Telugu Global
Others

ఆదాయం ఘనం.. సౌకర్యాలు శూన్యం...

ఆదాయం ఘనం.. సౌకర్యాలు శూన్యం…ఇది విజయవాడ రైల్వే డివిజన్ ఘనత విజయవాడ రైల్వే డివిజన్ ఆదాయం రూ.వేల కోట్లకు దాటుతున్నా ప్రయాణికులకు సౌకర్యాల కల్పనలో మాత్రం రైల్వేశాఖ విఫలమవుతోంది. ప్రయాణికుల రద్దీకనుగుణంగా ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక రైళ్ల బోగీలు దశాబ్దాలనాటివి కావడంతో చిన్న ప్రమాదం చోటుచేసుకున్నా భారీ ప్రాణనష్టం సంభవించే ప్రమాదం పొంచి ఉంది. గతంలో గూడూరు వద్ద తమిళనాడు ఎక్స్ ప్రెస్‌లో జరిగిన అగ్నిప్రమాదమే దీనికి నిదర్శనంగా చెప్ప‌వ‌చ్చు. తెల్లదొరల కాలంనాటి బోగీలు కావడంతో ఒక […]

ఆదాయం ఘనం.. సౌకర్యాలు శూన్యం...
X

ఆదాయం ఘనం.. సౌకర్యాలు శూన్యం…ఇది విజయవాడ రైల్వే డివిజన్ ఘనత

విజయవాడ రైల్వే డివిజన్ ఆదాయం రూ.వేల కోట్లకు దాటుతున్నా ప్రయాణికులకు సౌకర్యాల కల్పనలో మాత్రం రైల్వేశాఖ విఫలమవుతోంది. ప్రయాణికుల రద్దీకనుగుణంగా ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక రైళ్ల బోగీలు దశాబ్దాలనాటివి కావడంతో చిన్న ప్రమాదం చోటుచేసుకున్నా భారీ ప్రాణనష్టం సంభవించే ప్రమాదం పొంచి ఉంది. గతంలో గూడూరు వద్ద తమిళనాడు ఎక్స్ ప్రెస్‌లో జరిగిన అగ్నిప్రమాదమే దీనికి నిదర్శనంగా చెప్ప‌వ‌చ్చు. తెల్లదొరల కాలంనాటి బోగీలు కావడంతో ఒక స్టేషన్ దాటి మరో స్టేషన్‌కు చేరుకునేలోపే బోగీ పూర్తిగా ఆహుతై పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాతపడ్డారు.
దేశవాళీ తయారీ రైల్వే బోగీల వల్ల అనేక ప్రమాదాలు ముంచుకొస్తున్నా రైల్వేశాఖ నిర్లక్ష్యం వీడటం లేదు. అగ్ని ప్రమాద నిరోధక కోచ్‌ల అవసరాన్ని గుర్తించినా వాటిని ఎక్కువగా తయారు చేయించడం ల‌ేదు. దేశీయ పరిజ్ఞానంతో ఇంటిగ్రల్ కోచ్ లను తయారు చేస్తున్నారు. వీటిల్లో ఒకచోట అగ్ని ప్రమాదం జరిగితే కోచ్ లోని మిగిలిన భాగానికి మంటలు వ్యాపించకుండా నిరోధించే గుణం లేదు. ఇంటిగ్రల్ కోచ్ లు పెద్ద ప్రమాదాలను తట్టుకోవడం లేదు. అతివేగంగా వెళ్లే రైలు ప్రమాదానికి గురై కోచ్ లు తిరగబడితే నుజ్జునుజ్జవుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించడానికి అత్యాధునిక పరిజ్ఞానంతో ఎల్.హెచ్.బి.కోచ్ ల తయారీని రైల్వే మొదలుపెట్టింది. వీటికి అగ్నిని నిరోధించే శక్తి ఉంది. ఈ కోచ్ లో మంటలు ఎక్కడైనా అంటుకుంటే అక్కడి నుంచి అగ్నికీలలు ముందుకు కదలవు. కోచ్ తయారీకి వాడే ప్రత్యేక పదార్థగుణమే ఇందుకు కారణం. ఈ కోచ్ అతి దృఢంగా ఉండటం వల్ల భారీ ప్రమాదం జరిగినా కూడా ధ్వంసం కాకుండా తట్టుకుంటాయి. ప్రాణనష్టం చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. కపుర్తలా, చెన్నైతో పాటు మరికొన్ని కర్మాగారాల్లో వీటిని త‌యారు చేస్తున్నా ఏటా వీటి సంఖ్య ఐదు వేల‌కు మించ‌డం లేదు. కారణం సరైన బడ్జెట్ కేటాయింపులు లేకపోవడమే. విజయవాడ డివిజన్ పరిధిలో సుమారు 2 వేలకుపైగా బోగీలుండగా, ఎల్.హెచ్.బి.బోగీలు అతి తక్కువగానే ఉన్నాయి. రైల్వేశాఖ మరిన్ని కర్మాగారాలను ఏర్పాటుచేసి వీటి తయారీని పెంచితేనే ప్రమాదాలను తట్టుకోవచ్చు. లేదంటే ప్రమాదాలు జరిగినపుడు భారీ నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది.
కమిటీ సిఫార్సులన్నీ బుట్టదాఖలు…
