టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ళ వ‌ద్ద టీడీపీ ధ‌ర్నాలు

ఒక‌వైపు తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్‌) ప్లీన‌రీ జ‌రుగుతుంటే మ‌రోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీలోకి జారిపోయిన వారి ఇళ్ళ వ‌ద్ద ధ‌ర్నాలు నిర్వ‌హించారు. ఎమ్మెల్యేలుగా టీడీపీ నుంచి గెలిచి ఆ త‌ర్వాత టీఆర్ఎస్ తీర్ధం పుచ్చ‌కున్న త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌, మంచిరెడ్డి కిష‌న్‌రెడ్డి, తీగ‌ల కృష్ణారెడ్డి, ధ‌ర్మారెడ్డిలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌ని వారు డిమాండు చేశారు. ఒక‌ప‌క్క టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్న మంచిరెడ్డి కిష‌న్‌రెడ్డి ఆ పార్టీ జెండా భుజం మీద వేసుకుని ప్లీన‌రీలో పాల్గొంటుండ‌గా మ‌రోవైపు ఆయ‌న ఇంటి ముందు టీడీపీ నాయ‌కురాలు శోభారాణి సార‌థ్యంలో ధ‌ర్నా నిర్వ‌హించ‌డానికి ప్ర‌య‌త్నించారు. అయితే ఆయ‌న ఇంటి వ‌ద్ద భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేయ‌డంతో అది సాధ్యం కాలేదు.. కిష‌న్‌రెడ్డి డౌన్‌డౌన్‌… ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాలి… అంటూ నినాదాలు చేశారు. దాంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.  అలాగే త‌ల‌సాని ఇంటి ముందు ధ‌ర్నా సంద‌ర్భంగా త‌ల‌సానీ ఖ‌బ‌డ్దార్‌…. ద‌మ్ముంటే ప‌ద‌వికి రాజీనామా చేసి మ‌ళ్ళీ పోటీ చేయ్‌…- అంటూ నినాదాల‌కు దిగారు. అలాగే ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణారెడ్డి, వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర‌కాల ఎమ్మెల్యే ధ‌ర్మారెడ్డి ఇళ్ళ ముందు కూడా చీపుర్లు, డ‌ప్పుల‌తో నిర‌స‌న‌కు దిగి తెలుగునాడు స్టూడెంట్ ఫెడ‌రేష‌న్ కార్య‌క‌ర్త‌లు నానా హ‌డావుడి సృష్టించారు. హ‌నుమ‌కొండ‌లోని ధ‌ర్మారెడ్డి ఇంటి ముందు టీడీపీ కార్య‌క‌ర్తలు చేరి నానా హంగామా చేశారు. శోభారాణితోపాటు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను, నాయ‌కుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు.