పుష్క‌ర నిధుల్లో అవినీతి తాండ‌వం: జ‌గ‌న్‌

రాజ‌మండ్రి: తెలుగుదేశం ప్ర‌భుత్వం ప‌నుల క‌న్నా ప్ర‌చారానికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని వైఎస్ఆర్‌సీపీ అధినేత వై.ఎస్. జ‌గ‌న్ ఆరోపించారు. పుష్క‌రాలు జ‌ర‌గ‌నున్న ప్రాంతాల్లో ఆయ‌న ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ పుష్క‌రాల పేరుతో తెలుగుదేశం నాయ‌కులు దోపిడీకి పాల్ప‌డుతున్నార‌ని, విడుద‌ల‌యిన నిధులు అడ్డంగా దండుకుంటున్నార‌ని అన్నారు. అస‌లు ఇప్ప‌టివ‌ర‌కు పుష్క‌రాల పేరుతో ఎన్ని నిధుల‌ను విడుద‌ల చేశారో, ఎంత మొత్తం ఖ‌ర్చు చేశారో చెప్ప‌గ‌ల‌రా అని ప్ర‌శ్నించారు. పుష్క‌రాల నిధులు విడుద‌ల‌కు సంబంధించి అసెంబ్లీలో చంద్ర‌బాబు రూ. 200 కోట్లు విడుద‌ల చేసిన‌ట్టు చెప్పార‌ని, అదే అంశంపై ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు రూ. 1400 కోట్లు విడుద‌ల చేసిన‌ట్టు చెప్పార‌ని, వాస్త‌వంగా విడుద‌ల‌య్యింది 86 కోట్లు మాత్ర‌మేన‌ని అన్నారు. పుష్క‌రాల ప‌నులు ఇవ్వ‌డంలో కూడా అవినీతి రాజ్య‌మేలింద‌ని, ఒకే కాంట్రాక్ట‌ర్‌ని పిలిచి అత‌నికే ప‌నులను అప్ప‌గించార‌ని, ఈ విష‌యాన్ని స్వ‌యంగా కాంట్రాక్ట‌రే త‌న‌కు చెప్పాడ‌ని జ‌గ‌న్ తెలిపారు. ఇలాంటి ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌లు ఎక్కువ కాలం న‌మ్మ‌ర‌ని అన్నారు.