కోబలిపై సస్పెన్స్ వీడింది?

కోబలి ఈ సినిమా పేరుచెప్పగానే ఎవరికైనా పవన్ కల్యాణ్ గుర్తొస్తారు. కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్నాడు పవన్. కేవలం ప్రీప్రొడక్షన్ పనుల కోసమే లక్షల్లో ఖర్చుచేశాడు. ఈ సినిమాకు పనిచేసేందుకు కొంతమంది అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్లతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాడు. కానీ ఇప్పటివరకు కోబలి సినిమా సెట్స్ పైకి రాలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ మూలనపడిందనే ప్రచారం మొదలైంది. కోబలి సినిమాని ఇక మరిచిపోవడం బెటరని అంతా ఫిక్సయిపోయారు కూడా. కానీ ఇంతలోనే ఈ సినిమాని మరోసారి లైమ్ లైట్ లోకి తీసుకొచ్చాడు త్రివిక్రమ్. 
కోబలి సినిమా ఆగిపోలేదంటున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమా ఇంకా చర్చల దశలోనే ఉందని, ఎప్పటికైనా పవన్, తను కలిసి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకొస్తామని అంటున్నాడు. ఈ సినిమా కథ మొత్తం సిద్ధంగా ఉందన్నాడు త్రివిక్రమ్. స్క్రీన్ ప్లే పనులు కూడా దాదాపు పూర్తయిపోయాయని ప్రకటించాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే గబ్బర్ సింగ్-2 పూర్తవ్వగానే కోబలి పట్టాలపైకి వస్తుందంటున్నాడు. అంతేకాదు.. ఈ సినిమాని పవనే తన సొంత బ్యానర్ పై నిర్మిస్తాడని కూడా చెప్పుకొచ్చాడు. అలా కోబలి మరోసారి వార్తల్లోకెక్కింది.