Telugu Global
Family

అంజన (FOR CHILDREN)

            “జై చిరంజీవా.. జగదేక వీరా… అసహాయసూరా… అంజని కుమారా…” పాట విన్నారు కదా? ఆ పాట ఎవరి మీదో అర్థమయి పోయింది కదూ?! అలాగే “అంజనీ పుత్రుడా… వీరాథి వీరుడా… ధీరుడా శూరుడా…” ఈ పాటా విన్నారు కదూ? ఔను! ఆంజనేయుణ్ని భక్తితో కొలిచే పాటలే… అయితే అన్ని పాటల్లోనూ ఆయన అంజనీ పుత్రుడే! తెలిసింది కదా… అంజన ఆంజనేయుడు వాళ్ళమ్మ!             వానర జాతికి చెందిన కుంజరుడి కూతురే అంజన. భర్త పేరు కేసరి. […]

“జై చిరంజీవా.. జగదేక వీరా… అసహాయసూరా… అంజని కుమారా…” పాట విన్నారు కదా? ఆ పాట ఎవరి మీదో అర్థమయి పోయింది కదూ?! అలాగే “అంజనీ పుత్రుడా… వీరాథి వీరుడా… ధీరుడా శూరుడా…” ఈ పాటా విన్నారు కదూ? ఔను! ఆంజనేయుణ్ని భక్తితో కొలిచే పాటలే… అయితే అన్ని పాటల్లోనూ ఆయన అంజనీ పుత్రుడే! తెలిసింది కదా… అంజన ఆంజనేయుడు వాళ్ళమ్మ!

వానర జాతికి చెందిన కుంజరుడి కూతురే అంజన. భర్త పేరు కేసరి. ఒక రోజున అంజన అలా విహరిస్తూవుంటే వాయుదేవుడు చూసాడు. చూసి యిష్ట పడ్డాడు. కోరుకున్నాడు. “నీకు కామరూపుడైన కొడుకు పుడతాడు, బల సంపదలో అతనికెవరూ పోటీరారు” అని ఆశపెట్టాడు. అంజన అడ్డు చెప్పలేకపోయింది. అలా ఆంజనేయుడు పుట్టాడు. అందుకనే ఆంజనేయుణ్ని వాయు పుత్రుడని కూడా అంటాం. ఆంజనేయ దండకంలో “భజే వాయుపుత్రం… భజే వాలగాత్రం…” గుర్తొచ్చిందా?

రామాయణంలో ఈ కథ వుంటే విచిత్ర రామాయణంలో అంజన గురించి మరో విచిత్రమైన కథ వుంది. అహల్య గౌతముల కథ తెలుసు కదా? వాళ్ళ అమ్మాయే అంజన. అయితే తండ్రి గౌతముడు తను బయటకు వెళ్తూ కూతురు అంజనను అహల్యకు కాపలాగా వుంచాడు. అప్పుడు గౌతముడు లేని వేళలో సూర్యుడు వచ్చాడట. అతని తేజస్సుకి అంజనకు కళ్ళు పోయాయట. మారు రూపంలో అదీ గౌతముడి రూపంలో ఇంద్రుడు రావడం వల్ల అహల్య మరో కొడుకుని కన్నదట. అయితే ఆ ఇద్దరు కొడుకుల్నీ గౌతముడు తన చెరో భుజమ్మీద ఎక్కించుకొని మోస్తున్నాడట. అంజనను మత్రం నడిపిస్తున్నాడట. అలా సముద్ర తీరమంతా తిరుగుతూ వుంటే అంజన ఆగలేక అడిగేసిందట. ఏమని? “నాన్నా! నీ కూతుర్ని ఎర్రని ఎండలో నడిపిస్తున్నావు, పరాయి వాళ్ళ పిల్లల్ని మోస్తున్నావు… ధర్మమా?” అని. గౌతముడప్పుడు అనుమానంతో చూసాడట. “మీవి కోతి ముఖాలగు గాక!” అని శపించి వాళ్ళని సముద్రంలోకి విసిరేసాడట. వాళ్ళే వాలీ సుగ్రీవులు!

అయితే నా గుట్టును బయట పెడతావా అని అహల్య ఏం చేసిందటా – నువ్వలా కళ్ళులేని కబోదిగానే వుండు అని శపించింది చాలక, నీకు కూడా వానరుడే అంటే కోతే పుడుతుందని అనేసిందట!

అదీ అంజనీ దేవి కథ!

కామ రూపము అంటే కోరిన రూపము. కామ రూపి అంటే ఇష్టమొచ్చిన రూపములో వుండేవాడు. అలాంటి శక్తి యుక్తులన్నీ తల్లి అంజన నుండే ఆంజనేయుడికి వచ్చాయంటే కాదన లేం!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  1 May 2015 8:19 PM GMT
Next Story