అనుమానంతో చంపేద్దామనుకున్నాడు

Women Harrasment
అనుమానం పెనుభూతమని పెద్దలు ఊరికే అనలేదు. అనుమానం ప్రవేశిస్తే కాపురాలు నరకప్రాయమవుతాయనేందుకు ఇదో ఉదాహరణ. భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ భర్త ఆమెను తరచూ వేధించేవాడు. ఈ క్రమంలోనే భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించేందుకు కూడా అతను ప్రయత్నించాడు. చుట్టుపక్కలవారు వచ్చి అడ్డుకోవడంతో ఆమె ప్రాణాలు గాల్లో కలసిపోకుండా నిలిచాయి. ఆదిలాబాద్ జిల్లా నర్సాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దిలావర్ మండలం కాల్వ గ్రామానికి చెందిన రాణి అనే మహిళకు పదేళ్ళ క్రితం ఆర్ ఎంపీ వైద్యుడైన కరీం నగర్ కు చెందిన తిప్పర్తి వెంకటేశ్వర్లుతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. రెండేళ్ళుగా భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది.  భార్యపై అనుమానం పెరిగింది. ఆమెకు ఎవరితోనో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఆమెను శారీరకంగా మానసికంగా వేధిస్తుండేవాడు. రెండు రోజుల క్రితం రాణి కాల్వలోని తన పుట్టింటికి వచ్చింది. ఆమెతో పాటు వచ్చిన వెంకటేస్వర్లు ఆదివారం తెల్లవారు ఝామున భార్యతో గొడవ పడ్డాడు. చంపేస్తానని బెదిరిస్తూ ఆమె ఒంటిపై కిరోసిన్ పోశాడు. పక్కనే ఉన్న దీపపు ఒత్తితో నిప్పంటించేందుకు కూడా ప్రయత్నించాడు. భార్య అడ్డుకుని కేకలు వేయగా చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని వెంకటేశ్వర్లును పట్టుకునేందుకు ప్రయత్నించడంతో అతను అక్కడ్నించి పారిపోయాడు.