Telugu Global
Arts & Literature

విలక్షణ చిత్రకారుడు "దాసి" సుదర్శన్‌

క‌ళా సేవ‌కే అంకిత‌మైపోయిన వారు “దాసి” సుద‌ర్శ‌న్‌. 1988లో వ‌చ్చిన దాసి సినిమా పిట్టంప‌ల్లి సుద‌ర్శ‌న్‌ని దాసి సుద‌ర్శ‌న్‌గా మార్చేసింది. అదే ఆయ‌న్ను క‌ళ‌కే ప‌రిమిత‌మ‌య్యేలా చేసింది. ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించి ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా, పుస్త‌క ర‌చ‌యిత‌గా, కార్టూనిస్టుగా, జ‌ర్న‌లిస్టుగా, ఫొటోగ్రాఫ‌ర్‌గా, ఉప‌న్యాసకుడిగా, చిత్రకారుడిగా ప్ర‌సిద్ధికెక్కారు. అలా సేవ చేస్తూ ఎన్నో అవార్డులు ద‌క్కించుకుని వాటికే వ‌న్నె తెచ్చారు.         దాసి సుద‌ర్శ‌న్ న‌ల్గొండ జిల్లా మిర్యాల‌గూడ వాసి. 1952 […]

విలక్షణ చిత్రకారుడు దాసి సుదర్శన్‌
X
Dasi-Sudarshan
Dasi Sudharshan

క‌ళా సేవ‌కే అంకిత‌మైపోయిన వారు “దాసి” సుద‌ర్శ‌న్‌. 1988లో వ‌చ్చిన దాసి సినిమా పిట్టంప‌ల్లి సుద‌ర్శ‌న్‌ని దాసి సుద‌ర్శ‌న్‌గా మార్చేసింది. అదే ఆయ‌న్ను క‌ళ‌కే ప‌రిమిత‌మ‌య్యేలా చేసింది. ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించి ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా, పుస్త‌క ర‌చ‌యిత‌గా, కార్టూనిస్టుగా, జ‌ర్న‌లిస్టుగా, ఫొటోగ్రాఫ‌ర్‌గా, ఉప‌న్యాసకుడిగా, చిత్రకారుడిగా ప్ర‌సిద్ధికెక్కారు. అలా సేవ చేస్తూ ఎన్నో అవార్డులు ద‌క్కించుకుని వాటికే వ‌న్నె తెచ్చారు.

దాసి సుద‌ర్శ‌న్ న‌ల్గొండ జిల్లా మిర్యాల‌గూడ వాసి. 1952 ఫిబ్ర‌వ‌రి 2న పుట్టారు. ప్ర‌ముఖ పౌరాణిక రంగ స్థ‌ల న‌టుడు మ‌ట్ట‌య్య కొడుకుగా ఆ క‌ళా సేవ‌నే పుణికిపుచ్చుకున్నారు. బీఏ బీఈడీ చేసి అప్ప‌ట్లోనే టైప్ రైట‌ర్ హ‌య్య‌ర్ పాసై… టీటీసీ కూడా పూర్తి చేశారు. అలా తాను పొందిన జ్ఞానాన్ని ప‌ది మందికి పంచాల‌ని నిర్ణ‌యించుకుని ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించారు. 1978 నుంచి నాగార్జున‌సాగ‌ర్ ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీలో చిత్ర‌క‌ళా ఉపాధ్యాయుడిగా కొన‌సాగారు. 2009 మార్చిలో ఉద్యోగం నుంచి మాత్ర‌మే విర‌మ‌ణ తీసుకున్నారు. తాను న‌మ్ముకున్న, తాను ప్రేమించిన చిత్రకళలో మాత్రం ఇంకా కొన‌సాగుతూనే ఉన్నారు, ఉంటారు.

బి.న‌ర్సింగ‌రావు నిర్మించిన దాసి చిత్రానికి ఐదు జాతీయ అవార్డులు వ‌చ్చాయి. అందులో ఉత్త‌మ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సుద‌ర్శ‌న్ ఎంపిక‌య్యారు. అప్ప‌టి నుంచే ఆయ‌న “దాసి” సుద‌ర్శ‌న్‌గా మారిపోయారు. దాసి చిత్ర‌క‌థ నిజాంకాలం నాటిది. ఆనాటి జీవ‌న ప‌రిస్థితులు, సామాజిక అవ‌గాహ‌న‌తో కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా చ‌క్క‌టి బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించారు సుద‌ర్శ‌న్‌. అలా కాస్ట్యూమ్ రంగంలోనే ద‌క్షిణ భార‌త దేశంలో తొలి జాతీయ అవార్డును అందుకున్న వ్య‌క్తిగా చ‌రిత్ర‌కెక్కారు. ఆ అవార్డు అందుకున్న తొలి తెలుగు వ్య‌క్తి కూడా ఆయ‌నే. “మావూరు” ల‌ఘు చిత్రానికి అసోసియేట్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా ఉన్నారు. 1984లో వ‌చ్చి, నంది అవార్డు పొందిన ల‌ఘు చిత్రం ‘ఈ చ‌రిత్ర చెరిపేద్దాం’కు ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశారు. 2000 సంవ‌త్స‌రంలో నంది అవార్డుల క‌మిటీలో స‌భ్యునిగా ఉన్నారు. 2002లో రామానాయుడు నిర్మించిన “హ‌రివి‌ల్లు” చిత్రానికి సుద‌ర్శ‌న్ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ప‌ని చేశారు. ఈ చిత్రం బంగ్లాదేశ్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో వర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నేజేష‌న్ వారి బ‌హుమ‌తిని కూడా గెలుచుకుంది.

