బడా కాదు.. ఇది ఛోటా మల్టీస్టారర్

            మల్టీస్టారర్ అంటే మనం ఎప్పుడూ వెంకటేష్-పవన్, మహేష్-వెంకటేష్ లాంటి కాంబినేషన్ల గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ ఇప్పుడు చోటా మల్టీస్టారర్లు కూడా పుట్టుకొస్తున్నాయి. చిన్న హీరోలంతా కలిసి సినిమాలు చేస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఇలాంటి కాంబినేషన్లు కూడా సినిమాలకు కాస్త క్రేజ్ తీసుకొచ్చి పెడుతున్నాయి. ఇలాంటిదే మరో ప్రయత్నం మోసగాళ్లకు మోసగాడు సినిమా కోసం జరిగింది. 
        సుధీర్ బాబు-నందిత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం మోసగాళ్లకు మోసగాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. అయితే ఈ సినిమాలో సుధీర్ బాబుతో పాటు మంచు మనోజ్ కూడా ఉన్నాడు. అవును.. సినిమాలో ఓ పాత్రకు ఎవరైనా స్టార్ హీరో ఉంటే బాగుంటుందని యూనిట్ భావించింది. అందుకే మంచు మనోజ్ ను సంప్రదించింది. కథ, అందులో తన పాత్ర నచ్చిన మనోజ్ వెంటనే సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు. మంచు మనోజ్ ఒప్పుకోవడం.. 2 రోజుల పాటు కాల్షీట్లు ఇవ్వడం.. సినిమా షూటింగ్ కూడా పూర్తవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. సో.. మోసగాళ్లకు మోసగాడు సినిమా ఓ ఛోటా మల్టీస్టారర్ మూవీ అనుకోవచ్చు. బోస్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు చక్రి చిగురుపాటి నిర్మాత.