Telugu Global
NEWS

17 ఏప్రిల్ విహంగ వీక్షణం -1

నర్సాపురం ఎమ్మెల్యేకి రూ.వెయ్యి జరిమానా హైకోర్టు తీర్పు హైదరాబాద్‌: పశ్చిమగోదావరి జిల్లా, నర్సాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుకు కోర్టు ధిక్కారం కేసులో రూ. వెయ్యి జరిమానా విధిస్తూ హైకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. ఈ మొత్తాన్ని జిల్లా న్యాయ సేవా సంస్థకు చెల్లించాలని చీఫ్‌ జస్టిస్‌ కల్యాణ్‌జ్యోతి సేన్ గుప్తా, జస్టిస్‌ పి.వి.సంజయ్‌కుమార్‌ల ధర్మాసనం ఆదేశించింది. అయితే బేషరతు క్షమాపణ కోరుతూ మరో అఫిడవిట్‌ దాఖ లు చేస్తామన్న అభ్యర్థనను అంగీకరిస్తూ అప్పటిదాకా తీర్పును నిలుపుదల చేసింది. […]

నర్సాపురం ఎమ్మెల్యేకి రూ.వెయ్యి జరిమానా హైకోర్టు తీర్పు
హైదరాబాద్‌: పశ్చిమగోదావరి జిల్లా, నర్సాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుకు కోర్టు ధిక్కారం కేసులో రూ. వెయ్యి జరిమానా విధిస్తూ హైకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. ఈ మొత్తాన్ని జిల్లా న్యాయ సేవా సంస్థకు చెల్లించాలని చీఫ్‌ జస్టిస్‌ కల్యాణ్‌జ్యోతి సేన్ గుప్తా, జస్టిస్‌ పి.వి.సంజయ్‌కుమార్‌ల ధర్మాసనం ఆదేశించింది. అయితే బేషరతు క్షమాపణ కోరుతూ మరో అఫిడవిట్‌ దాఖ లు చేస్తామన్న అభ్యర్థనను అంగీకరిస్తూ అప్పటిదాకా తీర్పును నిలుపుదల చేసింది. నర్సాపురంలో గత ఆగస్టు 15న కోర్టు వైపుగా వెళ్తున్న ఎమ్మెలే, ప్రహరీ పక్కన చిరు వ్యాపారులను జిల్లా జడ్జి ఆదేశాల మేరకు అధికారులు తొలగించడం గమనించి వారితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భం గా చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ జిల్లా జడ్జి నోటీసు జారీ చేశారు. దీంతో కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే, తన పొరపాటుకు క్షమాపణ కోరారు. అంతటితో వివాదం సద్దుమణిగినా, అదనపు జడ్జి హైకోర్టు రిజిస్ట్రీకి నివేదిక పంపారు. దీంతో రిజిస్ట్రార్ ధిక్కార పిటిషన్‌ హైకోర్టు ముందు ఉంచారు.
ఏపీ ఎంసెట్‌కు 2,51,801 దరఖాస్తులు
కాకినాడ: రాష్ట్ర వ్యాప్తంగా మే 8న నిర్వహించే ఏపీ ఎంసెట్‌ -2015 ఎంట్రన్స్‌ పరీక్షకు ఇప్పటి వరకు 2,51,801 మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారని ఎంసెట్‌ కన్వీనర్‌ సీహెచ్‌ సాయిబాబు కాకినాడలో తెలిపారు. ఇంజనీరింగ్‌కు 1,67,375, అగ్రికల్చర్‌, మెడిసిన్‌కు 81,999, రెండింటికి 1214 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. రూ.1000 అపరాధ రుసుంతో ఈ నెల 22 వరకు, రూ.5000లతో రూ. మే 2 వరకు, రూ. 10,000ల తో మే 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. హాల్‌ టిక్కెట్లను మే 2 నుంచి 6 వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ప్రాథమిక కీని మే10న, ఫలితాలను మే 26న వెల్లడిస్తామన్నారు. ఇతర వివరాలకు 0884 2356255, 2340535 నెంబర్లలో వెబ్‌సైట్‌లో గాని సంప్రదించవ‌చ్చ‌న్నారు.
అంతరిక్షంలో తొలి తినుబండారం!
