సత్యమూర్తికి ఎన్ కౌంటర్ దెబ్బ

రీసెంట్ గా విడుదలైన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా టాలీవుడ్ లో నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా అయితే గ్రాండ్ గా రిలీజైంది కానీ మొదటి రోజు నుంచే బ్యాడ్ టాక్ తెచ్చుకోవడంతో వసూళ్లపై దాని ప్రభావం బాగా కనిపిస్తోంది. మరోవైపు ఈ సినిమాని కన్నడ-తమిళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేశారు. సినిమాలో ఉపేంద్ర ఉన్నాడు కాబట్టి సన్నాఫ్ సత్యమూర్తి సినిమాని స్ట్రయిట్ గా రిలీజ్ చేశారు. అటు తమిళనాట డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేశారు. కాకపోతే.. తమిళ్ లో మాత్రం సన్నాఫ్ సత్యమూర్తిపై ఎన్ కౌంటర్ ఎఫెక్ట్ బాగానే పడింది.

శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లను ఏపీ పోలీసులు హతమార్చారు. దీంతో తమిళనాట నిరసనలు వెల్లువెత్తాయి. అన్యాయంగా 20మంది కూలీల్ని చంపేశారని ఆరోపిస్తున్నాయి ఆ రాష్ట్ర రాజకీయ పార్టీలు. ఏపీ బస్సుల అద్దాలు పగలడంతో పాటు తెలుగు సినిమాలు ఆడుతున్న థియేటర్ల వద్ద కూడా నిరసనలు కొనసాగాయి. ఇది బన్నీ సినిమాకి పెద్ద దెబ్బగా మారింది. ఏకంగా చెన్నైలోని 60సెంటర్లలో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాని రిలీజ్ చేశారు. కానీ ఏ ఒక్క సెంటర్ లో కూడా ఫుల్ రన్ నడవలేదు. ప్రతిచోటా నిరసనలే. తెలుగు సినిమాలు ప్రదర్శిస్తే ఊరుకోమంటూ థియేటర్ల యాజమాన్యాలకు హెచ్చరికలు కూడా వెళ్లాయి. అలా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా వసూళ్లలో వెనకబడ్డాడు సన్నాఫ్ సత్యమూర్తి.