Telugu Global
NEWS

15 ఏప్రిల్ విహంగ వీక్ష‌ణం -2

విద్యుత్ వైర్లు తెగి..నిలిచిపోయిన రైళ్లు వరంగల్ : వరంగల్ జిల్లా సమీపంలోని ఎల్గూర్ రంగంపేట వద్ద రైల్వే విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో ఈ మార్గంలో నడిచే రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎల్గూర్ రంగంపేట వద్ద విద్యుత్ వైర్లు తెగిన విషయం తెలిసిన వెంటనే సమీప రైల్వే స్టేషన్లలో రైళ్లను నిలిపివేశారు. విజయవాడ, సికింద్రాబాద్, పలాస, బల్లార్ష వైపు వెళ్లే రైళ్లను ఆపేశారు. అర్ధ‌రాత్రి 2 గంటల నుంచి రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులు […]

విద్యుత్ వైర్లు తెగి..నిలిచిపోయిన రైళ్లు
వరంగల్ : వరంగల్ జిల్లా సమీపంలోని ఎల్గూర్ రంగంపేట వద్ద రైల్వే విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో ఈ మార్గంలో నడిచే రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎల్గూర్ రంగంపేట వద్ద విద్యుత్ వైర్లు తెగిన విషయం తెలిసిన వెంటనే సమీప రైల్వే స్టేషన్లలో రైళ్లను నిలిపివేశారు. విజయవాడ, సికింద్రాబాద్, పలాస, బల్లార్ష వైపు వెళ్లే రైళ్లను ఆపేశారు. అర్ధ‌రాత్రి 2 గంటల నుంచి రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కె. సముద్రంలో తమిళనాడు, గుండ్రామడుగులో శాతవాహన , నెక్కొండలో సింహపురి ఎక్స్ప్రెస్, మహబూబాబాద్‌లో కోణార్క్ ఎక్స్ ప్రెస్ లు నిలిచిపోయాయి. రైల్వే సిబ్బంది విద్యుత్ వైర్లను పునరుద్ధరించే పనిలో ఉన్నారు.
పురాతన విగ్రహాలు, నాణేలు స్వాధీనం
ఏలూరు: ఏలూరులో పోలీసుల తనిఖీలో పురాతన విగ్రహాలు, నాణేలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్‌పి కెజివి సరిత తెలిపారు. స్థానిక డిఎస్‌పి కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఈ వివరాలు తెలిపారు. స్థానిక గన్‌బజార్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా వారి వద్ద పురాతన విగ్రహాలు, నాణేలు బయటపడ్డాయని తెలిపారు. వారి వద్ద నుంచి ఒక సరస్వతి దేవి విగ్రహం, రెండు లక్ష్మీదేవి విగ్రహాలు, రెండు అణాల విలువ వున్న రెండు నాణేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నాణేలు 1918 నాటివని, వీటిపై సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుల చిత్రాలు కూడా వున్నాయని తెలిపారు.
ఆర్నెల్ల‌ తర్వాత కొత్త పార్టీ!
న్యూఢిల్లీ: ఆప్ తిరుగుబాటు నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లు కొత్త పార్టీ ఏర్పాటును మ‌రో ఆరు నెల‌లపాటు వాయిదా వేశారు. ముందుగా ప్రత్యామ్నాయ రాజకీయాలు లక్ష్యంగా ‘స్వరాజ్ అభియాన్’ గ్రూప్ ఏర్పాటు చేసి, ఆరు నెలల తర్వాత కొత్త పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇప్పటికిప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని వీడబోమని స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించిన ఈ అసమ్మతి ద్వయం ఇక్క‌డ సుదీర్ఘంగా 8 గంట‌ల‌పాటు నిర్వహించిన ‘స్వరాజ్ సంవాద్’ సదస్సు లో భవిష్యత్తు కార్యాచరణపై విస్త్ర‌త చ‌ర్చ‌లు జ‌రిపారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి హాజరైన కార్యాకర్తల అభిప్రాయాలను ఓటింగ్ ద్వారా తెలుసుకున్నారు. ఆప్‌ను వీడి కొత్త పార్టీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కొంత‌మంది వ్య‌తిరేకించ‌గా… కొత్త పార్టీ ఏర్పాటుకు సదస్సుకు హాజరైన వారిలో 25 శాతం మందే మద్దతు పలికారు.
