బ‌స్సులోనే త‌ల్లీకూతుళ్ళ‌పై అత్యాచార య‌త్నం!

నిర్భ‌య చ‌ట్టాలు ఉన్నా అత్యాచారాల‌కు అడ్డుక‌ట్ట వేయ‌లేక‌పోతున్నాయి. తాజాగా పంజాబ్‌లోని మోఘా ప్రాంతంలో జ‌రిగిన సంఘ‌ట‌న ఇపుడు ఆ రాష్ట్రంతోపాటు గురువారం పార్ల‌మెంట్‌ను కూడా కుదిపేసింది. మోఘాలో బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న ఓ తల్లీకూతుళ్ళ‌పై ఆ బ‌స్సు న‌డుపుతున్న డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్లే కామ‌పిచాచుల్లా మారి అత్యాచారానికి ప్ర‌య‌త్నించారు. ఈ సంఘ‌ట‌న‌లో వారిద్ద‌రినీ తీవ్రంగా ప్ర‌తిఘ‌టించినా ప్ర‌యోజ‌నం లేక‌పోవ‌డంతో 14 యేళ్ళ కూతురు బ‌స్సుల్లోంచి దూకేసి మానాన్ని ర‌క్షించుకోవాల‌నుకుంది. కాని దుర‌దృష్ట‌వ‌శాత్తూ ప్రాణాన్నే కోల్పోయింది. కూతురు బ‌స్సులోంచి దూకేయ‌డంతో ఆగ్ర‌హించిన ఈ ఇద్ద‌రు కామాంధులు  ఆమ‌ను కూడా బ‌స్సులోంచి బ‌య‌టికి తోసేసి వెళ్ళిపోయారు. తీవ్రంగా గాయ‌ప‌డిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు బ‌స్సును పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ బ‌స్సు ముఖ్య‌మంత్రి బాద‌ల్ బంధువుల‌కు చెందినది కావ‌డంతో ఈ సంఘ‌ట‌న రాజ‌కీయ రంగు పులుముకుంది. బాద‌ల్ రాజీనామా చేయాల‌ని కాంగ్రెస్‌తోపాటు ఆమ్ఆద్మీ పార్టీ డిమాండు చేస్తోంది. పార్ల‌మెంటులో ఈ సంఘ‌ట‌న గురువారం కుదిపేసింది. నిందితుల‌కు క‌ఠిన శిక్ష‌లు విధించాల‌ని, ఈ అంశంపై న్యాయ విచార‌ణ‌కు ఆదేశించాల‌ని ఈ రెండు పార్టీలు డిమాండు చేశాయి.