లండన్: పిండితో చేసే ఓ తియ్యటి తినుబండారం డోనట్‌… ఇప్పుడు దీని గురించి ఎందుకంటే..! నార్వేకు చెందిన అలెగ్జాండర్‌, బెంజిమన్‌ జాన్‌సన్‌ అనే సోదరులు దీన్ని అంతరిక్షంలోకి పంపారు. ఓ పెద్ద వెదర్‌ బెలూన్‌లో ఈ డోనట్‌ను.. ఒక వీడియో కెమెరాను ఉంచి పంపించారు. తర్వాత నార్వేలోని ఆస్కిమ్‌ నుంచి గతవారం దీన్ని గాల్లోకి పంపారు. ప్రస్తుతం ఇది భూమికి 32 కిలోమీటర్ల ఎత్తులో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రయాణంలో ప్రతీ దృశ్యాన్నీ… ముందే అమర్చిన కెమెరా చక్కగా ఫొటోలు, వీడియోలు తీసి అలెగ్జాండర్‌ సోదరులకు పంపుతోంది.
యూఎస్‌ కోర్టులో సిక్కులకు చుక్కెదురు
న్యూయార్క్‌: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌)ను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని కోరుతూ అమెరికాలో ఒక సిక్కు హక్కుల గ్రూప్‌ విదేశాంగ మంత్రి జాన్‌ కెర్రీకి వ్యతిరేకంగా దాఖలు చేసిన వ్యాజ్యాన్ని తిరస్కరించాలని అమెరికా ప్రభుత్వం ఒక ఫెడరల్‌ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఆవిధంగా డిమాండ్‌ చేసే హక్కు సిక్కు హక్కుల గ్రూప్‌నకు లేదని అమెరికా సర్కార్‌ పేర్కొంది. మాన్‌హట్టన్‌ కోర్టులో జాన్‌ కెర్రీ తరఫున న్యూయార్క్‌లోని సౌత్ డిస్ట్రిక్ట్ అమెరికా అటార్నీ ప్రీత్‌ భరారా 20 పేజీలతో కూడిన ఒక నోట్‌ సమర్పించారు. ‘సిక్క్స్‌ ఫర్‌ జస్టిస్‌’ అనే సంస్థ ఈ వ్యాజ్యం దాఖలు చేసింది.
భారత సంతతి పూజారికి 27 ఏళ్ల జైలు
న్యూయార్క్: బ్యాంకులను మోసం చేయటం, పన్ను ఎగవేత, అక్రమ సంపాదన కేసుల్లో భారత సంతతికి చెందిన ఓ పూజారికి న్యూయార్క్‌ కోర్టు 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అన్నామలై (49) అలియాస్‌ స్వామీజీ శ్రీ సెల్వం సిద్ధార్‌ అనే వ్యక్తి.. విలాసవంతమైన జీవితం గడిపేందుకు.. సమస్యలతో వచ్చే భక్తులను మోసం చేశాడని విచారణలో తేలింది. మతాన్ని, మత సంస్థలను అడ్డం పెట్టుకుని.. వ్యక్తిగతంగా లాభం పొందేందుకు చాలా కుటిల యత్నాలు చేశారని.. అమెరికా అటార్నీ జాన్‌ హార్న్‌ తెలిపారు. జార్జియాలోని ఓ దేవాలయంలో పూజారిగా ఉన్న సమయంలో.. వివిధ ఇబ్బందులతో వచ్చే భక్తులకు ప్రత్యేక పూజల పేరుతో.. క్రెడిట్‌ కార్డు వివరాలు తెలుసుకుని ఇష్టం వచ్చినంత తీసుకునేవాడని.. ఇలా చాలా సార్లు జరిగిందని బాధితులు కోర్టుకు వాంగ్మూలం ఇచ్చారు. ఇదేంటని అడిగితే.. తమపైనే తప్పుడు కేసులు పెట్టారని వాపోయారు. గుడిలో సేవల పేరుతో.. వచ్చే నిధులను, ఇలా క్రెడిట్‌ కార్డుల ద్వారా సంపాదించిన సొమ్మును తన అకౌంట్లో వేసుకుని.. అన్నామలై విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. లగ్జరీ కార్లు, బంగళాలు, ఇండియాలో విదేశీ బ్యాంకు అకౌంట్లు ఇలా ఎన్నో అన్నామలై కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్నాయని విచారణలో తేలింది. సంపాదించిన ఆస్తులు తనఖాలో ఉన్నాయంటూ.. బ్యాంకులకు కట్టాల్సిన పన్ను ఎగవేయటంపై కూడా కోర్టు విచారించింది. అన్నామలైకి అమెరికా కోర్టు 27 ఏళ్ల కారాగార శిక్షను విధించింది.
