సీఆర్‌డీఏ చ‌ట్టంపై కోర్టుకెక్కిన మాజీ న్యాయ‌మూర్తులు

రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) చ‌ట్టాన్ని స‌వాలు చేస్తూ ఇద్ద‌రు విశ్రాంత‌ న్యాయ‌మూర్తులు సోమ‌వారం హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. రాజ‌ధాని నిర్మాణం కోసం వ్య‌వ‌సాయ భూముల‌ను సేక‌రించ‌డం ద్వారా రైతుల‌కు తీవ్ర న‌ష్టం చేకూరుస్తున్నార‌ని, పేద రైతులు దీని వ‌ల్ల ఎంతో న‌ష్ట‌పోతార‌ని వారు త‌మ పిటిష‌న్‌లో ఆరోపించారు. ఈ భూసేక‌ర‌ణ విధానం ప‌ర్యావ‌ర‌ణానికి కూడా న‌ష్టం చేకూరుస్తుంద‌ని వారు ఆరోపించారు. అస‌లు రాజ‌ధాని ఎంపిక‌పై కేంద్రంతో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌డం, అక్క‌డ నుంచి అనుమ‌తులు తీసుకోవ‌డం వంటి చ‌ర్య‌ల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించ‌లేద‌ని వారు కోర్టుకు తెలిపారు. మొత్తంమీద ఈ రాజ‌ధాని ఎంపిక వ్య‌వ‌హారం కేంద్రానికి తెలియ‌కుండా జ‌రిగిన‌ట్టు త‌మ‌కు అనుమానంగా ఉంద‌ని, ఇది చ‌ట్ట విరుద్ద‌మ‌ని వారు పేర్కొన్నారు. ఈ పిటిష‌న్‌పై హైకోర్టు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి నోటీసులు జారీ చేస్తూ కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని సూచిస్తూ కేసును జూన్ నెల మూడో వారానికి వాయిదా వేసింది.