలిఫికేషన్‌గా మారాయి. అందుకే మన నేతల్లో అక్షరాలు రాని వారు,కేసుల్లో ఇరుక్కున్న వారుప్రజాప్రతినిధులు అవుతున్నారు. శీలం లేనివారు,సంస్కారం తెలీనివారు రాజ్యాధికారం చేపడుతున్నారు. ఇది మన ప్రజాస్వామ్య దుస్థితి. మన ప్రజల దౌర్భాగ్యం. చట్టసభల్ని కూడా వంచించే స్థితిని మన నాయకులు చేరారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే కళకంకం. పార్టీ మనుగడ బెదిరింపులతో ఇజంతో సాగకూడదు. ఈదిశగా మార్పు రావాల్సిన అవశ్యం ఉంది. – సిద్దార్థరాయ్‌