ఇద్ద‌రు తెలుగువాళ్ళ చేతుల్లో సీపీఐ.,సీపీఎం!

వామ‌ప‌క్షాల్లో ప్ర‌ధాన పార్టీలైన సీపీఎం., సీపీఐల‌కు జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులుగా ఇద్ద‌రు తెలుగువాళ్ళు సార‌థ్యం వ‌హిస్తున్నారు. సీపీఐ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఇప్ప‌టికే సుర‌వ‌రం సుధాక‌ర‌రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టి ఉండ‌గా ఇపుడు సీపీఎం సార‌థ్యానికి సీతారాం ఏచూరి ఎన్నిక‌య్యారు. వీరిద్ద‌రు కూడా తెలుగు వాళ్ళ‌లో రెండో త‌రానికి చెందిన‌వారు. సీపీఐకి ఒక‌ప్పుడు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా చండ్ర రాజేశ్వ‌ర‌రావు ప‌ని చేయ‌గా, సీపీఎంకు పుచ్చ‌ల‌ప‌ల్లి సుంద‌ర‌య్య బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. వీరిద్ద‌రూ కూడా తెలుగువారే కావ‌డం గమ‌నించాల్సిన విష‌యం. ఇపుడు మ‌ళ్ళీ రెండో త‌రానికి చెందిన సుర‌వ‌రం సుధాక‌ర‌రెడ్డికి, సీతారాం ఏచూరికి ఆ ప‌ద‌వులు ద‌క్కాయి. కాగా ఏచూరి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఎన్నిక‌యిన సంద‌ర్భంగా మాట్లాడుతూ ఏనాటికైనా సీపీఐ., సీపీఎంలు విలీనం కావాల్సిందేన‌ని అన్నారు. దానికి మూడు నెల‌లు ప‌ట్ట‌వ‌చ్చు లేదా ఆరు నెల‌లు ప‌ట్ట‌వ‌చ్చు. క‌లిసిపోవ‌డం ఖాయం… అనివార్యం అని సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు.