ప్రపంచ విత్తన గోడౌన్‌గా తెలంగాణ: సీఎం కేసీఆర్‌

నల్గొండ: ప్రపంచ విత్తన గోడౌన్‌గా తెలంగాణ మారటం ఖాయమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. నాగార్జునసాగర్‌లో జరుగుతున్న టీఆర్‌ఎస్‌ రెండో రోజు శిక్షణా తరగతులలో భాగంగా ఆదివారం ఆయన ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 400లకు పైగా విత్తన ఉత్పత్తి కేంద్రాలున్నాయని, ప్ర‌భుత్వం దృష్టి పెడితే రాష్ట్రంలో విత్త‌నాల రూప‌క‌ల్ప‌న పెద్ద ఎత్తున చేప‌ట్ట‌డం అసాధ్య‌మేమీ కాద‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్రంలో రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌ని, ఎక్క‌డ రైతు ఇబ్బంది ప‌డుతున్నా వారికి మార్గ‌ద‌ర్శ‌నం చేయాల్సిన బాధ్య‌త పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులపై ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఆదర్శ రైతులతో చర్చించి త్వరలో వ్యవసాయ విధానాన్ని రూపొందిస్తామని కేసీఆర్‌ చెప్పారు. రాష్ర్టాన్ని పంటల కాలనీలుగా మార్చాలన్నారు. రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, దాన్యం నిలువల కోసం గోడౌన్ల పెంపునకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వ్యవసాయదారులకు బీమా సౌకర్యం కల్పిస్తామని, వ్యవసాయంలో సాంకేతికత, ఆధునికత పెరగాలని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.