మోదీ విదేశీ పర్యటన నుంచి రాగానే 9 రాష్ట్రాల‌కు కొత్త గవర్నర్లు
న్యూఢిల్లీ: గవర్నర్‌ పోస్టుల భర్తీపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం 9 రాష్ట్రాల‌కు పూర్తిస్థాయి గవర్నర్లు లేరు. నాలుగు రాష్ట్రాల‌కు ఒకే గవర్నర్‌ ఇన్‌చార్జిగా కొనసాగుతున్న పరిస్థితి. మిగిలిన చోట్ల కూడా ఒక్కో గవర్నర్‌ రెండేసి రాష్ట్రాల‌కు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ దుస్థితిని మార్చేందుకు కేంద్రం సన్నాహాలు చేసుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 18న విదేశీ పర్యటన నుంచి రాగానే.. గవర్నర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం. బీజేపీ సీనియర్‌ నాయకులకే గవర్నర్ ప‌ద‌వులు కట్టబెడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న అసోం, హిమాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, మిజోరం, మణిపూర్‌, జేడీయూ ప్రభుత్వం ఉన్న బీహార్‌, వామపక్ష ఏలుబడిలోని త్రిపుర, టీఆర్‌ఎస్‌ పాలనలోని తెలంగాణలలో ఈ ఖాళీలున్నాయి. అకాలీదళ్‌-బీజేపీ కూటమి పాలిస్తున్న పం జాబ్‌లో గవర్నర్‌తోపాటు, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవీ ఖాళీగానే ఉంది.
పదివేల హెక్టార్లలో పంటనష్టం హోంమంత్రి చినరాజప్ప
హైదరాబాద్‌: అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో 10,714 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లిందని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ప్రాథమిక అంచనాల ద్వారా రూ.250 కోట్ల మేర నష్టం జరిగినట్లు సమాచారం అందిందన్నారు. అకాల వర్షాలపై విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. కర్నూలు జిల్లాలో 2,596 హెక్టార్లు, అనంతపురంలో 1,054 హెక్టార్లు, కడపలో 1,638 హెక్టార్లు, కృష్ణాలో 2,382 హెక్టార్లు, నెల్లూరులో 1,842 హెక్టార్లు, ప్రకాశంలో 350 హెక్టార్లు, చిత్తూరులో 687 హెక్టార్లు పంట నష్టం జరిగిందని ఉపముఖ్యమంత్రి తెలిపారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరిగిన పంటనష్టం వివరాలు ఇంకా అంద‌లేద‌న్నారు. వరి, మామిడి, కూరగాయల పంటలకు రాష్ట్రవ్యాప్తంగా అధిక నష్టం జరిగిందని వివరించారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో ఇద్దరు చొప్పున, శ్రీకాకుళం, నెల్లూరు, విశాఖల్లో ఒక్కరు చొప్పున పిడుగుపాటుకు మృతి చెందినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు తెలిపారు.
నవ్యాంధ్రలోనే వచ్చే అసెంబ్లీ
ఒంగోలు: వచ్చే అసెంబ్లీ సమావేశాలు నవాంధ్రలో నిర్వహించేందుకు కృషిచేస్తానని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. మంగళవారం ప్రకాశం జిల్లాపర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయన స్థానిక రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి నివాసంలో అల్పహారవిందు చేశారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలను నవ్యాంధ్రప్రదేశ్‌లోని గుంటూరు ప్రాంతంలో నిర్వహించేవిధంగా కృషిచేస్తానన్నారు. అన్ని రాజకీయపార్టీలు సమన్వయంతో ముందుకు నడిస్తే ప్రజాసమస్యలు చర్చకు వస్తాయన్నారు. చట్టసభల నిర్వహణకోసం ప్రత్యేకంగా చట్టాలున్నాయని, వాటికి భిన్నంగా తాను ఎప్పుడు ముందుకు వెళ్లనని స్పష్టం చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సభను సజావుగా కొనసాగించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజాసమస్యలు అసెంబ్లీలో చర్చకు రావాలని, సభ్యులకు హెచ్చరికలు, సూచనలు కూడా చేస్తూ ఉంటానని హద్దుమీరితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
లోకేష్‌బాబు రాజ‌కీయాల్లోకి ఇపుడు రాడ‌ట‌!
