బాలీవుడ్ కు ఓకే బంగారం

 తెలుగు-తమిళ భాషల్లో హిట్టయిన ఓకే బంగారం సినిమా ఇప్పుడు బాలీవుడ్ జనాల్ని ఎట్రాక్ట్ చేసింది. సహజీవనం కాన్సెప్ట్ కావడం, పక్కా యూత్ ఎంటర్ టైనర్, రొమాంటిక్ మూవీ కావడంతో బాలీవుడ్ మేకర్స్ అంతా ఓకే బంగారంపై ఒక లుక్కేశారు. సినిమాకు సౌత్ లో పాజిటివ్ టాక్ రావడంతో ఓకే బంగారం రీమేక్ రైట్స్ కి ఇప్పుడు డిమాండ్ పెరిగింది. కుదిరితే ఈ సినిమాని హిందీలో పునర్నిర్మించాలని భావిస్తున్నారు కొంతమంది నిర్మాతలు. వీళ్లలో బోనీ కపూర్, కరణ్ జోహార్ ముందువరుసలో ఉన్నాడు. 
ఓకే బంగారం సినిమాను తన కొడుకు అర్జున్ కపూర్ తో హిందీలో రీమేక్ చేయాలని అనుకుంటున్నాడు బోనీ. దీనికి సంబంధించి ఇప్పటికే శ్రీదేవిని రంగంలోకి దించాడు. మణిరత్నంతో ఆమె చర్చలు జరుపుతోంది. ఓకే బంగారం సినిమాకు కేవలం దర్శకుడు మాత్రమే కాదు.. నిర్మాత కూడా మణిరత్నమే. అందుకే నేరుగా శ్రీదేవి, మణిరత్నంతో టాక్స్ లో ఉంది. మరోవైపు యూత్ కథల్ని తెగ ఇష్టపడే కరణ్ జోహార్ కూడా ఓకే బంగారం రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా రైట్స్ దొరికితే బాలీవుడ్ హాట్ జంట రణబీర్ కపూర్, కత్రినాకైఫ్ తో ఓకే బంగారాన్ని రీమేక్ చేయాలని అనుకుంటున్నాడట కరణ్.