ఆర్టిస్టుగా వంద‌లాది గ్రంథాల‌కు ముఖ చిత్రాలు గీశారు. మ‌హాక‌వి శ్రీశ్రీ పుస్త‌కానికీ ముఖ‌చిత్రం అందించిన ఘ‌న‌త‌ను సాధించారు. మ‌హాక‌వి గుర‌జాడ‌, శ్రీశ్రీ, రావి శాస్త్రి లాంటి వారిపై చిత్ర క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటు చేసి ప‌లు జిల్లాల్లోని పాఠశాలల్లో ప్ర‌ద‌ర్శించారు. 1991 నుంచి “ఆల” అనే క‌ళ‌ల వేదిక‌ను స్థాపించి ఇప్ప‌టికీ సాహిత్య స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. విద్యా రంగంలోనూ విశేష కృషి చేశారు. 1991లో ఒక‌టి నుంచి ప‌ద‌వ త‌ర‌గ‌తి సిల‌బ‌స్ త‌యారీ క‌మిటీలో స‌భ్యుడిగా ఉండి డ్రాయింగ్ సిల‌బ‌స్‌ను రూపొందించారు. 1992లో రాష్ట్ర స్థాయి ఉత్త‌మ ఉపాధ్యాయునిగా అప్ప‌టి ముఖ్య‌మంత్రి పుర‌స్కారాన్ని అందుకున్నారు. జాతీయ పండుగ‌ల సంద‌ర్భంగా 1993-94లో సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్‌లో ప్ర‌ద‌ర్శించిన రాష్ట్ర విద్యా శాఖ శ‌క‌టం సుద‌ర్శ‌నం రూపొందించినదే. అలా నాలుగుసార్లు ఆయ‌న రూపొందించిన శ‌క‌టాల్లో ఒక‌దానికి బ‌హుమ‌తి కూడా వ‌చ్చింది.

ఇలా ఎన్నో అనుభ‌వాల‌తో దాసి సుద‌ర్శ‌న్ రాసిన కుంచెలు-క‌లాలు ఎంతోమంది విమ‌ర్శ‌కుల ప్ర‌సంశ‌లు అందుకుంది. ఈయ‌నొక మంచి పాఠ‌కుడు కూడా. గుర‌జాడ‌, రావి శాస్త్రి, శ్రీశ్రీ, కాళోజి, కాళీప‌ట్నం, బాల గంగాధ‌ర్ తిల‌క్ ర‌చ‌న‌లంటే చాలా ఇష్టం ఆయ‌న‌కు. సాహిత్యంపై మ‌క్కువ ఎక్కువ‌. అందుకే న‌ల్గొండ‌లో ఒక గ్రంథాల‌యాన్ని కూడా స్థాపించారు. అంత‌టితోనే ఆయ‌న సాహితీ ప్ర‌యాణం ఆగిపోలేదు. తాను వేసిన చిత్రాల‌ను ప‌ది మందికి తెలిసేలా ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చారు. అందులో చ‌లం చిత్రం ఎన్నో ప్ర‌శంస‌లు అందుకుంది. చ‌లంపై వ‌చ్చిన పుస్త‌కానికి అంది ముఖ‌చిత్రంగా మారింది. అదే సుద‌ర్శ‌న్ క‌ళాగొప్ప‌త‌నం. బాపుకు ఏక‌ల‌వ్య శిష్య‌రికం చేశారు సుద‌ర్శ‌న్‌. అంటే ఆయ‌న‌కున్న క‌ళా అనుభ‌వం ఎంత‌టి గొప్ప‌దో అర్థం చేసుకోవ‌చ్చు. చిన్న‌త‌నం నుంచే ఆయ‌న ప‌డిన శ్ర‌మ‌, చేసిన కృషి సుద‌ర్శ‌న్‌ను దాసి సుద‌ర్శ‌న్‌గా సాహితీలోకంలో పేరు సంపాదించిపెట్టాయి.

First Published:  25 April 2015 9:30 PM GMT
Next Story