తెలంగాణ తేజకు ఆంధ్రా దెబ్బ

Director Teja Telangana
అంతా తెలంగాణకు చెందిన నూతన నటీనటులతో ఓ కొత్త సినిమా చేస్తానని ఇప్పటికే ప్రకటించాడు దర్శకుడు తేజ. దీనిపై ఏపీ అసోసియేషన్ ఒకటి తీవ్రంగా స్పందించింది. 14వేల మంది సభ్యులు కలిగిన ఏపీ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్, తేజపై నిషేధం వేసింది. దర్శకుడు తేజ నిబంధనలు ఉల్లంఘించారని ఇకపై తేజకు తమ సంస్థ నుంచి ఎలాంటి సహకారం అందదని స్పష్టం చేసింది ఏపీ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్. ప్రాంతాలతో సంబంధం లేకుండా నటీనటుల్ని ఎంచుకోవాలని తేజకు సూచించింది. 
ఏపీ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ వైఖరిపై తేజ కూడా ఘాటుగానే స్పందించారు. అసలు ఏ హక్కుతో తనపై నిషేధం విధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని, తెలంగాణ సినీవర్కర్ల సంఘం ఒకటి కొత్తగా ఏర్పడిందని.. కాబట్టి ఏపీ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ నిషేధం తనపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. కొత్తవాళ్లను తను ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటానని, ఇకపై తెలంగాణ రాష్ట్రం నుంచి న్యూ టాలెంట్ ను మరింతగా తెరపైకి తీసుకొస్తానని ఛాలెంజ్ చేశారు తేజ. ప్రస్తుతం వైజాగ్ లో తన కొత్త సినిమా షూటింగ్ లో ఉన్నారు తేజ.