బాహుబలిపై కన్నేసిన కరణ్ జోహార్

బాలీవుడ్ టాప్ డైరక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఎప్పుడో టాలీవుడ్ పై కన్నేశాడు. ఆమధ్య కొన్ని సూపర్ హిట్ సినిమాల రీమేక్ రైట్స్ కూడా దక్కించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా బాహుబలిపై కరణ్ జోహార్ కన్నుపడింది. అంతే.. వెంటనే బాహుబలి నిర్మాతల్ని సంప్రదించి ఒప్పందం కుదుర్చుకున్నాడు. తాజా ఒప్పందం ప్రకారం.. తెలుగు-తమిళ-కన్నడ భాషల్లో బాహుబలి సినిమాను ఒరిజినల్ నిర్మాతలే విడుదల చేస్తారు. హిందీలో మాత్రం బాహుబలి సినిమాను కరణ్ జోహార్ ప్రజెంట్ చేస్తాడు. ఈ విషయాన్ని కరణ్, అఫీషియల్ గా ప్రకటించాడు. దీనికి కృతజ్ఞతగా రాజమౌళి కూడా రీట్వీట్ చేశాడు. బాహుబలి టీంలోకి కరణ్ జోహార్ ఎంటరవ్వడం వల్ల రెండు ఉపయోగాలు. ఒకటి నేషనల్ లెవెల్లో ఇప్పటికే కాస్త పేరుతెచ్చుకున్న బాహుబలి సినిమాకు మరింత ప్రచారం కల్పించగలడు కరణ్. మరీ ముఖ్యంగా విభిన్నంగా ప్రమోషన్ కల్పించడంలో ఇతగాడు ఆరితేరిపోయాడు కాబట్టి.. బాహుబలిని బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ ప్రాజెక్ట్ గా మార్చేయగలడు. దీనివల్ల సినిమాకి ఇన్ స్టెంట్ గా లాభాలు వస్తాయి. ఇక రెండో లాభం ఏంటంటే.. కరణ్ రాకతో బాహుబలి సినిమాకి ఓవర్సీస్ మార్కెట్ కూడా భారీగా పెరగనుంది. విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులే కాకుండా.. మిగతా ఎన్నారైలు కూడా బాహుబలి వైపు ఆకర్షితులయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొత్తానికి కరణ్ మంచి ప్రాజెక్ట్ నే పట్టాడు. అయితే ఈ డీల్ విలువు ఎంతనేది మాత్రం బయటకు రాలేదు.