రాజ్య‌స‌భ‌కు హూందాత‌నం తెచ్చిన రాజీవ్‌

rajev ex mp of cpmన్యూఢిల్లీ: ఈ రాజీవ్ నెహ్రూ కుటుంబానికి చెందిన‌వారు కాదు… కాంగ్రెస్ పార్టీ అస‌లే కాదు… అయినా ఆయ‌న మ‌ళ్ళీ రాజ్య‌స‌భ‌కు ఎన్నిక కావాల‌ని పార్టీల‌క‌తీతంగా ఆహ్వానించారు. బీజేపీతోపాటు కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ… ఇలా అన్ని పార్టీలూ ఆయ‌న ఎన్నిక‌నే కోరుకున్నారు. సీపీఎంకి విజ్ఞ‌ప్తి కూడా చేశారు. ఆయ‌న పేరే రాజీవ్‌. పదవీ కాలం ముగిసిన త‌ర్వాత ఒక నాయ‌కుడికి అరుదైన స్వాగ‌త గీతం ఇది. పెద్దల సభలో పార్టీలకతీతంగా నేతలంతా కేర‌ళ‌కు చెందిన ఆయన్ని తిరిగి రాజ్యసభకు పంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ న‌భూతో… సంఘటన రాజ్యసభలో చోటు చేసుకుంది. సీపీఎం తరఫున పెద్దల సభకు ప్రాతినిథ్యం వహించారు. రాజీవ్‌తోపాటు సీపీఐకి చెందిన‌ అచ్చుతన్‌, కాంగ్రెస్‌కు చెందిన వయలార్‌ రవిల‌ పదవీ కాలం ఒకేసారి ముగిసింది. వారికి సాద‌ర వీడ్కోలు ఇవ్వాల్సి ఉంది. అయితే వారు రిటైర‌యిన రోజు స‌భ జ‌ర‌గ‌లేదు. అయితే ఆ త‌ర్వాత రోజు ఈ విష‌యం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. వారికి ఘ‌న‌మైన వీడ్కోలు ప‌ల‌కాల‌ని స‌భ్యులు రాజ్య‌స‌భ చైర్మ‌న్ దృష్టికి తీసుకువ‌చ్చారు. గ‌త ఆన‌వాయితీని పాటించాల‌ని కోరారు. రిటైర‌యిన ముగ్గురిలో వాయ‌ల‌ర్ ర‌వి మ‌రోసారి ఎన్నిక‌య్యారు. మిగిలిన వారికి సాద‌ర వీడ్కోలు ప‌ల‌కాల‌ని… ఆవిధంగా వారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని ఎస్పీ సభ్యుడు నరేష్‌ అగర్వాల్‌ చైర్మన్‌ హమీద్‌ అన్సారీ దృష్టికి తెచ్చారు. దీనికి అన్సారీ అనుమతివ్వడంతో కేంద్ర ఆర్థిక మంత్రి, బీజేపీ పక్ష నేత అరుణ్‌ జైట్లీ తొలుత మాట్లాడారు. ‘రాజీవే.. సభలో లేకపోవడం ఒక వెలితి. సభా కార్యకలాపాలు, నిబంధనల విషయంలో ఆయనకున్న అవగాహన చాలా గొప్పది. అలాంటి వ్యక్తి సభలో ఉండడం ఎంతో అవసరం. ఆయన్ని తిరిగి సభకు పంపాలని సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శి ఏచూరిని కోరుతున్నా’ అని జైట్లీ పేర్కొన్నారు. ‘సభా నిబంధనల విషయంలో రాజీవే.. ఒక ఎన్‌సైక్లోపీడియా. సభా కార్యకలాపాల నిర్వహణ, నియమాలపై ఆయన చేసిన అధ్యయనం సభ్యులందరికీ మార్గదర్శకం. ఆయన్ని తిరిగి సభకు పంపేలా చూడాలని ఏచూరిని కోరుతున్నా’ అని కాంగ్రెస్‌ పక్ష నేత ఆజాద్‌ అన్నారు. బీఎస్పీ అధినేత్రి సహా పలువురు నేతలు సీపీఎంకి అదే సూచన చేశారు. సీతారం ఏచూరి కూడా దానికి ప్ర‌తిస్పంద‌న‌గా తాము కూడా రాజీవ్‌ను మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని స‌మాధాన‌మిచ్చారు. దాంతో స‌భ్యులంతా హ‌ర్షాతిరేకం వ్య‌క్తం చేశారు.