బెజవాడలో బుల్లెట్ కల్చర్!

దోపిడీ చేయాలన్నా, హత్యలు చేయాలన్న కత్తులు, బరిసెలు వాడే కాలం ఇక చెల్లిపోయింది. పెరుగుతున్న టెక్నాలజీకనుగుణంగా సంఘ విద్రోహశక్తులు తుపాకీలనే ఆయుధాలుగా చేసుకొని రెచ్చిపోతున్నారు. ప‌గాప్ర‌తీకారాలు తీర్చుకోవడానికి కిరాయి హంతకులు గన్స్ ను ఇష్టానుసారంగా వినియోగిస్తూ ‘బుల్లెట్ దిగిందా లేదా అన్న విధంగా’ చెలామణి అవుతుంటే పోలీస్ యంత్రాంగం ఏమి చేయలేని పరిస్థితి. దారిదోపీడీలకు సైతం గన్ ను ‘పాయింట్ బ్లాక్ రేంజ్’ లో గురిపెట్టి తమ కార్యకలాపాలను సాగించుకుపోతున్నారు. రాజధాని నగరం బెజవాడపై పంజా విసురుతున్నగన్ కల్చర్ పై ప్రత్యేక కథనం.
తూటాలు దూసుకొస్తున్నాయి.. తెలుగు రాష్ట్రాలనే టార్గెట్ చేసుకుని ప్రత్యర్థులపై తుపాకీ గురి పెట్టేస్తున్నారు. పగాప్రతీకారాలు ప్రాణాలు తీస్తున్నాయి. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. చిన్న వివాదాలకే తుపాకీని ఆటవస్తువులా వినియోగించడం కలవరం కల్గిస్తోంది. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో తయారవుతున్న తుపాకులను ఎటువంటి అనుమతులూ లేకుండా మధ్యవర్తుల ద్వారా రహస్యంగా కొనుగోలు చేసి రప్పించుకుని వినియోగించేవారు ఇటీవ‌ల కాలంలో పెరిగిపోతున్నారు. ప్రొఫెషనల్ కిల్లర్స్ ను రప్పించి తమ ప్రతీకారాలను తీర్చుకునే వారు పెరగడం ఆందోళన కల్గిస్తోంది. కొద్ది నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న కాల్పుల సంఘటనలతో ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. నూతన రాజధాని బెజవాడలో ఇటీవల ఈ గన్ కల్చర్ హద్దులు, అవధులు దాటిపోయింది. ఇటీవల కాలంలో భూ వివాదాలు, మనీ మోసాలు, సెటిల్మెంట్లు ప్రాణాలు తీసుకునే స్థితికి కార‌ణ‌మ‌వుతున్నాయి. అనేక సంఘటనలలో పోలీసులు అక్రమంగా తరలిస్తున్న గన్స్ ను పట్టుకొని వారిని అరెస్ట్ చేస్తున్నప్పటికీ తుపాకీతో కాల్చి హత్యలు చేసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. పోలీసులు కూడా లైసెన్స్ డ్ గన్ లపై నిషేధాన్ని అమలు పరుస్తున్నారు. కానీ నాటు తుపాకీలు, అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్న తుపాకులపై దృష్టి సారించకపోవడంపై కలవరపరిచే అంశం.