చిన‌బాబు అదే… లోకేష్‌బాబు… రెండు అంశాల‌పై క్లారిటీ ఇచ్చారు. ఒక‌టి.. తానిప్పుడే రాజ‌కీయాల్లో రావ‌టం లేద‌ని తేల్చ‌టంతో పాటు..పార్టీ కార్య‌క‌ర్త‌ల బాగే త‌న ల‌క్ష్య‌మ‌ని తేల్చేశారు. పార్టీలో పూర్తిస్థాయి ప‌ట్టు సాధించిన త‌ర్వాత మాత్ర‌మే రాజ‌కీయ రంగ ప్ర‌వేశం ఉంటుంద‌ని చెప్ప‌టంతో పాటు.. కార్య‌క‌ర్త‌ల వేద‌న తీర్చేందుకు తాను కేరాఫ్ అడ్ర‌స్ గా ఉంటాన‌ని చెబుతున్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు లోకేశ్ బాబు వేసిన ఈ బిస్కెట్.. తెలుగు త‌మ్ముళ్ల‌లో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. త‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశం గురించి చాలామంది చాలా మాట్లాడుతున్నార‌ని.. కానీ.. పార్టీని బ‌తికించుకునే క్ర‌మంలో ఆర్థికంగా చితికిపోయిన పార్టీ కార్య‌క‌ర్త‌ల ఆదుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. పార్టీ కోసం ఆస్తులు తెగ‌న‌మ్మి ఆర్థికంగా దెబ్బతిన్న వారిని కోలుకునేలా చేసిన త‌ర్వాతే తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని చెప్పారు. ఇపుడు ఆయ‌న ప‌ర్య‌ట‌న రాజ‌కీయాల్లో భాగం కాదా! అని ఎవ‌రైనా అడిగితే ఏం చెబుతారు?
కాశ్మీర్‌లో పాక్ జెండాలు?
శ్రీ‌న‌గ‌ర్‌: వేర్పాటు వాదులు తెగించారు. పాకిస్తాన్ జెండాలను పట్టుకుని ప‌ట్ట‌ప‌గ‌లే భారత దేశంలో భాగమైన ప్రాంతంలో తిరిగారు. భారత్‌లో భాగమైన కాశ్మీర్ లో పాకిస్తానీ పతాకాలు రెపరెపలాడించారు! శ్రీనగర్లో వేర్పాటు వాదులు నిర్భయంగా వ్యవహరించారు. మరి ఈ పరిణామాలు సగటు భారతీయడిలో ఆవేశాన్ని రగిల్చేవే.. భారత సొత్తు అయిన కాశ్మీర్ లో పాకిస్తానీ నినాదాలను ఏ భారతీయుడూ సహించలేడు. మరి ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వాల తీరు విమర్శల పాలవుతుంది. అది కూడా భారత జాతీయవాదమే తమ ఊపిరి అని చెప్పుకొనే భారతీయ జనతా పార్టీ అటు కేంద్రంలోనూ.. ఇటు కాశ్మీర్ లోనూ అధికారంలో ఉంది! ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు అసహనాన్నికలిగిస్తున్నాయి. ఈ చ‌ర్య‌ను పాకిస్థాన్ స‌మ‌ర్ధిస్తూ పాక్ జెండాలు ఎగ‌రేసింది భార‌త్‌లో కాదుగ‌దా! కాశ్మీర్‌లో క‌దా అంటూ వ్యాఖ్యానించిందంటే… ఎంత బ‌రి తెగింపో అర్ధం చేసుకోవ‌చ్చు. వీరిని కట్టడి చేయకపోతే.. భారతీయ జనతా పార్టీ కచ్చితంగా తనకు తానే ప్రమాదాన్ని కొని తెచ్చుకొంటున్నట్టే!-పీఆర్‌
First Published:  16 April 2015 10:30 PM GMT
Next Story