టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి పిచ్చిప‌ట్టింది: నాగం

‘‘ఉస్మానియాలో 24 అంతస్తుల ట్విన్‌ టవర్లు కడతానని సీఎం కేసీఆర్‌ చెబుతున్నారు. ఆ ఆసుపత్రి భవనం వార‌స‌త్వానికి ప్ర‌తీక‌.. ఏ కట్టడం కూలకొట్టి భవనం కడతారు? ఆ ట్విన్ ట‌వ‌ర్స్ చెస్ట్‌ ఆసుపత్రిలోనే కట్టవచ్చు క‌దా?’’ అని బీజేపీ సీనియర్‌ నేత నాగం జనార్దన్‌ రెడ్డి అన్నారు. ఆనాలోచిత నిర్ణయాలకు సచివాలయంలోని సీ బ్లాకు నిలయంగా మారిందని, పిచ్చి ప్రభుత్వం అంటే ఇదేనని ఆయ‌న‌ ధ్వజమెత్తారు. సచివాలయంలోని మీడియాతో మాట్లాడుతూ… హైదరాబాద్‌లో కాలుష్యం పెరిగిపోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో చెస్ట్‌ ఆసుపత్రి అవసరం ఉందన్నారు. ఇక్కడ చెస్ట్‌ ఆసుపత్రి వద్దనే మూర్ఖులు సీ బ్లాక్‌లో తప్ప ఎక్కడైనా ఉంటారా అని ప్ర‌శ్నించారు. మరోవైపు.. ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రిని ఎర్రగడ్డ నుంచి తరలిస్తే ఉద్యమిస్తామని నాగం హెచ్చరించారు. ఆయుర్వేద కళాశాలలో విభాగాలను తరలించొద్దని డిమాండ్‌ చేస్తూ నిర్వహిస్తున్న రిలే దీక్షలు గురువారం మూడో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా నాగం జనార్దన్‌రెడ్డి, శ్యాం సుందర్‌గౌడ్‌ దీక్షలకు మద్దతు పలికారు.-పీఆర్‌.