ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా మే 6న ‘దాన వీర శూర కర్ణ’ ఆడియో

స్వర్గీయ నందమూరి జానకిరామ్‌ తనయుడు మాస్టర్‌ ఎన్టీఆర్‌ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం ‘దాన వీర శూర కర్ణ’. జె.వి.ఆర్‌ దర్శకుడు. శ్రీసాయి జగపతి పిక్చర్స్‌, సంతోష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె.బాలరాజు, చలసాని వెంకటేశ్వరరావు నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి పూర్తయింది. మే 6న పాటల్ని విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ… ‘బాల రామాయణం’ తర్వాత అంతా బాలనటీనటులతో వస్తున్న బాలల చిత్రమిది. స్వర్గీయ నందమూరి జానకీరామ్‌ తనయుడు మాస్టర్‌ ఎన్టీఆర్‌ కృష్ణుడిగా, రెండో కుమారుడు సౌమిత్ర సహదేవునిగా నటిస్తున్నారు. ఇద్దరూ కూడా అద్భుతంగా యాక్ట్‌ చేశారు. నటనలో తాతకు తగ్గ మనవళ్లు అనిపించుకుంటారు. దర్శకుడు జెవిఆర్‌ ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో బాగా తెరకెక్కించారు. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. కౌసల్య సంగీతం అందించిన ఈ సినిమా పాటల్ని నందమూరి హరికృష్ణ, కళ్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌ల సమక్షంలో మే 6న విడుదల చేస్తున్నాం. పాటలు, సినిమా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. మే 28న మహానటుడు నందమూరి తారకరామారావుగారి జయంతి సందర్భంగా సినిమాను విడుదల చెయ్యబోతున్నాం అని అన్నారు.