కమ్యూనిస్టు మేరునగం.. నర్రా కన్నుమూత

తెలంగాణ కమ్యూనిస్టు ఉద్యమ యోధుడు, సీపీఎం కురువృద్ధ నాయకుడు నర్రా రాఘవరెడ్డి అనారోగ్యంతో మరణించారు. 1924లో జ‌న్మించిన‌ ఆయన  కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్నారు. నాలుగురోజుల క్రితం తన నివాసంలో ఆయన జారి పడిపోయారు. అప్పటినుంచి ఆయన ఆరోగ్యం విషమించింది. శరీరంలో చక్కెర నిల్వల శాతం పెరిగిపోయి.. గుండె, కాలేయం, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తడంతో.. చికిత్స క్రమంలో తుది శ్వాస విడిచారు. నల్లగొండ జిల్లాను అభివృద్ధిలో నలుగురూ మెచ్చేవిధంగా తీర్చిదిద్దిన ఆదర్శ రాజకీయ నేత నర్రా రాఘవరెడ్డి ఆయన కృషి వల్లనే కృష్ణా జలాలు నల్లగొండకు దక్కాయని, బీబీనగర్‌ నుంచి నడికుడి వరకూ రైలు మార్గం నిర్మాణం జరిగిందని, సన్నిహితులు గుర్తు చేసుకున్నారు. నర్రా రాఘవరెడ్డి. సామాజిక విప్లవ ఉద్యమాల్లో కీలక భూమిక పోషించారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. శుక్ర‌వారం న‌ల్గొండ జిల్లాలోని స్వ‌గ్రామం వ‌ట్టిమ‌ర్రిలో జ‌రిగిన అంత్య‌క్రియ‌ల‌కు భారీగా జ‌నం హాజ‌ర‌య్యారు. అంత‌కుముందు ఆయ‌న భౌతిక‌కాయానికి పూల‌మాల‌లు వేసి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు నివాళులర్పించారు.అధికార లాంఛ‌నాల‌తో ఆయ‌న అంత్య‌క్రియలు జ‌రిగాయి.-పీఆర్‌