చిల్ల‌ర క‌ల్యాణ్‌పై క్రిమిన‌ల్ కేసు

త‌మ‌కు చెందాల్సిన కోటీ 40 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను అక్ర‌మంగా త‌న ఖాతాలోకి మార్చుకోవ‌డాన్ని ప్ర‌శ్నించినందుకు త‌న‌పై దాడి చేసి అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించాడ‌ని సినీ నిర్మాత చిల్ల‌ర క‌ల్యాణ్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో డాక్ట‌ర్ క‌విత అనే మ‌హిళ కేసు పెట్టింది. మెట్రో రైల్ నిర్మాణంలో భాగంగా త‌మ భ‌వ‌నం న‌ష్ట‌పోతున్నందుకు వ‌చ్చిన ప‌రిహారాన్ని క‌ల్యాణ్ త‌న బ్యాంకు ఖాతాలో వేసుకోడానికి ప్ర‌య‌త్నించాడ‌ని, ఈ మొత్తం భ‌వ‌నంలో ఉంటున్న 11 మంది ప్లాట్ ఓన‌ర్ల‌కు చెందిన‌ద‌ని, ఈ విష‌యాన్ని ప్ర‌శ్నించిన త‌న‌పై దాడికి పాల్ప‌డ్డాడ‌ని, చెప్పుతో కొట్ట‌డానికి ప్ర‌య‌త్నించాడ‌ని, అడ్డొచ్చిన త‌న సోద‌రి, తల్లిని కూడా దుర్భాష‌లాడాడ‌ని ఆమె ఆరోపించారు. 2007లో ఫ్లాట్ ఓన‌ర్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ఏర్ప‌డినా అధ్య‌క్షుడిగా ఉన్న క‌ల్యాణ్‌ ఈ ఎనిమిది సంవ‌త్స‌రాల్లో ఒక్క మీటింగ్ కూడా పెట్ట‌లేద‌ని, ఇపుడు మీటింగ్ పెట్టి త‌న‌కు స‌మాచారం ఇవ్వ‌లేద‌ని, మెట్రో రైల్ నుంచి వ‌చ్చిన ప‌రిహారం స‌క్ర‌మంగా అందేలా చూడాల‌ని తాము జిహెచ్ఎంసీకి లెట‌ర్ ఇచ్చామ‌ని, ఇది త‌ట్టుకోలేని క‌ల్యాణ్ ఫిర్యాదు చేస్తావా అంటూ చెప్ప‌డానికి వీలులేని భాష‌తో దూషించాడ‌ని, భౌతికంగా దాడి చేశాడ‌ని, మ‌హిళ‌ల‌ని కూడా చూడకుండా ఇంత దారుణంగా వ్య‌వ‌హ‌రించిన క‌ల్యాణ్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశామ‌ని ఆమె తెలిపారు. నాలుగొంద‌ల మంది జూనియ‌ర్ ఆర్టిస్టుల‌ని ఇంటి చుట్టూ పెట్టి తన‌ను ఇంట్లోంచి క‌ద‌ల‌కుండా చేస్తాన‌ని బెదిరించాడ‌ని ఆమె చెప్పారు.