విజయవాడ కమిషనరేట్ పరిధిలోని పెదఅవుటపల్లిలో కాల్పుల ఘటన, నందిగామ కాల్పుల సంఘటన తర్వాత కమిషనరేట్ పరిధిలో కొత్త గన్ లైసెన్స్ లను జారీ చేయడంపై నిషేధం విధించారు. అలాగే గతంలో తీసుకున్న లైసెన్స్ లను రెన్యువల్ చేయడంలోనూ పూర్తిస్థాయి భద్రతా కోణాల పరిశీలన జరుగుతోంది. అలాగే కొత్త ఆయుధానికి లైసెన్స్ ఇవ్వడం అత్యంత క్లిష్టమైన వ్యవహారంగా మార్చి వేశారు. నగరంలో ఉన్న ఆర్మ్ డ్ వెపన్స్ లో కూడా చాలా వరకు ఏటీఎం సెంటర్లు, బ్యాంకుల వద్ద భద్రతా కారణాల గురించి తీసుకున్నవి. అయినప్పటికీ ఉత్తర భారతదేశంలో ఆయుధాల తయారీ, అమ్మకాలపై పూర్తిస్థాయిలో నిషేధం లేకపోవడంతో మధ్యవర్తులు నాటు తుపాకీలు కొనుగోలు చేసి తెప్పిస్తున్న పరిస్థితులున్నాయి. నిఘా వ్యవస్థను మరింత పటిష్ట పరిచి ప్రజలకు భరోసా ఇవ్వాలని నగరవాసులు ఖాకీలను కోరుతున్నారు.
నగరంలోకి ప్రధాన రవాణా మార్గాలైన రైల్వే రోడ్ రవాణాపై పూర్తిస్థాయిలో చెక్ పోస్టుల ద్వారా తనిఖీలు జరిపి అనుమతించాల్సి అవసరం ఉంది. లైసెన్స్ డ్ ఆయుధాలు కలిగి ఉన్నవారి కన్నా నేరస్తులు మరింత ప్రమాదకరంగా ఉంటారు. ఆయుధం కలిగి ఉన్నవారి కన్నా దానిని చేజిక్కించుకుని దాడి చేయడంలో నేరస్థులే తెగింపు కలిగి ఉంటారు. ఆయుధాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. నూతన ఆయుధాల జారీలో రాష్ట్రం నిర్థిష్టమైన పాలసీని ప్రకటించింది. అలాగే జిల్లాలో పూర్తిస్థాయిలో నిషేధాన్ని అమలు పరుస్తుండడంతో లైసెన్స్ డ్ ఆర్మ్స్ సంఖ్య 120కి పరిమితం చేశారు. దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, ఏపీలో గన్ కల్చర్ తక్కువనే చెప్పాలి. రెండు మూడేళ్లుగా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో అక్రమ ఆయుధాల ఉపయోగం పెరుగుతూ వస్తోంది. వాటితో సరిపోలిస్తే ఏపీ సేఫ్ జోన్ లోనే ఉంది. అయితే ఇటీవల కొన్ని నెలల నుంచి ఈ ప్రాంతంలో కూడా ఈ సంస్కృతి పెరగడం సేఫ్ జోన్ పై సందేహాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 48 ఆయుధాలను పట్టుకుని 70 మందిని అరెస్ట్ చేయగా, 2014లో 37 ఆయుధాలను పట్టుకుని 78 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఆయుధాలను కానీ, వాటిని కలిగి ఉన్నవారిని కానీ పట్టుకోలేదు. అయితే 2012లో ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా 486 ఆయుధాలను స్వాధీన పరుచుకుని, 32 మందిని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి పోలీస్ ఉన్నతాధికారులు ఆయుధాలపై దృష్టి పెట్టడంతో ఈ సంఖ్య గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది. కాగా, కమిషనరేట్ పరిధిలో మొత్తం 326 లైసెన్స్ డ్ ఆర్మ్స్ ఉన్నాయి. వీటిలో ఈ ఏడాదికి రెన్యువల్ చేసినవి 264 కాగా, రెన్యువల్ చేయాల్సినవి 34 ఉన్నాయి. వివిధ కారణాల రీత్యా 28 ఆయుధాల‌కు లైసెన్స్ రెన్యువల్ చేయకుండా రద్దు చేశారు. ఇప్పటికైనా పోలీసులు బెజవాడలో పెరుగుతున్న గన్ మర్డర్స్ పై, గన్ల వినియోగంపై ప్రత్యేక దృష్టిపెట్టి గన్ దారులను నిలువరించాల్సి ఉంది.