Telugu Global
Others

భూములు లాక్కోవ‌ద్దు: బాబుకు హ‌జారే లేఖ‌

అన్న‌పూర్ణ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఉన్న‌ కీర్తిని కొన‌సాగించేందుకు పంట భూముల‌ను ప‌రిర‌క్షించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎన్‌. చంద్ర‌బాబు నాయుడుకు అన్నా హ‌జారే హిత‌వు చెప్పారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అధికారులు కొంత‌మంది అన్న‌దాత‌ల నుంచి బ‌ల‌వంతంగా భూములు లాక్కునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న అంశం త‌న దృష్టికి వ‌చ్చింద‌ని, రాజ‌ధాని న‌గ‌రం కోసం పంట భూముల‌ను నాశ‌నం చేయ‌డం త‌గ‌ద‌ని ఆయ‌న చంద్ర‌బాబునాయుడుకు రాసిన లేఖ‌లో పేర్కొన్నారు. సుంద‌ర‌మైన రాజ‌ధాని న‌గ‌రాన్ని నిర్మించుకోవాల‌నుకోవ‌డం త‌ప్పు కాద‌ని అయితే సిరుల‌ను […]

భూములు లాక్కోవ‌ద్దు: బాబుకు హ‌జారే లేఖ‌
X
అన్న‌పూర్ణ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఉన్న‌ కీర్తిని కొన‌సాగించేందుకు పంట భూముల‌ను ప‌రిర‌క్షించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎన్‌. చంద్ర‌బాబు నాయుడుకు అన్నా హ‌జారే హిత‌వు చెప్పారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అధికారులు కొంత‌మంది అన్న‌దాత‌ల నుంచి బ‌ల‌వంతంగా భూములు లాక్కునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న అంశం త‌న దృష్టికి వ‌చ్చింద‌ని, రాజ‌ధాని న‌గ‌రం కోసం పంట భూముల‌ను నాశ‌నం చేయ‌డం త‌గ‌ద‌ని ఆయ‌న చంద్ర‌బాబునాయుడుకు రాసిన లేఖ‌లో పేర్కొన్నారు. సుంద‌ర‌మైన రాజ‌ధాని న‌గ‌రాన్ని నిర్మించుకోవాల‌నుకోవ‌డం త‌ప్పు కాద‌ని అయితే సిరుల‌ను పండించే పంట భూముల‌ను దానికి ప‌ణంగా పెట్ట‌డం స‌రికాద‌ని హ‌జారే అన్నారు. పీవీ రాజ‌గోపాల్‌, స్వామి అగ్నివేశ్‌, మేథా పాట్క‌ర్‌, ఎం.జి. దేవ‌స‌హాయం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప‌ర్య‌టించిన‌ప్పుడు రైతులెవ‌రూ స్వ‌చ్ఛందంగా పొలాలు ఇవ్వ‌డానికి ముందుకు రావ‌డం లేద‌ని తెలుసుకున్నార‌ని, సేక‌ర‌ణ పేరుతో బ‌ల‌వంతంగా భూములు లాక్కునే ప్ర‌య‌త్నంలో అధికారులు రాష్ట్ర ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు చూపి బెదిరింపుల‌కు దిగుతున్నార‌ని వారి దృష్టికి వ‌చ్చింద‌ని, ఇది చాలా బాధాక‌ర‌మ‌ని హ‌జారే అన్నారు.
ముందు భూములు ఇవ్వ‌డానికి అంగీక‌రించిన రైతులు సైతం త‌ర్వాత త‌మ భూముల్లో పండే పంట‌ల‌ను గుర్తుకు తెచ్చుకుని త‌ర్వాత నిరాక‌రిస్తున్నార‌ని తెలిసింద‌ని, రైతుల‌ను ఇబ్బంది పెట్ట‌కుండా, వ్య‌వ‌సాయానికి భంగం క‌ల‌గ‌కుండా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించాల‌ని ఆయ‌న కోరారు. భూముల‌ను వ్య‌వ‌సాయ‌, వ్య‌వ‌సాయేత‌ర భూములుగా విభ‌జించి… వ్య‌వ‌సాయ భూముల‌ను ఎట్టి ప‌రిస్థితిలోను ఇత‌ర అవ‌స‌రాల‌కు వాడ‌బోమ‌న్న భ‌రోసా క‌ల్పించాల‌ని, కేంద్ర‌, రాష్ట్ర ఆహార భ‌ద్ర‌త చ‌ర్య‌ల్లో భాగంగా ఇందుకు అవ‌స‌ర‌మైతే చట్టం చేయాల‌ని ఆయ‌న సూచించారు. ఆర్గానిక్ ఆహారాన్ని అందించ‌డానికి రైతుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం సాయం చేయాల‌ని, ఆర్గానిక్ వ్య‌వ‌సాయ ప్రాంతంగా ఆ ఏరియాని ప్ర‌క‌టించాల‌ని హ‌జారే కోరారు. తాను పారిశ్రామికీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకిని కాద‌ని అయితే వ్య‌వ‌సాయ భూముల‌ను దీనికి మ‌ల‌చాల‌నుకుంటే దాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తాన‌ని హ‌జారే చెప్పారు. త‌న మ‌నోభావాల‌ను ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా అర్ధం చేసుకోగ‌ల‌ర‌ని తాను భావిస్తున్నాన‌ని ఆయ‌న ఆ లేఖ‌లో పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే తాను కూడా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప‌ర్య‌టించి రైతుల‌తో మాట్లాడ‌తాన‌ని ఆయ‌న పేర్కొన్నారు.
First Published:  23 April 2015 11:22 PM GMT
Next Story