ప్రస్తుతానికి రేసుగుర్రమే

ఒక సినిమా సూపర్ డూపర్ హిట్టయిన తర్వాత దాన్ని మించిన మూవీ తీయాలని ఆరాటపడతారు ఎవరైనా. తన రికార్డుని తానే బద్దలుకొట్టుకుంటే ఆ కిక్కే వేరు. కానీ అందరికీ, అన్నివేళలా ఇది సాధ్యం కాకపోవచ్చు. బన్నీ విషయంలో ఇదే జరిగింది. రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ తో కలిసి సన్నాఫ్ సత్యమూర్తి సినిమా చేశాడు బన్నీ. కాంబినేషన్ అదుర్స్ కాబట్టి రేసుగుర్రం రికార్డులు తుడిచిపెట్టుకుపోతాయని అంతా భావించారు. కానీ రిలీజైన తర్వాత రేసుగుర్రమే బెటరనే విషయం అర్థమైంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రేసుగుర్రం సినిమా చేశాడు బన్నీ.అల్లువారబ్బాయ్ కెరీర్ లో ఇప్పటివరకు బిగ్గెస్ట్ హిట్ ఇదే. బన్నీని తొలిసారిగా 50కోట్ల క్లబ్లోకి తీసుకెళ్లిన చిత్రం కూడా ఈ రేసుగుర్రమే. నిజంగా బన్నీ కోసమే ఈ కథ అన్నట్టు తెరకెక్కింది ఆ సినిమా. బన్నీ కోసమే ఈ ట్యూన్స్ అన్నట్టు వాయించాడు తమన్. అలా అన్నీ కలిసొచ్చి రేసుగుర్రంతో కళ్లుచెదిరే విజయం అందుకున్నాడు అల్లుఅర్జున్. కానీ ఆ వెంటనే వచ్చిన త్రివిక్రమ్ మూవీ మరింత కళ్లుచెదిరే కాంబినేషన్ కావడంతో అంతా రేసుగుర్రాన్ని నంబర్-2 కింద జమకట్టేశారు. సన్నాఫ్ సత్యమూర్తి వస్తోంది కాబట్టి.. రేసుగుర్రం బన్నీ కెరీర్ లో నంబర్-2నే అని ఫిక్స్ అయిపోయారు మెగాఫ్యాన్స్.కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే.. బన్నీ కెరీర్ లో మరికొన్నాళ్లు రేసుగుర్రమే అగ్రస్థానంలో ఉండేట్టు కనిపిస్తోంది.