దేదీప్య తెలంగాణ‌ను ఆవిష్క‌రిస్తాం: కేసీఆర్‌

విద్యుత్ ఉత్ప‌త్తిలో దేశానికే త‌ల‌మానికంగా త‌మ రాష్ట్రం త‌యార‌వుతుంద‌ని, న‌ల్గొండ జిల్లా దామ‌ర‌చ‌ర్ల వ‌ద్ద త్వ‌ర‌లో నెల‌కొల్పే 6600 మెగావాట్ల విద్యుత్ కేంద్రం, రాబోయే మూడేళ్ళ‌లో 91,500 కోట్ల రూపాయ‌ల‌తో 24 వేల మెగావాట్ల విద్యుదుత్ప‌త్తికి తీసుకునే చ‌ర్య‌లు తెలంగాణను దేదీఫ్య‌వంతంగా త‌యారు చేస్తాయ‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర‌రావు తెలిపారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ల‌భ్య‌మ‌య్యే విద్యుత్ కేవ‌లం 4325 మెగావాట్లు మాత్ర‌మేన‌ని, అయినా ఎండాకాలం క‌రెంట్ కోత రాకుండా గృహాల‌కు, ప‌రిశ్ర‌మ‌ల‌కు నిరంత‌ర విద్యుత్తును స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని అన్నారు.  శుక్ర‌వారం ఎల్‌బిస్టేడియంలో ప్లీన‌రీలో అధ్య‌క్షోప‌న్యాసం చేస్తూ తెలంగాణ రావ‌డానికి కార‌ణాల‌ను, చేప‌ట్టిన ప‌థ‌కాల‌ను, చేప‌ట్ట‌బోయే కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌న విశ్లేషించారు.
ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా తెలంగాణ రాకుండా ఎవ‌రూ ఆప‌లేక‌పోయార‌ని… ఇపుడు బంగారు తెలంగాణ ల‌క్ష్యంగా త‌మ ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం అధికారం చేప‌ట్టాక ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌కు శ్రీ‌కారం చుట్టామ‌ని, ఎన్నో అభివృద్ధి ప‌థ‌కాలు ప్ర‌జ‌ల ముంగిట‌కు తెచ్చామ‌ని, మ‌రెన్నోకొత్త కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం ద్వారా పురోగ‌మ‌న తెలంగాణ ల‌క్ష్యాన్ని సాకారం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని కేసీఆర్ వివ‌రించారు. 17 వేల కోట్ల‌తో 34 ల‌క్ష‌ల మంది రైతుల‌కు ల‌క్ష రూపాయ‌ల చొప్పున‌ రుణాల‌ను మాఫీ చేశామ‌ని, గ‌త ఆంధ్ర నాయ‌కుల ప్ర‌భుత్వాల‌కు భిన్నంగా ఈసారి రైతు ఎక్క‌డా కంట‌నీరు పెట్ట‌కుండా పంట‌లు పండించుకునే వాతావ‌ర‌ణాన్ని నెల‌కొల్పామ‌ని ఆయ‌న అన్నారు.

వ‌స‌తి గృహాల్లో ఉండే విద్యార్థుల‌కు స‌న్న‌బియ్యం అన్నం పెట్ట‌డం దేశంలో ఎక్క‌డా లేద‌ని, ఇది ఒక్క తెలంగాణ‌కే సాధ్య‌మ‌ని చెబుతూ ఈ గొప్ప‌ద‌నం అంతా త‌న సోద‌రుడు ఆర్థిక మంత్రి అయిన ఈటెల రాజేంద‌ర్‌దేన‌ని ప్రశంసించారు. ఆయ‌న ఆలోచ‌న‌ల నుంచే వ‌స‌తి గృహ విద్యార్థుల‌కు తెల్ల, స‌న్న బియ్యం అన్నం ద‌క్కింద‌ని ఆయ‌న తెలిపారు. త్వ‌ర‌లో ప్ర‌తి ద‌ళిత కుటుంబానికి మూడెక‌రాల భూమిని పంపిణీ చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని, దీంతో వారి కుటుంబాలు బాగుప‌డ‌తాయ‌ని ఆయ‌న అన్నారు. క‌ళ్యాణ‌ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ ప‌థ‌కాల‌కు శ్రీ‌కారం చుట్టామ‌ని, ఆరోగ్య ల‌క్ష్మీ ప‌థ‌కానికి రూ. 200 కోట్లు కేటాయించామ‌ని,  ఫిల్మ్‌సిటీ, ఫార్మాసిటీ, ఎడ్యుకేష‌న్ సిటీల‌కు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నామ‌ని తెలిపారు.
అడిగిన‌వ‌న్నీ ఇస్తున్నాం…

న్యాయ‌వాదులు త‌మ‌కు ఫండ్ కావాల‌న్నారు. 100 కోట్లు ఇచ్చాం. జ‌ర్న‌లిస్టులు మాకు నిధులు కావాల‌న్నారు. 10 కోట్లు ఇచ్చాం. డాక్రా మ‌హిళ‌లు త‌మ‌కిచ్చే రుణాలు ప‌రిమితిని పెంచ‌మ‌ని కోరారు. ఈ స‌భాముఖంగా చెబుతున్నా… వారికి ఇక‌నుంచి ఇచ్చే రుణ ప‌రిమితిని 
ఐదు నుంచి ప‌ది ల‌క్ష‌ల‌కు పెంచుతామ‌ని ప్ర‌క‌టించారు.. త‌మ ప్ర‌భుత్వం వృద్ధుల‌కు రూ. 1000 పింఛ‌ను ఇస్తుంద‌ని, ఆస‌రా పింఛ‌న్ల‌తో 32 ల‌క్ష‌ల మంది ల‌బ్ధి పొందుతున్నార‌ని, వ‌చ్చే నాలుగేళ్ళ‌లో ప్ర‌తి ఇంటికీ న‌ల్లా క‌నెక్ష‌న్ వ‌చ్చేలా చూస్తామ‌ని, ఇది నెర‌వేర్చ‌క‌పోతే త‌మ‌కు ఓటు కూడా వేయొద్ద‌ని కేసీఆర్ భ‌రోసాగా చెప్పారు. ఏ వ‌ర్గ‌మూ త‌మ వ‌ద్ద‌కు స‌మ‌స్య‌లు తేకుండా చూసుకోవాల‌నే ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంద‌ని… ఎవ‌రికైనా స‌మ‌స్య‌లుంటే తామే స‌చివాల‌యానికి పిలిచి మాట్లాడి ప‌రిష్క‌రిస్తున్నామ‌ని కేసీఆర్ చెప్పారు.