13 ఏప్రిల్ విహంగ వీక్షణం -2

షార్‌లో కంప్యూటర్ మాయం
నెల్లూరు: వ‌ఇ విజ‌య‌ప‌రంప‌ర‌ల్లో త‌ర‌చూ వార్త‌ల్లోకి ఎక్కుతున్న శ్రీ‌హ‌రికోట అంత‌రిక్ష కేంద్రం -షార్‌… ఈసారి ఓ చోరీ కేసు ద్వారా వార్త‌ల్లోకి ఎక్కింది. ఈ కేంద్రంలో ఉన్న ఓ కంప్యూట‌ర్ నాలుగు రోజుల నుంచి క‌నిపించ‌కుండా పోయింది. అస‌లు ఈ కంప్యూట‌ర్ ఎలా పోయింది? దీన్ని ఎవ‌రు ఎత్తుకుపోయారు… అస‌లు దొంగ‌ల అంత‌రంగం ఏమిటి? అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఆ కంప్యూటర్ షార్ లో మాయమైంది కనుక అందులో అనేక ర‌హ‌స్య విష‌యాలు ఉండ‌వ‌చ్చు. భ‌విష్య‌త్ ప్ర‌యోగాల‌కు ఆటంకం క‌లిగే అవ‌కాశం కూడా లేక‌పోలేదు. ఇందులో ఏమైనా ర‌హ‌స్య స‌మాచారం ఉంటే అది శ‌త్రువుల‌కు ఉప‌యోగ‌ప‌డొచ్చు. దీనివ‌ల్ల షార్ ప్ర‌యోగాల‌కు ఇబ్బంది క‌ల‌గ‌వ‌చ్చు. దొంగ‌త‌నానికి గురైన కంప్యూట‌ర్‌ షార్‌లోని  ఫస్ట్ లాంచ్ ప్యాడ్‌ దగ్గర మెస్ బిల్లుల కూపన్లకు సంబంధించిన కౌంట‌ర్ ద‌గ్గ‌ర ఉండేది.  అస‌లు ఈ కంప్యూట‌ర్‌ను ఎత్తుకెళ్ళాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది అనే కోణంలో ఇపుడు దర్యాప్తు జ‌రుగుతుంది. జాతీయ స్థాయిలో అత్యంత కీలకమైన ఈ సంస్థలో చోరీ జరగడం కలకలం రేపింది.
సహజీవనం… ఆపై సజీవ దహనం
తెనాలి: అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధమై ఇద్దరు సజీవ దహనమైన సంఘటన గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… గండికోట మణికంఠ అనే వ్యక్తి స్థానికంగా ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.  ఒక్కసారిగా వీరి ఇంటి నుంచి మంటలు చెలరేగాయి. ఆ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం పోలీసులు ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా చిన్నారి, మహిళ మృతదేహాలను గుర్తించారు. మణికంఠే వారిద్దరినీ హత్య చేసి ఇంటికి నిప్పంటించి పరారై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. డీఎస్పీ, సీఐలు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శిక్షను సవాలు చేసిన రామలింగరాజు
హైదరాబాద్ : సత్యం కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తనకు ఏడేళ్లు జైలు శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ ఆ సంస్థ వ్యవస్థాపక సీఈవో రామలింగరాజు నాంపల్లి కోర్టులో అప్పీల్ చేశారు. ఈ మేరకు సంబంధిత పత్రాలను ఆయన తరఫు న్యాయవాదులు  కోర్టుకు సమర్పించారు. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు సహా 10 మందిని  ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. వారందరికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతోపాటు మొదటి, రెండో నిందితులుగా ఉన్న రామలింగరాజు, రామరాజుకు భారీగా, ఇతర నిందితులకు లక్షల్లో జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి బీవీఎల్‌ఎన్ చక్రవర్తి తీర్పు ఇచ్చారు. దీన్ని స‌వాలు చేస్తూ రామ‌లింగ‌రాజు, రామ‌రాజు నాంప‌ల్లి కోర్టులో అప్పీలు చేశారు.
