ఓకే బంగారం- రివ్యూ

Ok Bangaaram
రేటింగ్: 3/5 
పాజిటివ్ పాయింట్స్: నిత్యమీనన్, దుల్కర్ సల్మాన్, ప్రకాశ్ రాజ్ యాక్టింగ్, పీసీ శ్రీరాం కెమెరా, ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్, మణిరత్నం

నెగిటివ్ పాయింట్స్: సఖి చిత్రానికి ఎక్స్ టెన్షన్ గా ఉండటం, క్లైమాక్స్
ప్రేమ కథా చిత్రాలకు మానవ సంబంధాల్ని ముడివేస్తూ చిత్రాలను రూపొందించడంలో దర్శకుడు మణిరత్నం విభిన్నమైన శైలి. కడలి దారుణ పరాజయం తర్వాత మళ్లీ పాత ఫార్మాలనే దుమ్ము దులిపి నేటి యువతరం అభిరుచులకు తగినట్లుగా అందించిన చిత్రం ‘ఓకే బంగారం’. ఈ చిత్రం ఎలా ఉందో అని తెలుసుకోవడానికి ముందు కథేంటో తెలుసుకుందాం!
ఆది (దుల్కర్ సల్మాన్) ముంబైలో పనిచేసే సాఫ్ట్ వేర్ ఇంజినీర్. తన అన్నయ్య ఫ్రెండ్ గణపతి (ప్రకాశ్ రాజ్), భవానీ (లీలా శ్యాంసన్) దంపతుల ఇంట్లో పెయింగ్ గెస్ట్ గా ఉంటాడు. ముంబై రైల్వే స్టేషన్లో తొలిసారి ఓ విచిత్రమైన పరిస్థితుల్లో తార (నిత్యమీనన్)ను తొలిసారి చూస్తాడు. ఆ తర్వాత ఓ పెళ్లిలో తారను ఆది కలుసుకుంటాడు. ఇద్దరి అభిరుచులు ఒకేలా ఉంటాయి. జీవితంలో పెళ్లి చేసుకోవడమనే అంశంలో ఇద్దరికి ఇష్టం ఉండదు. పెళ్లికి నిత్య విముఖత చూపడంలో ఓ కారణముంటుంది. పెళ్లిలో పరిచయం ఆకర్షణగా ఆతర్వాత ప్రేమగా మారుతుంది. ఇద్దరు కలిసి గణపతి ఇంట్లోనే సహజీవనం చేయాలనుకుంటారు. అందుకు గణపతిని ఒప్పిస్తారు. సహజీవనం చేయాలని ఓ బంధాన్ని ఏర్పరుచుకున్న వారిలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి? వారి మధ్య బంధం సహజీవనానికే పరిమితమైందా? పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటే అందుకు దారి తీసిన పరిస్థితులేంటి? నిత్యకు పెళ్లంటే ఇష్టం లేకపోవడానికి  కారణమేంటి? చివరకు ఆది, తారల మధ్య సహజీవనం బంధం ఎటువైపు దారి తీసిందనే ప్రశ్నలకు మణిరత్నం అందించిన సమాధానమే ‘ఓకే బంగారం’
ఇప్పటికే నిత్యమీనన్ తెలుగు సినీ ప్రపంచంలో విభిన్నమైన పాత్రలతో అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఈ చిత్రంలో తార పాత్రలో మరోసారి మంచి నటన, అభినయంతో ఆకట్టుకున్నది. ఆదితో కలిసి చేసిన రోమాన్స్ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టేలా ఉంది. మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ ఆది గా కనిపించాడు. మణిరత్నం రూపంలో వచ్చిన సినీ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. నిత్య, దుల్కర్ ల కెమిస్ట్రీ బ్రహ్మాండంగా పడింది. మితి మీరని శృంగారం ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురి చేస్తుంది. వీరిద్దరూ తెరపై యువతారల్లా జిగేల్ మనిపించారు.  గణపతిగా ప్రకాశ్ రాజ్, భవానీగా లీలా శ్యాంసన్ లు తమదైన శైలిలో తమ పనికానిచ్చారు. ఈ నాలుగు పాత్రలు తప్పా ఈ చిత్రంలో పెద్దగా చెప్పుకొనే పాత్రలు ఏమి ఉండవు. 