సినీనటుడు శివాజీ దిష్టిబొమ్మ దగ్ధం
పాలకొల్లు: బిజెపి రాష్ట్ర నాయకులను, కేంద్ర నాయకుడు వెంకయ్యనాయుడు తదితరులపై విమర్శలు చేయడాన్ని నిరసిస్తూ పాలకొల్లులో సినీనటుడు శివాజీ గడ్డిబొమ్మను తగులబెట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కేంద్ర, రాష్ట్ర, బిజెపి సమన్వయకర్త పి రఘురామ్ పాల్గొన్నారు. భారతదేశం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో వినూత్నంగా పయనిస్తూ ప్రజలకు దగ్గరవుతోందని చెప్పారు. అభివృద్ధి పథంలో భారత్‌ను నడపటానికి ఆయన శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. ఎన్నికల ప్రచారం తరువాత శివాజీ ఆశించిన పదవి రాలేదనో, లేదా బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాల కోసమో, లేదా పార్టీ ముసుగులో ఉంటూ బిజెపిని నిర్వీర్యం చేయాలన్న కుట్రతోనో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, సోము వీర్రాజు లాంటి పార్టీకి అంకితమైన వారిని కూడా విమర్శించడం ఆయనకు తగదని రఘురామ్ అన్నారు.
కేంద్ర నుంచి త్వరలోనే పరిహారం: వెంకయ్య
నల్లగొండ: రైతులు అదైర్య పడొద్దు. కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే పంట నష్టపరిహారం అందిస్తామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన నల్లగొండ జిల్లాలో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పోచంపల్లి మండలం రేవన్‌పల్లి, శివారెడ్డిగూడెంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తాం. రైతులు అధైర్యపడొద్దు. కేంద్రం నుంచి త్వరలోనే పరిహారం అందిస్తాం. మూసీ నది ప్రక్షాళన చేసి పోచంపల్లిని మరో కోనసీమలా చేస్తాం. మూసీ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.
దళితులకు 50 వేల ఎకరాల పంపిణీ: కడియం
హైదరాబాద్: రాష్ట్రంలో రూ.10 వేల కోట్ల ఖర్చుతో భూమి లేని దళితులకు 50 వేల ఎకరాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. అవసరమైతే మరిన్ని నిధులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భూమి కొనుగోలు కోసం రూ.1000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ నిధులను త్వరగా ఖర్చు పెడితే మరో రూ.1000 కోట్లు ఇస్తామన్నారు. రాష్ట్రంలో మూడు లక్షల దళిత కుటుంబాలకు భూమి లేదని శ్రీహరి తెలిపారు. రాష్ట్రంలో 85 శాతం ఉన్న బడుగు, బలహీనవర్గాల వారు అభివృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ సాధ్యమని సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. ప్రస్తుతం విద్యార్థులకిస్తున్న కాస్మొటిక్ ఛార్జీలు, స్కాలర్‌షిప్‌ల స్థానంలో కొత్త పథకం తెస్తామని, సబ్సిడీ రుణాల‌ను కూడా రూ.5 నుంచి 10 లక్షలకు పెంచుతామని తెలిపారు.
‘ఏపీ సీఎం చంద్రబాబే పెద్ద టెర్రరిస్టు’
నెల్లూరు: టెర్రరిజంతో అధికారం చెలాయించాలని చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పెద్ద టెర్రరిస్టని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ పద్మావతి మహిళా గ్రంథాలయం ఆవరణంలో ఓపీడీఆర్, పౌరహక్కుల సంఘం సంయుక్తంగా బహిరంగ సభను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పథకం ప్రకారమే చంద్రబాబు ప్రభుత్వం తమిళ కూలీలను పట్టుకుని హతమార్చిందని ఆరోపించారు. అయితే ఒక పత్రిక మాత్రం తమిళ కూలీల హత్యాకాండను ఎన్‌కౌంటర్‌గా పేర్కొంటూ ప్రభుత్వానికి వంతపాడుతోందని విమర్శించారు.