రైల్వే వ్యవస్థలో చిన్న చిన్న మార్పులు చేస్తే అగ్నిప్రమాదాల నుంచి భారతీయ రైల్వేను సురక్షితంగా బయటపడేయొచ్చని ‘అనిల్ కకోద్కర్ కమిటీ’ చేసిన సిఫార్సులను రైల్వేశాఖ గాలికొదిలేయడంతో ప్రయాణికుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. రైల్వే వ్యవస్థను గాడిన పడేయడానికి గత యూపీఏ ప్రభుత్వంలోని రైల్వే మంత్రి దినేష్ త్రివేదీ శ్యాంపిట్రోడా, అనిల్ కకోద్కర్ లతో పూర్తిస్థాయిలో అధ్యయనం చేయించేలోపే మంత్రి మరాడంతో నివేదికలన్నీ బుట్టదాఖలయ్యాయి. రైల్వే ప్రమాదాల్లో 2 శాతం మంది అగ్నిప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక శాతం మంది గాయపడుతున్నారు. అనిల్ కకోద్కర్ కమిటీ నివేదిక ప్రకారం ఏటా ఈ ప్రమాదాల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గముఖం పట్టడంలేదు. అలాగే భారతీయ రైల్వే రోజూ 11 వేల ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుపుతోంది. అందులో సుమారు 114 ప్యాంట్రీ కార్లున్నాయి. వీటిలో 71 శీతలీకరణవికాగా 343 నాన్ ఎయిర్ కండీషన్ వి. నాన్ ఏసీ కార్లలో వంటంతా గ్యాస్ సిలెండర్ల పైన వంట బయటికి కన్పించేలా చేస్తున్నారని, ఇలా చేయడం పూర్తిగా నిషిద్ధమని కకోద్కర్ కమిటీ హెచ్చరిస్తోంది.
అర్థరాత్రి సమయాల్లో..
అగ్ని ప్రమాదాల్లో 88 శాతం రాత్రి 2 నుంచి ఉద‌యం 6 గంటల్లోనే జరుగుతున్నాయి. రైల్వేలో తగిన అగ్నిమాపక యంత్రాలు కానీ, హెచ్చరికల వ్యవస్థ కానీ లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని ఈ నివేదిక తేల్చింది. ప్రస్తుతం రైల్వే కోచ్ లో అక్కడక్కడా డ్రైకెమికల్ పౌడర్ తో కూడిన అగ్నిమాపక యంత్రాలు మాత్రమే ఏర్పాటు చేశారు. ఇవి కూడా ఇంజన్లు, గార్డు వ్యాన్లు, పాంట్రీకార్లు, శీతల బోగీల్లో మాత్రమే కనిపిస్తాయి. కోచ్ ల్లో ఏదైనా పొగ అలముకున్నట్లుగానీ, మంటలు చెలరేగినట్లుకానీ తెలిసినప్పుడు మాత్రమే వీటిని ఉపయోగిస్తున్నారు. ఇలాంటి ప్రాథమిక ఏర్పాట్లు ప్రమాదాల నియంత్రణకు ఏమాత్రం సరిపోవడం లేదని కమిటీ తేల్చింది. రైళ్లు పరుగులు తీసే సమయంలో బోగీల్లో ఏదైనా పొగవస్తే పసిగట్టి హెచ్చరికలు జారీచేసే వ్యవస్థ ఇంతవరకూ విజయవంతం కాలేదని కమిటీ పరిశీలనలో వెల్లడైంది. మైక్రో ప్రొఫెసర్ ఆధారిత అగ్నిప్రమాద హెచ్చరికల సంకేత వ్యవస్థకు సంబంధించిన ఏర్పాట్లు ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయి. అగ్నిమాపక సంకేత వ్యవస్థను రైలుకు బ్రేకులు వేసే వ్యవస్థతో అనుసంధానం చేయాల్సి ఉందని, దీంతోపాటు మంటలను పసిగట్టే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు బోగీల్లో ప్రయాణికులను హెచ్చరిస్తూ బిగ్గరగా శబ్ధం చేసే వ్యవస్థను అక్కడక్కడా ఏర్పాటు చేయాలని పేర్కొంది. వైమానిక భద్రతా ప్రమాణాల ప్రకారం విమానంపైకి ఎగిరేటపుడుకానీ, దిగేటప్పుడుకానీ ఏదైనా ప్రమాదం జరిగితే 90 సెకన్లలో ప్రయాణికులను ఖాళీచేయించే విధంగా వ్యవస్థ ఉంటుందని, రైల్వేలో అలాంటిది లేదని కమిటీ వేలెత్తి చూపించింది. రైళ్లలో అత్యవసర కిటికీల నుంచి బయటకు దూకడం అంత సులభం కాదు. కాబట్టి ప్రతి బోగీలో మడత పెట్టగలిగే నిచ్చెనలు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఈ కమిటీ సూచించింది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇంకా పాతవాటినే రైల్వేశాఖ కొనసాగించడం ఆందోళన కల్గించే విషయం. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పాత బోగీలను తక్షణం మార్చి ఎల్.హెచ్.బి.బోగీలను వినియోగించాల్సి ఉంది. కమిటీ సిఫార్సులు అమలు జరిగేలా ఎంపీలు రైల్వే మంత్రిపై ఒత్తిడి తేవాలి. ప్రమాదాలకు కారణమవుతున్న ప్యాంట్రీకార్లను తక్షణం తొలగించాల్సి ఉంది.
First Published:  11 April 2015 4:55 AM GMT
Next Story