ఇసుక దందా

ఇసుక బంగారం అయిపోయింది. పార్టీలతో ప్రమేయం లేకుండా నాయకులంతా ఇసుకను మేసేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుకను క్యూబిక్ మీటర్ లెక్కన కొలిచి మరీ అడ్డగోలుగా వ్యాపారం నిర్వహిస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకొని రాష్ట్రంలోని ఇసుక రీచ్ లన్నీ ఇప్పుడు రాజకీయ నాయకులకు బంగారు బాతులా తయారయ్యాయి. అనుమతుల్లేకపోయినా అడ్డగోలుగా ఇసుకను తరలిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. దీనికి తెలుగుదేశం ప్రభుత్వం అనుసరించే లోపభూయిష్టమైన విధానాలే కారణంగా భావిస్తున్నారు. పేరుకు డ్వాక్రా మహిళలు అని చెప్పి, అక్రమార్జన మాత్రం అధికార పార్టీ నేతలే అనుభవిస్తున్నారు. వీటిపై ప్రశ్నించేవారు కాని, చర్యలు తీసుకోనే వారు కాని లేరు. దీంతో ఇప్పుడు ఇసుక అక్రమ వ్యాపారం రాజకీయ నాయకులకు మూడు పువ్వులు, ఆరు కాయలుగా మారిపోయింది. అక్రమాన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం మార్గాలు ఆలోచిస్తే.. అందుకు అక్రమార్కులు మరిన్ని పథక రచనలు చేస్తూ ఇసుకను వ్యూహాత్మకంగా తరలించేస్తున్నారు. ఇసుకను పారదర్శకంగా ప్రజలకు అందించాలని డ్వాక్రా మహిళలకు రీచ్ ల నిర్వహణ బాధ్యతను అప్పగిస్తే వారి చేతుల్లో నుంచి దాన్ని లాక్కోవడానికి ఇసుకాసురులు తెర వెనుక లాబీయింగ్స్ తో పావులు కదుపుతున్నారు.

‘‘అడ్డుక్కునేవాడికి 66 కూరలు’ అన్న చందాన ఇసుకను తరలించేందుకు మాఫియాదారులకు 100 మార్గాలు అన్న రీతిలో రాష్ట్రవ్యాప్తంగా ఇసుక అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున జరుగుతున్న ఇసుక తరలింపు దందా అంతా ఇంతా కాదు. ఇసుకను పారదర్శకంగా విక్రయిస్తామని, అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామనే ప్రభుత్వ ప్రకటనలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. ప్రభుత్వ నూతన విధానం అక్రమార్కులకు వరంలా మారుతోంది. ప్రభుత్వం ఇసుక క్వారీల నిర్వహణా బాధ్యతను డ్వాక్రా మహిళల చేతుల్లో పెట్టింది. అయితే ఇసుక మాఫియా డ్వాక్రా మహిళలను పక్కకు నెట్టేసి గుట్టుచప్పుడు కాకుండా ఇసుకను గద్దల్లా తన్నుకుపోతున్నారు. ముఖ్యంగా ర్యాంప్ ల నిర్వహణ బాధ్యతలు తీసుకున్న డ్వాక్రా మహిళలు రాజకీయ నేతలు, పార్టీల కార్యకర్తలు కావటంతో అక్రమార్కుల పని సులభమౌతోంది. కొందరు ప్రజాప్రతినిధులు ఈ అక్రమాల్లో తెరవెనక పాత్ర పోషిస్తుండటం విశేషం. కృష్ణానది వెంబడి ఉన్న భవానీపురం, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం, సూరాయిపాలెం ఇసుక రేవులు అక్రమాలకు కేంద్రంగా మారాయి. నిత్యం వందల సంఖ్యలో బిల్లుల్లేకుండానే లారీల్లో ఇసుక అక్రమంగా తరలివెళ్లిపోతున్నా అధికారులు ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహారిస్తూ ‘ సరైన పర్యవేక్షణ‌ లేకపోవడం కూడా ప్రభుత్వానికి రూ.కోట్లలో నష్టం వస్తుంది.
బోట్స్ మెన్ సొసైటీలదే హవా..

నదిలోని ఇసుకను తీసుకుని వచ్చి లారీల్లో డంపింగ్ చేసే బాధ్యతను కొన్ని బోట్స్ మెన్ సొసైటీలు తీసుకున్నాయి. అయితే ఈ సొసైటీలకు నాయకులు వారి సొంత లారీలను తీసుకుని వచ్చి బిల్లులు లేకుండానే ఇసుకను తరలించుకుపోతున్నారు. సర్కార్ కు ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే ఇసుక రవాణా సాగిపోతోంది. 6 క్యూబిక్ మీటర్ల లారీ ఇసుక తీసుకెళ్లేందుకు రూ.3,900లు మీ-సేవలో చెల్లించాలి. ట్రాన్స్ పోర్టుకు మరో రూ.వెయ్యి అవుతోంది. అంటే ఒక్కో లారీకి రూ.5 వేలు వరకు ఖర్చవుతోంది. ఈ రూ.5 వేలు కూడా ఖర్చు కాకుండా ఇసుక మాఫియా సొంతంగా లారీలను పెట్టి ఇసుకను తరలించేస్తున్నారు. బయటి మార్కెట్లో లారీ ఇసుక రూ.6 వేలు వరకు పలుకుతోంది. నది వెంబడి ఉన్న ఒక్కో ర్యాంప్ నుంచి రోజుకు 40కు పైగా లారీల్లో ఇసుక ఎలాంటి బిల్లులు లేకుండా తరలివెళ్తోంది. నాలుగు ర్యాంప్ ల మీద రోజుకు 160కి పైగా లారీల ఇసుక అక్రమ మార్గంలో వెళ్లిపోతుంది. అంటే సుమారున రోజుకు ప్రభుత్వానికి రూ.4 లక్షలకు పైగా నష్టం వాటిల్లుతోంది. మార్కెట్ రేట్ ప్రకారం నెలకు రూ.2 కోట్ల వరకు మాఫియా సొమ్ము చేసుకుంటోంది.