సాంకేతిక విభాగాల పనితీరు: 
యూత్ ఫుల్ ఎంటర్ టైనర్, లవ్, రొమాన్స్, ఎమోషన్స్ , ఫీలింగ్ పలు అంశాలను పీసీ శ్రీరాం చక్కగా తెరకెక్కించారు. కీలక సన్నివేశాల్లో ఆర్టిస్టులు అభినయాన్ని, మూడ్ ను చక్కగా తెరెకెక్కించారు ముంబై వాతావరణాన్ని తెరకెక్కించడంలో పీసీ శ్రీరాం అద్భుతమైన పనితీరును కనబరిచారు.  ఎడిటింగ్, మాటలు ఇతర విభాగాల పనితీరు చక్కగా ఉన్నాయి. 
ఏఆర్ రెహ్మాన్ సంగీతం: 
పాటలు సాహిత్యం అందించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి వేటూరి లేని లోటును తీర్చాడు. సిరివెన్నెల అందించిన సాహిత్యానికి ఆరోగ్యవంతమైన సంగీతాన్ని అందించడంలో మ్యూజిక్ మెజిషియన్ మరోసారి తన జాదును ప్రదర్శించారు. ఓకే బంగారానికి మరో అదనపు ఆకర్షణ ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్. పాటలు “మన మన మెంటల్’, మాయేదో చెయ్యవా, నీ వెంటే నువ్వు ఉంటే యూత్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రధాన సన్నివేశాల్లో రెహ్మాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. కొత్తగా ఉంది. యువతరానికి నచ్చేలా, ఆక్టట్టుకునేలా చేయడంలో రెహ్మాన్, మణిరత్నంలు సక్సెస్ అయ్యారు.
హ్యాట్సాఫ్ అనే అంతగా మానవ సంబంధాలను మణిరత్నం మరోసారి తనదైన శైలిలో తెరకక్కించారు. ఆకర్షణ, ప్రేమ, పెళ్లి అనే అంశాలు పాతవే అయిన ప్రజెంట్ జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెరకెక్కించిన తీరు, ఆలోచనా విధానం ఆకట్టుకున్నాయి. సగటు ప్రేక్షకుడి పరిధిలోనే అన్ని అంశాలను మేలవించి ఓకే బంగారం రూపొందించారు. ఓ యువ దర్శకుడికి తీసిపోని విధంగా ప్రేమ కథను, రొమాన్స్ ను సమంగా తూకం వేసి దృశ్యకావ్యంగా మలిచారు. యువ ప్రేమ జంట కథతోపాటు గణపతి, భవానీల ట్రాక్ ను ఎమోషనల్ గా నడిపించి ప్రేక్షకుడ్ని కట్టిపడేసారు. అయితే క్లైమాక్స్ లో కొంత రొటిన్ ట్రాక్ లో సినిమా నడిసినా.. చివరికి ప్రేక్షకుడ్ని గొప్ప అనుభూతితో థియేటర్ నుంచి బయటకు పంపించేలా చేయడంలో మణిరత్నం మైండ్ గేమ్ ఆడారు. ఏది ఏమైనా లవ్ అనే యూనివర్సల్ థాట్ ను ప్రజెంట్ డే కు అప్లై చేసి చేసిన ప్రయత్నం సగటు ప్రేక్షకుడ్ని కూడా ఆకట్టుకునేలా ఉంది. ప్రేమించాలనుకున్న యువత ప్రేమలో పడాలన్నంతగా ఓ ప్రభావాన్ని చూపే విధంగా, ప్రేమించి పెళ్లి చేసుకున్న నిత్య ప్రేమికులు మరోసారి వారి జీవితాల్లోని మధుర క్షణాల్ని గుర్తు చేసేంతగా  ‘ఒకే బంగారం’ చిత్రాన్ని మణిరత్నం తీర్చిదిద్దారు. . 
నటీనటులు: దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్, ప్రకాశ్ రాజ్, లీలా శ్యాంసన్
ఫోటోగ్రఫి: పీసీ శ్రీరాం
సంగీతం: ఏఆర్ రెహ్మాన్
దర్శకుడు: మణిరత్నం