Telugu Global
Others

17 ఏప్రిల్ విహంగ వీక్షణం -2

రాజ‌ధానిలో 4 గ్రామాల చిరునామా మార్పు! విజ‌య‌వాడ‌: భూ సేక‌ర‌ణ జ‌రిగిన ప్రాంతం మ‌ధ్య‌లో సీడ్ క్యాపిట‌ల్‌కి అడ్డు వ‌స్తున్నాయ‌నే కార‌ణంతో నాలుగు గ్రామాలు క‌నుమ‌రుగు కానున్నాయి. ఇవ‌న్నీ తుళ్ళూరు మండ‌లంలోనే ఉన్నాయి. నేల‌పాడు, శాఖ‌మూరు, ఐన‌వోలుతోపాటు మ‌రో గ్రామం ఉంద‌ని తెలుస్తోంది. నేల‌పాడులో300 ఇళ్ళ‌లో 1028 మంది, శాఖ‌మూరులో 349 నివాసాల్లో 1218 మంది, ఐన‌వోలులో 497 ఆవాసాల్లో 1838 మంది నివాస‌ముంటున్నారు. సీడ్ క్యాపిట‌ల్‌కు ఈ గ్రామాలు అడ్డుగా నిలుస్తున్నాయ‌నే కార‌ణంతో వీరిని ఖాళీ […]

రాజ‌ధానిలో 4 గ్రామాల చిరునామా మార్పు!
విజ‌య‌వాడ‌: భూ సేక‌ర‌ణ జ‌రిగిన ప్రాంతం మ‌ధ్య‌లో సీడ్ క్యాపిట‌ల్‌కి అడ్డు వ‌స్తున్నాయ‌నే కార‌ణంతో నాలుగు గ్రామాలు క‌నుమ‌రుగు కానున్నాయి. ఇవ‌న్నీ తుళ్ళూరు మండ‌లంలోనే ఉన్నాయి. నేల‌పాడు, శాఖ‌మూరు, ఐన‌వోలుతోపాటు మ‌రో గ్రామం ఉంద‌ని తెలుస్తోంది. నేల‌పాడులో300 ఇళ్ళ‌లో 1028 మంది, శాఖ‌మూరులో 349 నివాసాల్లో 1218 మంది, ఐన‌వోలులో 497 ఆవాసాల్లో 1838 మంది నివాస‌ముంటున్నారు. సీడ్ క్యాపిట‌ల్‌కు ఈ గ్రామాలు అడ్డుగా నిలుస్తున్నాయ‌నే కార‌ణంతో వీరిని ఖాళీ చేయించాల‌ని నిర్ణ‌యించారు. అయితే మ‌రో గ్రామం పేరు బ‌య‌ట పెట్ట‌డానికి అధికారులు సంశ‌యిస్తున్నారు. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త రాకుండా చాక‌చ‌క్యంగా దీన్ని అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.
పెళ్ళి ప‌త్రిక‌లో పుట్టిన‌రోజు లేకుంటే జైలుకే!
రాజ‌స్థాన్‌: రాజ‌స్థాన్‌లోని ఝ‌న్‌ఝ‌న్ జిల్లాలో ఇటీవ‌ల కాలంలో బాల్య వివాహాలు పెరిగిపోయాయి. వీటిని ఎలా అరిక‌ట్టాల‌న్న ఆలోచ‌న‌కు ఆ జిల్లా క‌లెక్ట‌ర్‌గారికి ఓ మంచి ఐడియా వ‌చ్చింది. అంతే దాన్ని అమలుకు శ్రీ‌కారం చుట్టారు. పెళ్ళి ప‌త్రిక‌ల్లో ఇక‌నుంచి పుట్టిన తేదీ ప్ర‌చురించ‌కుంటే ప్రింటింగ్ ప్రెస్ య‌జ‌మానుల‌ను జైలుకు పంపిస్తామ‌ని క‌లెక్ట‌ర్ స‌ల్వీంద‌ర్‌సింగ్ సోప్తా హెచ్చ‌రించారు. పెళ్ళి శుభ‌లేఖ‌లు ప్ర‌చురించే వారు ఖ‌చ్చితంగా పుట్టిన‌రోజు తెలుసుకుని ప‌త్రిక‌లో ప్ర‌చురించాల‌ని ఆయ‌న ఆదేశించారు.
