Telugu Global
NEWS

జల రవాణాకు మార్గం సుగమం

జాతీయ జల రవాణా మార్గం-4 నిర్మాణంలో ఒక అడుగు ముందుకు పడింది. ఈ మార్గంలో తొలి భాగమైన ఉత్తర బకింగ్ హామ్ కాలువ (ఎన్.బి.సి)ను నౌకాయానానికి అనువుగా అభివృద్ధి చేసే ప్రతిపాదనకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నతస్థాయి కమిటీ తాజాగా ఆమోదం తెలిపింది. ఎన్బీసీపై ప్రస్తుతం ఉన్న వంతెనలు, రోడ్ క్రాసింగ్ లను దృష్టిలో పెట్టుకుని సాధ్యాసాధ్యాల నివేదిక, తదితరాలను సమర్పించాలని సూచిస్తూనే భారత జలమార్గాల ప్రాధికార సంస్థ (వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ […]

జల రవాణాకు మార్గం సుగమం
X
జాతీయ జల రవాణా మార్గం-4 నిర్మాణంలో ఒక అడుగు ముందుకు పడింది. ఈ మార్గంలో తొలి భాగమైన ఉత్తర బకింగ్ హామ్ కాలువ (ఎన్.బి.సి)ను నౌకాయానానికి అనువుగా అభివృద్ధి చేసే ప్రతిపాదనకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నతస్థాయి కమిటీ తాజాగా ఆమోదం తెలిపింది. ఎన్బీసీపై ప్రస్తుతం ఉన్న వంతెనలు, రోడ్ క్రాసింగ్ లను దృష్టిలో పెట్టుకుని సాధ్యాసాధ్యాల నివేదిక, తదితరాలను సమర్పించాలని సూచిస్తూనే భారత జలమార్గాల ప్రాధికార సంస్థ (వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) సమర్పించిన ప్రతిపాదనకు కమిటీ సానుకూలత తెలియజేసింది. ఉత్తర బకింగ్ హామ్ కాలువ ఆంధ్రప్రదేశ్ లోని రొంపేరు లాక్ (పెద్దగంజాం) వద్ద మొదలై తమిళనాడులోని ఎన్నూరు సముద్ర ముఖం వరకూ 316 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. ఈ మార్గం అభివృద్ధికి రూ.353.13 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ మొత్తంలో పూడిక తీత (డ్రెడ్జింగ్)కే రూ.256 కోట్ల మేర ఖర్చు కానుంది.
జాతీయ జల రవాణా-4లో కేంద్రం ఆమోదించిన కాకినాడ-పాండిచ్చేరి మార్గంలో ఉత్తర బకింగ్ హామ్ కాలువ భాగం తొలిదశలో ఉంది. రెండో దశలో కొమ్మమూరు కాలువ, ఏలూరు కాలువ, కాకినాడ కాలువ సుమారు 302 కిలోమీటర్లు, చివర్లో భద్రాచలం-రాజమండ్రి, వజీరాబాద్-విజయవాడ మార్గాలను నౌకా రవాణాకు అనువుగా అభివృద్ధి చేస్తారు. ఈ జల రవాణాలో గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం జరుగుతుంది. ఉత్తర బకింగ్ హామ్ కాలువ వెడల్పు 15 మీటర్ల నుంచి 30 మీటర్ల వరకూ ఉంది. అయితే ఆక్రమణలతో ప్రస్తుతం కాలువ రూపే మారిపోగా, పూడిక పేరుకుపోయింది. గట్లూ కోతకు గురయ్యాయి. కాలువ పొడవునా కయ్యలు ఉన్నాయి. కాలువపై వివిధ చోట్ల 35 వంతెనలు, 23 లాకులు ఉన్నాయి. వీటిని తొలగించి ఎత్తు పెంచి నిర్మించాల్సి ఉంది. నౌకలు రెండు వైపులా తిరగడానికి వీలుగా పూడిక తీసి వెడల్పు చేయాల్సి ఉంది. గట్లను పటిష్టం చేయాలి. ఇందుకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 183 హెక్టార్ల మేర భూ సేకరణ చేయాల్సి ఉంటుందని గుర్తించారు.
ఈ మార్గంలో సరకు దిగుమతి, ఎగుమతి, ప్రయాణికులు ఎక్కడానికి, దిగ‌డానికి వీలుగా పెద్ద గంజాం నుంచి ఎన్నూరు మధ్య నాలుగు టెర్మినళ్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం, నెల్లూరు జిల్లాలో మైపాడు, దుగరాజపట్నం, తమిళనాడులోని ఎన్నూరు (దక్షిణ)లో వీటిని నిర్మిస్తారు. టెర్మినళ్లపై ఇప్పటికే ఒక అధ్యయనం జరిగింది. కొత్తపట్నం సమీపంలో గ్రానైట్ (చీమకుర్తి) గనులు ఉండడంతో ఆహార ధాన్యాలతో పాటు గ్రానైట్ రవాణాకు ఇక్కడి టెర్మినల్ ఉపయోగపడుతుందని గుర్తించారు. మైపాడు టెర్మినల్‌ నుంచి చేపలు, సముద్రపు ఉత్పత్తులను చెన్నై అవసరాలకు ఎగుమతి చేయవచ్చని పరిశీలనలో తేలింది. చెన్నై నుంచి ఎరువులను ఇక్కడకు దిగుమ‌తి చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దుగరాజపట్నం టెర్మినల్ బొగ్గు దిగుమతికి ఉపయోగపడుతుందని గుర్తించారు.
First Published:  11 April 2015 10:05 PM GMT
Next Story