Telugu Global
Family

దేవుడి కన్నా గొప్పవాడా?

ఒక రాజు గొప్ప దాన శీలి. సాధారణ జనం నించీ పండితుల దాకా అందరికీ అడిగింది లేదనకుండా యిచ్చేవాడు. చెయ్యికి ఎముకలేనివాడనే కీర్తిని పొందాడు. అందరూ ఆయన్ని దానకర్ణుడి కంటే గొప్పవాడని పొగిడేవారు. రాజు సంతోషంతో వుప్పొంగిపోయేవాడు. రాజుదగ్గర భజనపరులు ఎప్పుడూ వుంటారు.

ఒక రాజు గొప్ప దాన శీలి. సాధారణ జనం నించీ పండితుల దాకా అందరికీ అడిగింది లేదనకుండా యిచ్చేవాడు. చెయ్యికి ఎముకలేనివాడనే కీర్తిని పొందాడు. అందరూ ఆయన్ని దానకర్ణుడి కంటే గొప్పవాడని పొగిడేవారు. రాజు సంతోషంతో వుప్పొంగిపోయేవాడు.

రాజుదగ్గర భజనపరులు ఎప్పుడూ వుంటారు. అయినదానికీ కానిదానికీ రాజును ఆకాశానికెత్తుతూ వుంటారు. రాజు అహంకారానికి ఆజ్యం పోసి దాన్ని పెద్ద చేయడమే వారి పని. సాధారణంగా విమర్శకన్నా అభినందనలకు ఎదురు చూడ్డమన్నది మానవనైజం. ఇక రాజుల సంగతి చెప్పనక్కర్లేదు.

రాజు దగ్గర ఆస్థాన విద్వాంసుడు వుండేవాడు.రాజును పొగిడి రాజ సన్మానాలందుకోవడంలో అతన్ని మించిన వాళ్ళు లేరు. రాజు మీద రకరకాల పద్యాలు, పాటలు రాశాడతను. దానికి తగిన భాషా పాటవం, పాండిత్యం అతని దగ్గరున్నాయి.

ఒక రోజు రాజు నిండు కొలువులో వుండగా పండితుడు అందరిముందు రాజును వినూత్నంగా అభినందించాలని సంకల్పించి 'మీరు రారాజులు. దేవుడు యివ్వకూడదన్న వారికి కూడా మీరు యిస్తారు.దేవుడు సంకల్పించని వ్యక్తి పట్ల కూడా మీరు దాతృత్వం వహిస్తారు. ఆ కారణంగా మీరు దేవుని కన్నా గొప్పవారు' అన్నాడు.

సభలో కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. వూహించని ఈ కొత్త రకం కీర్తనకు రాజు పొంగిపోయాడు. పండితుడు ఎంత చమత్కరించాడు.పండితులకే కాక సామాన్యులకు కూడా నేను సహాయం చేస్తుంటాను కదా! అందుకని పండితుడు సముచితంగా నన్ను కీర్తించాడు' అని సంతోషించి ఎవరక్కడా? అని పిలిచాడు. సేవకులు 'ఆజ్ఞ' అని తలవంచి నిలబడ్డారు. రాజు వారితో ఏదో తీసుకురమ్మన్నాడు. ఏవయినా ఆభరణాలో, వజ్రాలో, ధనం సంచో తెమ్మని రాజు ఆదేశించాడని పండితుడనుకున్నాడు.

సేవకులు ఒక పుచ్చకాయను తెచ్చి రాజుకిచ్చారు. రాజు దాన్ని పండితుడికిచ్చాడు. పండితుడు నీరసించిపోయాడు. యింత అభినందనకు యింత చిన్న బహుమానమా? అని మనసులో అనుకుని కాదనకూడదు కాబట్టి దాన్ని తీసుకుని వీధిలోకి వచ్చాడు.

ఒక పేదవాడు పండితుణ్ణి చూసి 'స్వామీ! ఆ పండు అమ్ముతారా!' అన్నాడు. 'చిరాకుగా వున్న పండితుడు తీసుకో అన్నాడు. పేదవాడు నా దగ్గర రెండు పైసలే వున్నాయన్నాడు. ఫరవాలేదు తీసుకో' అని రెండు పైసలకు ఆ పండు యిచ్చేశాడు.

పేదవాడు యింటికి వెళ్ళి పండుకోశాడు. దాని నిండుగా రత్నాలు వజ్రాలు వున్నాయి. అతను ఆశ్చర్యపోయి తన అదృష్టానికి భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

రెండ్రోజులు గడిచాకా పండితుడు మళ్ళీ సభలో రాజును కీర్తించాడు అందుకు రాజు 'మీరు ఆ పండు తిన్నారా?' అని అడిగాడు. పండితుడు 'రెండు పైసలకు అమ్మేశాను' అన్నాడు. రాజు నిర్ఘాంతపోయాడు.రాజు అహంకారం కరిగిపోయింది.

రాజు 'ఆ పుచ్చకాయ నిండుగా రత్నాలు, వజ్రాలు వున్నాయి.మీ అతిపొగడ్తకు నేను అహంకరించి మీకది యిచ్చాను.దేవుడు కాదన్న వాడికి నేను ఎలాయివ్వగలను. మీకు దేవుడు దాన్ని యివ్వదలచుకోలేదు. నేను ప్రయత్నించాను. కానీ నేనొకటి తలిస్తే దైవమొకటి తలిచింది. ఎవరికో అజ్ఞాతవ్యక్తికి ఆ ఐశ్వర్యమందింది. ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే. అది నిర్ణయించేది దేవుడే. నేను అహంకరించి దేవుడు చెయ్యలేని పనిని చేస్తాననుకున్నాను. దేవుడు నాకూ మీకూ తగిన గుణపాఠం నేర్పాడు' అన్నాడు.

పండితుడు తల వంచుకున్నాడు.

- సౌభాగ్య

First Published:  11 April 2015 9:13 PM GMT
Next Story