శ్రీ మనకిక లేరు..

music director sri
 ఆయనకు స్టార్ డమ్ అవసరం లేదు.. రియాల్టీ షోలు అస్సలుకే వద్దు.. ఆడియో ఫంక్షన్లలో ఆర్భాటం అంటే గిట్టదు.. మంచి ట్యూన్ మనసుకు తట్టినప్పుడల్లా నోట్ చేసుకుంటారు. అలా లెక్కలేనన్ని పాటల్ని తెలుగు సినీలోకానికి అందించారు శ్రీ. సంగీత దర్శకుల్లో విలక్షణ కంపోజర్ గా పేరుతున్న శ్రీ, హఠాత్తుగా కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్రీ ఈ లోకాన్ని వీడివెళ్లిపోయారు. 
 చక్రవర్తి కొడుకుగా మంచి ఇమేజ్ ఉన్నప్పటికీ.. దాన్ని ఎక్కడా ఉపయోగించుకోలేదు శ్రీ. స్వశక్తిగా ఎదగాలనుకున్నారు. అందుకే ఆయన చేసిన సినిమాలు చాలా తక్కువ. అయితేనేం ప్రతి మూవీకి ఓ ఐకానిక్ ట్యూన్ సెట్ చేశారు. శ్రీ మ్యూజిక్ అంటే ఇలా ఉంటుంది అనేంతలా తన మార్క్ చూపించగలిగారు. తండ్రి చక్రవర్తి రేంజ్ లో పాపులర్ కాకపోయినప్పటికీ.. సినీవినీలాకాశంలో తను కూడా ఓ తారలా మిగిలిపోయారు. 
మణిపాల్ యూనివర్సిటీ నుంచి ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ లో ఇంజిరీనిరింగ్ పూర్తిచేశారు శ్రీ. తర్వాత జెమినీ ఛానెల్ లోని  ఓ అంత్యాంక్షరి కార్యక్రమంతో వెలుగులోకొచ్చారు. తర్వాత సంగీత దర్శకుడిగా మారారు. పోలీస్ బ్రదర్స్, మనీ, లిటిల్ సోల్జర్స్, మనీ-మనీ, సింధూరం, సాహసం, అనగనగా ఒక రోజు, ఆవిడ మా ఆవిడే, చందమామలో అమృతం.. ఇలా ఎన్నో సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. తన ప్రతి సినిమాకు ఓ సిగ్నేచర్ ట్యూన్ ఇచ్చారు శ్రీ. తెలుగులో మోస్ట్ పాపులర్ సాంగ్ జగమంత కుటుంబం నాది అనే పాటను ఆలపించింది కూడా శ్రీనే. దీంతో పాటు మరెన్నో మంచి పాటలు పాడారు శ్రీ. తెలుగుసినీచరిత్రలో శ్రీ చిరకాలం గుర్తుండిపోతారు.