ఎస్‌.బీ.ఐ. గృహ రుణాలపై వడ్డీరేట్లు తగ్గింపు
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌.బీ.ఐ.) గృహ రుణాలపై వడ్డీ రేట్లను పావు శాతం వరకూ తగ్గించింది. ఈ తగ్గింపు సోమవారం నుంచి కొత్త గృహ రుణాలకు వర్తిస్తుందని ఎస్‌.బీ.ఐ. ప్ర‌క‌టించింది. ఇంతకు ముందు 10.15 శాతంగా ఉన్న వడ్డీ రేటును 9.9 శాతానికి తగ్గించామని పేర్కొంది. మహిళలకైతే 10.10 శాతం నుంచి 9.85 శాతానికి తగ్గించామని వివరించారు. మహిళలకు ఇచ్చే గృహ రుణాలపై వడ్డీరేటు బేస్‌రేట్ (9.85 శాతంగా)తో సమానంగా ఉందని వివరించారు. ఇతరులకైతే బేస్‌రేట్ కంటే ఐదు శాతమే అధికమని తెలిపింది. ఈ కొత్త రేట్లు ఈ నెల 13 తర్వాత మంజూరయ్యే కొత్త  గృహ రుణాలకు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఫ్లోటింగ్ రేట్ విధానంలో గృహ రుణాలు తీసుకున్న ప్రస్తుత రుణ గ్రహీతలకు బేస్ రేట్ తగ్గింపు కారణంగా ఈ.ఎం.ఐ.ల భారం కొంత తగ్గుతుందని ఎస్‌బీఐ పేర్కొంది.
రాహుల్ కలల ప్రాజెక్టు రద్దు
లక్నో: సొంత లోక్‌సభ నియోజకవర్గం అమేథీని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు కేంద్రంగా మలచాలనే రాహుల్ గాంధీ కలలు కల్లలయ్యాయి. అమేథీలోని జగదీశ్‌పూర్‌లో ఆదిత్య బిర్లా గ్రూపు సహకారంతో మెగా ఫుడ్ పార్కుకు రాహుల్ 2013లో శంకుస్థాపన చేశారు. అయితే ఈ ఫుడ్ పార్కును కేంద్రంలోని ఎన్డీయే సర్కారు రద్దు చేసింది. ఈ ఫుడ్ పార్కును దక్కించుకున్న శక్తిమాన్ ఫుడ్‌పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ (బిర్లా గ్రూపునకు అనుబంధ సంస్థ) అనే సంస్థ ఆరు నెలల్లోగా భూసేకరణను పూర్తి చేయలేకపోయిందని, అలాగే పలు ఇతర అంశాల్లో కూడా ఒప్పందంలోని నిబంధనలకు కట్టుబడలేదని… అందువల్లే ఫుడ్‌పార్కును రద్దు చేశామని ఫుడ్‌ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇందులో ఏర్పాటు చేసే క్యాప్టివ్ పవర్ ప్లాంటుకు సబ్సిడీపై గ్యాస్‌ను సరఫరా చేయకపోతే… ప్రాజెక్టు ఆర్థికంగా మనజాలదని శక్తిమాన్ సంస్థ తెలిపిందని… అయితే సబ్సిడీపై గ్యాస్ సరఫరా చేయాలనే నిబంధన ఫుడ్‌పార్క్ పాలసీలోనే లేదని ఆయన అన్నారు. రాహుల్ సన్నిహితులు మాత్రం రద్దు నిర్ణయంపై మండిపడుతున్నారు.
‘ఈ జూలై నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ’
విజయవాడ: ఈ ఏడాది జూలై నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీకి శ్రీకారం చుడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. 13 జిల్లాల ఎక్సైజ్ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. పుష్కరాల నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో నాటు సారా నిరోధానికి పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకూ 70 మందిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 7,800 బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేసి 7500 మందిని అరెస్ట్ చేసినట్లు రవీంద్ర పేర్కొన్నారు.
కేరళ మద్యం విధానానికి హైకోర్టు సమర్ధన
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వ మద్యం విధానాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు సమర్ధించింది. కేరళలోని బార్‌ యజమానులకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువడింది. ఫైవ్ స్టార్ హోటల్స్, అనుమతించిన బార్లలో మాత్రమే మద్యం విక్రయించాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో తప్ప మిగిలిన చోట్ల మద్యం విక్రయించడాన్ని నిషేధిస్తూ కేరళ ప్రభుత్వం గత సంవత్సరం సెప్టెంబరులో ఆదేశాలు జారీ చేసింది. కొత్త విధానంతో రాష్ట్రంలోని దాదాపు 730 బార్లను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్య వివక్షతతో కూడినదిగా ఉందని బార్‌ యజమానులు విమర్శిం చారు. దీనివల్ల తాము చేసే వ్యాపారం కోల్పోవడమే కాకుండా,  పర్యాటక రంగం కూడా దెబ్బతింటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది కపిల్‌ సిబల్‌ మాట్లాడుతూ మద్యం అమ్మడం బార్‌ యజమానుల ప్రాధమిక హక్కేమీ కాదన్నారు.