ఎంబీబీఎస్ యాజ‌మాన్య కోటాకు ప్ర‌త్యేక ఎంట‌న్స్‌
హైద‌రాబాద్‌: ఎంబీబీఎస్ యాజ‌మాన్య సీట్ల‌కు ప్ర‌త్యేక ఎంట్ర‌న్స్ నిర్వ‌హించాల‌ని చేస్తున్న డిమాండుకు తెలంగాణ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.అయితే ఎంట్ర‌న్స్ నిర్వ‌హించుకునే అవ‌కాశం ప్ర‌యివేటు కాలేజీల‌కు ఇవ్వ‌కుండా ప్ర‌భుత్వ‌మే నిర్వ‌హిస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ విష‌య‌మై ప్ర‌యివేటు కాలేజీల యాజ‌మాన్యాల‌తో ఆరోగ్య శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి చ‌ర్చించిన త‌ర్వాత విధివిధానాల‌ను రూప‌క‌ల్ప‌న చేస్తారు. ప్ర‌యివేటు కాలేజీల‌కే ఎంట్ర‌న్స్ బాధ్య‌త‌ను వ‌దిలేస్తే అధికంగా ఫీజులిచ్చే వారికి పేప‌ర్ లీక్ చేసే అవ‌కాశం ఉంద‌ని, అధిక ఫీజుల‌కు చెక్ పెట్ట‌డంతోపాటు ఇత‌ర‌త్రా అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌కుండా చూడ‌డం ల‌క్ష్యాల‌తో ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని అధికారులు చెబుతున్నారు.
అవేక్ ఎ వ‌ర‌ల్డ్ సంస్థ‌లో ఉన్న చిన్నారుల‌కు ర‌క్ష‌ణ లేద‌ని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ‌శాఖ గుర్తించింది.
త్వ‌ర‌లో భూసేక‌ర‌ణ నోటిఫికేష‌న్‌
భూసేక‌ర‌ణ చ‌ట్టానికి సంబంధించి త్వ‌ర‌లో నోటిఫికేష‌న్ విడుద‌ల‌వుతుంది. భూ స‌మీక‌ర‌ణ‌పై అసంతృప్తిగా ఉన్న రైతులు భూ సేక‌ర‌ణ చ‌ట్టం ద్వారా భూములిచ్చే వెసులుబాటు ఉంటుంద‌ని మంత్రులు నారాయ‌ణ‌, పుల్లారావు తెలిపారు. భూ సేక‌ర‌ణ‌కు, భూ స‌మీక‌ర‌ణ‌కు రైతులు ఒప్పుకోని ప‌క్షంలో వారి పొలాల‌ను గ్రీన్‌బెల్ట్ ఏరియాగా ప్ర‌క‌టిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. రాజ‌ధాని ప‌రిధి 7200 కిలోమీట్లు ఉంటుంద‌ని, ఇప్ప‌టికే 32 వేల ఎక‌రాలు సేక‌రించామ‌ని, రైతులు త‌మ‌కు ఉన్న అపోహ‌లు తొల‌గించుకుని భూ స‌మీక‌ర‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని వారు కోరారు.