బొగ్గు దిగుమతికి ఎన్టీపీసీ సన్నాహాలు: కేంద్ర ప్రభుత్వ అనుమతి
రామ‌గుండం : బొగ్గు కొరత నివారణలో భాగంగా ఎన్టీపీసీ విదేశీ బొగ్గు దిగుమతి చేసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది నిబంధనల ప్రకారం గతంలో విదేశీ బొగ్గును పరోక్ష పద్ధతిన మాత్రమే దిగుమతి చేసుకునే ఎన్టీపీసీ, ఇక ముందు ప్రత్యక్షంగా బొగ్గు దిగుమతి చేసుకోనుంది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనలు సడలిస్తూ డైరెక్ట్‌ ఇంపోర్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వ‌డంతో ఎన్టీపీసీకి ఊరట లభించింది. ఇంతకాలం ఇతర ప్రభుత్వరంగ సంస్థల ద్వారా విదేశీ బొగ్గును ఎన్టీపీసీ దిగుమతి చేసుకున్న విషయం తెల్సిందే. ఈ పరోక్ష బొగ్గు దిగుమతి విధానం వల్ల సంస్థకు అనవసర ఆర్థిక భారం అయ్యేది. విదేశీ బొగ్గు దిగుమతి కోసం అదనంగా కోట్లాది రూపాయలను ఇతర సంస్థలకు చెల్లించాల్సి వచ్చింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ఎన్టీపీసీ విదేశీ బొగ్గును నేరుగా కొనుగోలు చేసి దిగుమతి చేసుకునే వెసలుబాటు దొరికింది.
రాజధానికి భూములిచ్చిన రైతులకు పదేళ్లపాటు ప్యాకేజీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో భూ సమీకరణకు సంబంధించి మంగళవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. భూసమీకరణకు ఆఖరు తేదీ మే 1వ తేదీ అని పేర్కొన్నారు. ఆ తేదీలోగా భూమములు ఇచ్చే రైతులకు పదేళ్లపాటు ప్యాకేజీ ఉంటుందని జీవోలో పేర్కొన్నారు. ఈ మేరకు క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సిఆర్‌డిఏ) చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వం జీవోలో పేర్కొంది. భూసమీకరణలో భాగంగా ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతుల సంక్షేమం కోసం ఈ జీవో ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు తాము స్వచ్చందంగా ఇచ్చిన భూములపై ఈ ఏడాది మే 1వ తేదీ లోపల సిఆర్‌డిఏతో ఒప్పందం కుదుర్చుకోవాలని, దీని ప్రకారం ప్రతి ఏడాది మే 1వ తేదీ లోపు రైతులకు పదేళ్లపాటు ప్యాకేజీని వ‌ర్తింప‌జేయాల‌ని ప్ర‌భుత్వం సీఆర్‌డీఏను ఆదేశించింది.
బ‌డా కంపెనీల‌కు భూములు క‌ట్ట‌బెడుతున్న కేసీఆర్‌: విమ‌ల‌క్క‌
కందుకూరు : దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ రాష్ట్ర కో-చైర్‌పర్సన్‌ విమలక్క ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్లలో నిర్మించ తలపెట్టిన ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా ప్రజలతో ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తోందని, దీని వల్ల ప్రజలకు ఒరిగేది ఏమిలేదన్నారు. ప్రజలతో ఎలాంటి చర్చలు జరపకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏకపక్షంగా బడా కంపెనీలకు 11 వేల ఎకరాల భూమిని ధారదత్తం చేయడానికి నిర్ణయించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.-పీఆర్‌
First Published:  15 April 2015 2:42 AM GMT
Next Story