సీఎం కేసీఆర్‌ను కలిసి రామోజీరావు
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావును సోమవారం నాడు రామోజీ గ్రూపు సంస్థ‌ల ఛైర్మ‌న్‌ రామోజీరావు కలిశారు. ఈ సందర్భంగా రామోజీఫిల్మ్‌ సిటీ దగ్గర నిర్మించతలపెట్టిన ‘‘ఓం ఆధ్యాత్మిక నగరం’’ కాపీ టేబుల్‌ బుక్‌ మొదటి ప్రతిని సీఎం కేసీఆర్‌కు అందజేశారు. ఓం సిటీలో 108 ప్రసిద్ధ ఆలయాల నమూనాలను నిర్మిస్తున్నామని, ఈ సిటీ అంతా తిరిగేందుకు వారం పడుతుందని రామోజీరావు సీంఎ కేసీఆర్‌కు తెలిపారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌ ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక నగరం నిర్మిస్తున్నందుకు రామోజీని ఆయ‌న అభినందించారు. హైదరాబాద్‌లో ఆధ్యాత్మిక నగరం నిర్మాణంతో 30 వేల మందికి ఉపాధి అవకాశం క‌లుగుతున్నందుకు సంతోషం వ్య‌క్తం చేశారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఓం ఆధ్యాత్మిక నగర నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు.
జిల్లాల్లో కూబింగ్‌… భారీగా ప‌ట్టుబ‌డ్డ ‘ఎర్ర’దొంగలు ..
తిరుపతి : శేషాచ‌లం ఎన్‌కౌంటర్ సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్ప‌టికీ ఎర్ర చందనం దొంగ‌లు వెన‌క్కు త‌గ్గిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. అడవుల్లోకి చొరబడి ఎర్రచందనం దుంగలను యథేచ్ఛగా వాహనాల్లో తరలిస్తున్నారు. గ‌త రెండు రోజులుగా కడప, నెల్లూరు జిల్లాల్లో కూంబింగ్‌ చేస్తున్న పోలీసులకు 134 మంది ఎర్ర చంద‌నం దొంగలు పట్టుబడ్డారు. వీరి నుంచి దాదాపు రెండు కోట్లకు పైగా విలువైన ఎర్రచందనం దుంగలు, వాహనాలు, సెల్‌ఫోన్లు, గొడ్డళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఎన్‌కౌంట‌ర్ సంద‌ర్భంగా త‌ప్పించుకున్న వారిని పట్టుకోవడానికి 400 మంది పోలీసులను ఐజీ వేణుగోపాలకృష్ణ నేతృత్వంలో అడవుల్లోకి పంపారు. మరోవైపు కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పోలీసులూ ఎర్రదొంగల కోసం జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా రాపూరు, కడప జిల్లా రాజంపేటల్లో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 30 మంది కూలీలు పరారయ్యారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా 16మంది ఆచూకీ తెలిసింది. కూలీలను బలి చేస్తూ రింగ్ మాస్టర్లగా వ్యవహరించిన స్మగ్లర్ల జాబితా పోలీసుల చేతికి అంద‌డంతో బడా స్మగ్లర్లు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయిన‌ట్టు తెలిసింది.
30న తెలంగాణలో రవాణా బంద్‌
హైదరాబాద్‌: రవాణా రంగాన్ని ప్రైవేట్‌ పరం చేసి బాధ్యతల నుంచి తప్పించుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రోడ్డు రవాణా, భద్రత బిల్లు-2014ను వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో ఏప్రిల్‌ 30న తలపెట్టిన బంద్‌ను తెలంగాణ రాష్ట్రంలో విజయవంతం చేయాలని భారతీయ ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్టు మజ్దూర్‌ మహాసంఘ్ పిలుపు ఇచ్చింది. రోడ్ సేప్టీ బిల్‌లోని అంశాలు దేశంలో రవాణా రంగంలోని కార్మికుల నడ్డి విరిచే విధంగా ఉన్నాయని బీఎంఎస్‌ జాతీయ అధ్యక్షుడు రాజేంద్రసోనీ, ఉపాధ్యక్షుడు కర్తార్‌ సింగ్‌ విమర్శించారు. రవాణా శాఖలో కనీస చలాను 5000లకు పెంచడం దుర్మార్గమని విమర్శించారు. సంస్కరణల పేరిట చేపట్టిన మార్పులను పరిశీలిస్తే కేంద్ర మంత్రి గడ్కరీ రవాణా వ్యవస్థను నాశనం చేస్తున్నట్టుగా ఉందన్నారు.-పీఆర్‌