టీఆర్ఎస్ ఎంఐఎం క‌టీఫ్‌!

జ‌న‌గాం ఎన్‌కౌంట‌ర్ తెలంగాణలో పెద్ద రాజ‌కీయ డ్రామాకు తెర‌తీయ‌బోతోందా? ఎన్‌కౌంట‌ర్ పేరు చెప్పి టీఆర్ఎస్ ఎంఐఎం క‌టీఫ్ అవుతాయా? ఆ త‌ర్వాత ఓట్ల వేట‌లో విడివిడిగా పోటీ ప‌డ‌తాయా? మ‌ళ్లీ క‌లిసిపోతాయా ? ఇవే సందేహాలు ఇప్పుడు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ ఏడాది చివ‌రి లోపు జీహెచ్ఎంసి ఎన్నిక‌లు జ‌రిగి తీర‌తాయ‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే జ‌రిగిన జ‌న‌గాం ఎన్‌కౌంట‌ర్ రాబోయే మ‌హాన‌గ‌ర ఎన్నిక‌ల్లో డ్రామాగా మార‌బోతోంద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది.

మొన్న‌టి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ఎస్ ఓడిపోయింది. బీజేపీ అభ్య‌ర్థి రామ‌చంద్ర‌రావు మొద‌టి ప్రాధాన్య‌త ఓటుతోనే గెలిచారు. అది కూడా టీఎన్జీవోల అధ్య‌క్షుడిగా ఉన్న దేవీప్ర‌సాద్ మీద బీజేపీ గెల‌వ‌డం అంటే టీఆర్ఎస్‌కు ఒకర‌కంగా తొలి ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్టే. ఇప్ప‌టికే టీఆర్ఎస్ ఎంఐఎం రెండూ క‌లిసి ప‌ని చేస్తున్నాయ‌ని మిగిలిన ప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి.( ఇన్నాళ్లూ అధికారంలో ఉన్న‌ ఏ పార్టీతోనైనా కామ‌న్‌గా ఎంఐఎం దోస్తీ క‌డుతూనే ఉంది). ఇదే అభిప్రాయం జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లోనూ వ్య‌క్త‌మైతే ఒక‌ర‌కంగా టీఆర్ఎస్ కు కొంత ఇబ్బంది త‌ప్ప‌దు. ఎంఐఎం ప్రాబ‌ల్యం ఉన్న ప్రాంతాల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు మిగిలిన పార్టీల‌కు వెళ్లిపోతుంది. అది ఎంఐఎంకు ఇబ్బందే. మిగిలిన ప్రాంతాల్లో ఎంఐఎంను వ్య‌తిరేకించే వారు టీఆర్ఎస్ కి ఓటు వేయ‌రు. అది బీజేపీకి లాభిస్తుంది. లేదంటే మ‌రొక‌రికి ఉప‌యోగ‌ప‌డుతుంది. అంటే ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల్చాల‌న్న‌ది టీఆర్ఎస్ వ్యూహంగా ఉంటుంది. ఎంత‌లేద‌న్నా పాత‌బ‌స్తీలో ఎంఐఎం ప‌ట్టునిలుపుకుంటుంది. అందుకోస‌మే ఇప్పుడు జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్ అంశాన్ని వాడుకోవాల‌ని ఎంఐఎం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

ఎన్‌కౌంట‌ర్ నేప‌థ్యంలో ఒక వ‌ర్గం వ్య‌తిరేక‌త‌ను అధికార పార్టీ మూట‌గ‌ట్టుకున్నా అది ఎంఐఎంకు ఇబ్బందే. త‌న‌కున్న ఓట్ల‌ను కూడా అది కోల్పోయే ప్ర‌మాదం ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే ఆ పార్టీ అధ్య‌క్షుడు అస‌దుద్దీన్ ఓవైపీ జ‌న‌గాంలో జ‌రిగింది ఎన్‌కౌంట‌ర్ కాద‌ని, హ‌త్య‌ల‌ని ఆరోపించారు. అంటే అధికార పార్టీకి, ఎంఐఎంకు మ‌ధ్య విమ‌ర్శ‌ల దాడి మొద‌ల‌వుతున్న‌ట్టే లెక్క‌.అంటే టీఆర్ఎస్ ఎంఐఎం విడిగా పోటీ చేస్తేనే ఇద్ద‌రికీ ఉప‌యోగం అన్న వ్యూహాన్ని అమ‌లు చేయొచ్చు. నిజంగా ఇదే జ‌రుగుతుందా? లేదంటే ఎంఐఎం అధికార పార్టీ శాశ్వ‌తంగా దూర‌మవుతాయా ? అన్న‌ది రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నిక‌లే తేలుస్తాయి. కాక‌పోతే ఈ రెండు పార్టీలూ వేసే వ్యూహాల‌కు మిగిలిన పార్టీలు ఎలాంటి ఎత్తుగ‌డ‌లు వేస్తాయ‌న్న‌దీ ఆస‌క్తిక‌ర‌మే.