దళితుల ఆగ్రహం చవిచూసిన బాలయ్య

నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దళితుల ఆగ్రహానికి గురయ్యారు. తన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న బాలకృష్ణ తనకు తెలియకుండానే చేసిన ఓ తప్పుకు దళితుల ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. తమ ఎమ్మెల్యే హిందూపూర్ లో పర్యటిస్తున్నాడని తెలిసిన వందలాది మంది దళితులు, హిందూపూర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అంబేద్కర్ జయంతి కావడంతో బాలయ్య ఆ రాజ్యాంగ నిర్మాతకు నివాళ్లు అర్పిస్తాడని అంతా ఎదురుచూశారు. కానీ బాలకృష్ణ మాత్రం కార్యకర్తలు, నేతల్ని ఉద్దేశించి ప్రసంగించి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. దీంతో దళితులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. అంబేద్కర్ జయంతి రోజున అతడి విగ్రహానికి పూలమాల వేయకుండా వెనుదిరిగి వెళ్లిపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ స్థానిక నేతల్ని నిలదీశారు. అక్కడితో ఆగకుండా రోడ్డుపైనే బైఠాయించి బాలయ్యకు వ్యతిరేకంగా నినాదాలు అందుకున్నారు. వెంటనే స్పందించిన మరో నాయకుడు నిమ్మల కిష్టప్ప పరిస్థితిని చక్కదిద్దారు.