ప్రత్యేక హోదాపై ‘గోబెల్స్‌’ ప్రచారం

హైదరాబాద్‌:: ఏపీకి ప్రత్యేక హోదాపై విపక్షాలు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, అధికార ప్రతినిధి సుధీష్‌ రాంభోట్ల ఆరోపించారు. ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం ప్రకటించకపోయినా వైసీపీ, కాంగ్రెస్‌, వామపక్షాలతోపాటు టీడీపీలోని కొంతమంది నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘ఏపీకి టోపీ, చేయూత ఇస్తామన్న పార్టీ చేయిచ్చేసింది’ అంటూ బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం జరుగుతున్నదన్నారు. విభజన సమయంలో ఏపీకి ఏమి కావాలో చెప్పని పార్టీలు ఇప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించడం అన్యాయమన్నారు. టీడీపీతోపాటు కాంగ్రెస్‌, వైసీపీ, లెఫ్ట్‌ పార్టీలు కూడా ఏపీకి ఇవి కావాలని కేంద్రాన్ని కోరలేదన్నారు. ప్రత్యేక హోదా ఇప్ప‌టికీ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని చెప్పారు.