నిబంధనలు కాగితాలకే పరిమితమా..
ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వ ఆదేశాలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. ర్యాంప్ ల వద్ద ఇసుకను లారీల్లోకి నింపేందుకు ఎలాంటి జేసీబీలను వినియోగించకూడదు. భవానీపురం, సూరాయిపాలెం రేవుల్లో జేసీబీల వాడకం ఎక్కువగా ఉంటోంది. ర్యాంప్ కు సమీపంలోనే వీటిని కన్పించకుండా ఉంచుతున్నారు. అనువుగా ఉన్న సమయంలో జేసీబీలను బయటకు తీసుకుని వచ్చి లారీల్లో నింపి ఇసుకను తరలిస్తున్నారు. భవానీపురం ర్యాంప్ నుంచి ఎక్కువగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా లారీల్లో తరలివెళ్తుండటంతో స్థానిక ప్రజలు నరకయాతన చవిచూడాల్సి వస్తోంది. బిల్లుల్లేకుండా ఇసుక రవాణా చేస్తే లారీకి రూ.75 వేలు జరిమానా విధించాలని, జేసీబీలను వినియోగిస్తే రూ.25 వేలు జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినా ఫలితం శూన్యం. ముఖ్యంగా ఇసుక ర్యాంప్ లపై తమదే రాజ్యం అన్నట్లుగా అడ్డుఅదుపు లేకుండా వ్యవహరిస్తున్నారు. విజిలెన్స్, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ కొరవడడం కూడా ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.
పట్టీపట్టనట్లుగా విజిలెన్స్..
ఇసుక అక్రమాలపై విజిలెన్స్, రెవెన్యూ అధికారుల దృష్టికి వచ్చినా పట్టించుకోవటం లేదనే వాదనలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. విజిలెన్స్, రెవెన్యూ, తదితర విభాగాల అధికారులు ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. అడపా దడపా ర్యాంప్ ల వద్దకు పరిశీలించేందుకు విజిలెన్స్ అధికారులు వచ్చి హడావుడీ చేసినా ఇసుక మాఫియా నేతలు వీరిని ప్రలోభాగాలకు గురి చేస్తుండటంతో మిన్నకుండిపోతున్నారు. దీంతో అనధికారికంగా ఇసుక తరలింపు జరిగిపోతుంది. లెక్కలన్నీ పెద్ద చిక్కులే.. నది వెంబడి ఉన్న భవానీపురం గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం, సూరాయిపాలెం ర్యాంప్ లు గత ఏడాది అక్టోబర్ లో ప్రారంభమయ్యాయి. వీటి వద్ద తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు నిముషం కూడా ఖాళీ లేకుండా ఇసుక ఫిల్లింగ్ జరుగుతోంది. ఏ ర్యాంప్ చూసినా లారీలతో ఖాళీ లేకుండా ఉంటుంది. కానీ అధికారుల లెక్కలు చూస్తే మాత్రం అతి తక్కువగా ఉంటున్నాయి. పై నాలుగు ర్యాంప్ ల తర్వాత ప్రారంభించిన పెదపులిపాక ర్యాంప్ లో మాత్రం 400 పైగా లారీలు బుక్ అవుతున్నాయి. నది వెంబడి ఉన్న నాలుగు ర్యాంప్ లో మాత్రం అతి తక్కువ స్థాయిలో లారీలు ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతున్నాయి. గత నెల 22 నుంచి 28 వరకు వారం వ్యవధిలో ఐదు ర్యాంప్ లలో బుక్ అయిన ఇసుక వివరాలే ఇందుకు నిదర్శనం. నది వెంబడి ఉన్న నాలుగు ర్యాంప్ లలో కలిపి వారం వ్యవధిలో 2,580 లారీలు బుక్ అయితే.. పెదపులిపాక ఒక్క ర్యాంప్ లోనే 2,999 లారీలు బుక్ అయ్యాయి. అంటే నాలుగు ర్యాంప్ లలో అనధికారికంగా ఇసుక తరలివెళ్తోందనే నిజం. ఒక విజయవాడ, కృష్ణాజిల్లాలోనే కాకుండా తూర్పు, పశ్చిమ, గుంటూరు జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కృష్ణా, గోదావరి తీరాల్లో ఉన్న ఇసుకను అక్రమ మార్గాన తరలించి, రూ.కోట్లకు పడగలెత్తే నాయకుల భరతం పట్టాల్సిన అవసరం ఎంతైనా. కాని దీనికి అధికార పార్టీ సాహసిస్తుందా అన్నదే ప్రశ్నార్థకం. మొత్తం మీద సహజ సంపదగా ఉన్న ఇసుకను కూడా రాజకీయ నాయకులు మింగేయడం వారి అవినీతికి పరాకాష్టగానే భావించాలి.

-సిద్ధార్ధా రాయ్