వన్.. నేనొక్కడినే అంటున్న మహేష్

               వన్.. నేనొక్కడినే అనేది మహేష్ సినిమా టైటిల్. మరో విషయంలో కూడా మహేష్ ను ఈ సినిమా టైటిల్ తో పోల్చాల్సి ఉంటుంది. అదే ప్రత్యేక పాత్రలు. ఎంత మంచి గెస్ట్ రోల్ వచ్చినా చేయడానికి నో అంటున్నాడు ప్రిన్స్. ఇప్పటికే కొన్ని ఆఫర్లు తిరస్కరించాడు. తాజాగా మరో ఆఫర్ వస్తే అది కూడా చేయనని చెప్పాడు. అంతేకాదు.. మేనేజర్ ను పిలిచి ఎవరైనా ప్రత్యేక పాత్రలతో వస్తే అట్నుంచి అటే పంపించమని కూడా ఆదేశాలిచ్చాడు మహేష్. 
             అన్నీ తానై గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సినిమా రుద్రమదేవి. ఈ సినిమాలో మహేష్ కోసం ఓ మాంఛి గెస్ట్ రోల్ అనుకున్నాడు గుణశేఖర్. గోన గన్నారెడ్డి పాత్రను మహేష్ కు ఇద్దామనుకున్నాడు. కానీ ప్రిన్స్ మాత్రం తను ప్రత్యేక పాత్రలు చేయనని చెప్పేశాడు. అలా ఆ ఆఫర్ అల్లు అర్జున్ కు వెళ్లిపోయింది. తాజాగా సుధీర్ బాబు నటిస్తున్న మోసగాళ్లకు మోసగాడు అనే సినిమాలో కూడా ఓ గెస్ట్ రోల్ పాత్ర కోసం మహేష్ ను సంప్రదించారు. సొంత బావ సుధీర్ అడిగినప్పటికీ మహేష్ నుంచి నో అనే సమాధానమే వచ్చింది. చివరికి నాగార్జున, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సినిమాల కోసం సంప్రదించినప్పటికీ మహేశ్ ససేమిరా అన్నాడు. మొత్తమ్మీద ప్రత్యేక పాత్రలకు దూరంగా ఉండాలని గట్టిగా ఫిక్సయినట్టున్నాడు మహేష్. హీరోలంతా గెస్ట్ రోల్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటే మహేష్ మాత్రం అలాంటివి చేయకుండా వన్-నేనొక్కడినే అంటున్నాడు.