న్యూయార్క్ న్యాయ‌మూర్తిగా ఎన్నారై రాజ రాజేశ్వ‌రి
వాషింగ్ట‌న్‌: న‌్యూయార్క్ సిటీ క్రిమిన‌ల్ కోర్టులో తొలి ఎన్నారై న్యాయ‌మూర్తిగా రాజ రాజేశ్వ‌రి అనే భార‌తీయ‌రాలు నియ‌మితుల‌య్యారు. వివిధ హోదాల్లో ప‌ని చేసిన రాజేశ్వ‌రి సేవ‌ల‌ను గుర్తించిన మేయ‌ర్ బిల్ డి బ్లాసియో ఆమెను బెంచ్‌కు నామినేట్ చేశారు. చెన్నైలో జ‌న్మించిన రాజేశ్వ‌రి 16 యేట‌నే త‌ల్లిదండ్రుల‌తోపాటు అమెరికాకు వెళ్ళారు. భార‌త్ నుంచి వ‌ల‌స వ‌చ్చిన నాలాంటి వ్య‌క్తికి ఇలాంటి హోదా ద‌క్క‌డం అత్యంత అదృష్టం… అని ఆమె వ్యాఖ్యానిస్తూ వ‌ల‌స వ‌చ్చిన వారికి మ‌రింత చేరువ అయ్యేందుకు కృషి చేస్తాన‌ని అన్నారు.
ఐరాస శాంతి బృందాల్లో మ‌హిళల‌ సంఖ్య పెంచాల్సిందే
ఐక్య‌రాజ్య‌స‌మితి: ఐరాస శాంతి బృందాల‌లో మ‌రింత మంది మ‌హిళా శాంతి ప‌రిర‌క్ష‌కులు ఉండ‌డం అవ‌స‌ర‌మ‌న్న వాద‌న‌కు భార‌త్ మ‌ద్ద‌తు తెలిపింది. ఐక్య‌రాజ్య స‌మితి శాంతి మిష‌న్ల‌కు స‌హాయం పెంచ‌డానికి కూడా భారత్ సంసిద్ధ‌త వ్య‌క్తం చేసింది. ఐరాస శాంతి ప‌రిర‌క్ష‌క మిష‌న్ల‌కు భార‌త్ సుమారు 1,80,000 బ‌ల‌గాల‌ను పంపించింది. వీరిలో 103 మందితో కూడిన ప‌టిష్ట‌మైన భార‌త్ మ‌హిళా పోలీస్ యూనిట్ లైబేరియాలోని ఐరాస మిష‌న్‌లో ఉంది.
దుర్గ గుడి వ‌ద్ద 4.8 కి.మీ భారీ ఫ్లై ఒవ‌ర్‌
విజ‌య‌వాడ‌: విజ‌య‌వాడ ప్ర‌జ‌ల చిర‌కాల వాంఛ అయిన క‌న‌క‌దుర్గ గుడి వ‌ద్ద ఫ్లైఒవ‌ర్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. క‌న‌క‌దుర్గ వార‌ధి నుంచి అశోక్ స్తంభం వ‌ర‌కు 3.4 కిలోమీట‌ర్ల మేర‌, అక్క‌డి నుంచి కుమ్మ‌రిపాలెం కూడ‌లి వ‌ర‌కు 1.4 కిలోమీట‌ర్లు… మొత్తం 4.8 కిలోమీట‌ర్ల మేర‌ నాలుగు లైన్ల విస్త‌ర‌ణ జ‌రుగుతుంది. మొత్తం 4.8 కిలోమీట‌ర్ల మేర ఫ్లై ఒవ‌ర్ నిర్మాణం చేసుకోడానికి వీలుగా కేంద్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈవిష‌యాన్ని పార్ల‌మెంట్ స‌భ్యుడు కేశినేని నాని ప్ర‌క‌టించారు.
