జర నవ్వండి ప్లీజ్ 47

ముద్దు… క్రిములు

ఒక ప్రొఫెసర్‌ క్లాసులో సూక్ష్మక్రిముల గురించి చెబుతున్నాడు.
‘ఒక అబ్బాయి ఒకమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడనుకో. నిముషానికి అతని ముద్దు ద్వారా అమ్మాయి నోట్లోకి నలభైవేల సూక్ష్మక్రిములు వెళతాయి తెలుసా?’ అన్నాడు.
అందరూ ఆసక్తిగా విన్నారు.
‘అట్లాంటప్పుడు మనం ఎట్లాంటి చర్య తీసుకోవాలి?’ ప్రశ్నించాడు ప్రొఫెసర్‌.
వెంటనే ఒకమ్మాయి లేచి ‘ఆ నలభై వేల క్రిముల్ని ఆ అబ్బాయికి ఇచ్చేయాలి’ అంది.

************

ఊరేగింపు

ఒక అమెరికన్‌ టూరిస్టు పోలెండ్‌ వచ్చాడు. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఊరేగింపు సాగుతోంది. జనం పోలీసుల మీద రాళ్లు రువ్వుతున్నారు. ఆ అమెరికన్‌ ‘పోలీసుల మీద రాళ్లు రువ్వడం తప్పు. మా దేశంలో అయితే టమోటాలు, కోడిగుడ్లు విసురుతారు’ అన్నాడు. పక్కనే ఉన్న పోలెండ్‌ వ్యక్తి ‘మాకు ఆ టమోటాలు, కోడిగుడ్లు ఉంటే మేము ఊరేగింపులే చేయం’ అన్నాడు.

***********

పిల్ల చేష్టలు

ఒక బర్త్‌డే పార్టీలో ఇద్దరు పిల్లలు గొప్పలు చెప్పుకుంటున్నారు.
కుర్రాడు : మా నాన్న మీ నాన్నని కొట్టేస్తాడు తెలుసా?
రెండో కుర్రాడు : అదేం గొప్ప కాదు, మా అమ్మను కొట్టమను చూద్దాం.

***********

తల్లి చాటు బిడ్డ

తల్లి : రామూ! ఎందుకేడుస్తున్నావ్‌?
రాము : నా వేలికి దెబ్బ తగిలింది.
తల్లి : ఎప్పుడు తగిలింది?
రాము : అరగంటైంది
తల్లి : మరి అప్పుడు ఏడవడం నేను వినలేదు
రాము : అప్పుడు నువ్వు లేవనుకున్నాను మమ్మీ!