దాడుల‌కు వ‌స్తున్నాం… న‌కిలీ మందులు దాచేయండి
మేము వ‌స్తున్నాం… పారిపోండి.. అని పోలీసులే దొంగ‌ల‌కు చెబితే ఎలా ఉంటుంది?… ఇదెలా జ‌రుగుతుంద‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? అయితే ఇలాగే జ‌రిగింది… కాని ఇక్క‌డ పాత్ర‌ధారులు కేంద్ర ప్ర‌భుత్వం.. ఔష‌ధాలు విక్ర‌యించే కంపెనీలు. ఏప్రిల్ నెలాఖ‌రున దేశ వ్యాప్తంగా మందుల షాపుల్లో దాడులు నిర్వ‌హిస్తామ‌ని, న‌కిలీ మందుల‌ను గుర్తించి అక్ర‌మార్కుల‌పై కేసులు పెడతామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం చాటింపు వేయిస్తోంది. రిటైల్ దుకాణాలు, ప్ర‌యివేటు ఆస్ప‌త్రులు, ప్ర‌భుత్వాస్ప‌త్రుల్లో త‌నిఖీలు చేసి 70 వేల న‌మూనాలు తీసి ప‌రీక్ష‌ల‌కు పంపుతామ‌ని, దొంగ‌లు దొరికితే శిక్ష‌లు త‌ప్ప‌వ‌ని ప్ర‌క‌టించేసింది. ఇంకెందుకు దొరుకుతారు దొంగ‌లు. అంతా జాగ్రత్త ప‌డుతున్నారు. నాణ్య‌త త‌క్కువ‌గా ఉన్న‌…… న‌కిలీ మందుల్ని దాచేస్తున్నారు. 2008-09లో కూడా ఔష‌ధ నియంత్ర‌ణ శాఖ ఇలాగే చేసింది. అప్పుడు 27 వేల న‌మూనాలు తీస్తే న‌కిలీవ‌ని తేలింది కేవ‌లం 0.04 శాత‌మే. పోలీసులొస్తున్నార‌ని చెబితే దొంగ‌లు దొరుకుతారా చెప్పండి!
ఏపీలో ఆధ్యాత్మిక ప‌ర్యాట‌కానికి ప్రాధాన్యం
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి సాధించాలంటే ప‌ర్యాట‌క రంగం పురోగ‌తి త‌ప్ప‌నిస‌ర‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. ప‌ర్యాట‌కం, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు, ఆర్కియాల‌జీ, మ్యూజియంలు అభివృద్ధి చేయాల్సిందేన‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. ప‌ర్యాట‌క శాఖ గ‌ణ‌నీయ సంఖ్య‌లో విదేశీ టూరిస్టుల‌ను ఆక‌ర్షించే విధంగా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని… ఇందుకు సంబంధించి ఏమైనా ప‌రిపాల‌నాప‌ర‌మైన అనుమ‌తులు కావాలంటే వెంట‌నే తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. రాష్ట్రంలోని దేవాల‌యాల‌ను స‌ర్క్యూట్‌గా విభ‌జించుకుని భ‌క్తుల‌కు అందుబాటులో ఉండేలా మంచి ప్యాకేజీల‌ను రూపొందించాల‌ని కృష్ణారావు అధికారుల‌ను ఆదేశించారు.
రైతుల‌పై పొగాకు బోర్డు కేసులు!
రైతుల సంక్షేమానికి పాటుప‌డుతున్న‌ట్టు చెప్పుకునే తెలుగుదేశం ప్ర‌భుత్వం హ‌యాంలో పొగాకు రైతుల‌పై కేసులు పెట్ట‌డం ఏమిట‌ని మంత్రి ప్ర‌తిపాటి పుల్లారావును ప్ర‌శ్నించారు. రైతుల సంక్షేమానికి పాటుపడాల్సిన పొగాకు బోర్డు వారిపైనే కేసులు పెడుతుంద‌ని గోపాల‌పురం ఎమ్మెల్యే ఎం. వెంక‌టేశ్వ‌ర‌రావుతోపాటు గోదావ‌రి జిల్లాల రైతులు మంత్రిని నిల‌దీశారు. క‌ర్ణాట‌క‌లో 20 వేల బ్యార‌న్లు అన‌ధికారికంగా ఉన్నాయ‌ని, ఆంధ్ర‌ప్రదేశ్‌లో రెండు వేల అన‌ధికార‌ బ్యార‌న్లు ఉన్నాయ‌ని తెలిపారు. బ్యార‌న్లు అద్దెకిచ్చినా, లైసెన్సులున్న రైతులు భూములు కౌలుకిచ్చినా రైతులపై కేసులు పెట్టి అవ‌మానిస్తున్నార‌ని వారు పేర్కొన్నారు. ఈ విష‌య‌మై అధికారుల‌తో చ‌ర్చించి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి హామీ ఇచ్చారు.-పీఆర్‌
First Published:  16 April 2015 9:31 PM GMT
Next Story