Telugu Global
Family

శిఖండి (FOR CHILDREN)

        శిఖండి అనగానే ఎవరికైనా మహాభారత యుద్ధం గుర్తుకువస్తుంది. కురు వృద్ధుడూ కౌరవులకి సగబలమూ అయిన భీష్ముడంతటివాడు శిఖండిని చూడడంతో అస్త్ర సన్యాసం చేయడమూ గుర్తుకు వస్తుంది. భీష్మడంతటి వాణ్ని యుద్ధంలో నిలువరించడం కోసమే పాండవులు వేసిన పాచికని శిఖండిని చూస్తే తెలిసి వస్తుంది.        శిఖండి ఎవరోకాదు, ద్రుపద రాజు కూతురు. కూతుర్ని కొడుకులా పెంచడం వరకూ తలిదండ్రుల ఇష్టమే. అభీష్టమే. అసలు పుట్టిందే కొడుకని నమ్మించారు. తామూ నమ్మారు. ఆ నమ్మికతోనే ద్రోణాచార్యుల వద్ద […]

శిఖండి అనగానే ఎవరికైనా మహాభారత యుద్ధం గుర్తుకువస్తుంది. కురు వృద్ధుడూ కౌరవులకి సగబలమూ అయిన భీష్ముడంతటివాడు శిఖండిని చూడడంతో అస్త్ర సన్యాసం చేయడమూ గుర్తుకు వస్తుంది. భీష్మడంతటి వాణ్ని యుద్ధంలో నిలువరించడం కోసమే పాండవులు వేసిన పాచికని శిఖండిని చూస్తే తెలిసి వస్తుంది.

శిఖండి ఎవరోకాదు, ద్రుపద రాజు కూతురు. కూతుర్ని కొడుకులా పెంచడం వరకూ తలిదండ్రుల ఇష్టమే. అభీష్టమే. అసలు పుట్టిందే కొడుకని నమ్మించారు. తామూ నమ్మారు. ఆ నమ్మికతోనే ద్రోణాచార్యుల వద్ద అస్త్ర శస్త్ర విలు విద్యలెన్నో నేర్పించారు.

కాలమయితే శిఖండి యవ్వనాన్ని దాచలేదు. తలిదండ్రులు పెళ్ళి చేయాలని అనుకున్నారు. దశార్ణ దేశాధిపతి హేమ వర్మ కూతుర్ని తెచ్చి పెళ్ళి జరిపించేసారు. శిఖండి పురుషుడు కాదని తెలిసిపోయింది. ఈ వార్త దాసికి తెలిసింది. తద్వారా ఆ పిల్ల తండ్రి హేమ వర్మకూ తెలిసిపోయింది. ద్రుపదరాజుని శిఖండి గురించి అడిగాడు. సమాధానం రాకపోవడంతో హేమవర్మ ఆగ్రహం చెందాడు. ద్రుపద నగరం మీదికి దండెత్తాడు. దారిలో ఆగాడు. అప్పటికే శిఖండి నగరం దాటి అడవిలోకి వెళ్ళాడు. చేసిన దానికి ప్రాయశ్ఛిత్తంగా శిరసును ఖండించుకోబోయాడు. అది ఓ యక్షుడు చూసాడు. ఆపాడు. కారణమడిగాడు. తెలుసుకున్నాడు. తాను పురుషుడు కానిదే బతకలేనన్నాడు. అప్పుడు ఆ యక్షుడు తన పురుషత్వాన్ని శిఖండికిచ్చి – ఆమె స్త్రీత్వాన్ని తాను తీసుకున్నాడు. సంతోషంతో తలిదండ్రులకీ విషయం చెప్పాడు శిఖండి. వాళ్ళు దశార్ణ దేశాథిపతి హేమవర్మకు జరిగిన విషయం కబురుపంపారు. దాంతో ఎటుదారి తీస్తుందోననుకున్న విషయం సద్దుమణిగింది.

అసలు యుద్ధం… అదే కురుక్షేత్రం మొదలయింది. భీష్ముడంతటి వాణ్ని ఎదిరించడం ఎదురు నిలవడం ఊహించలేకపోయారు పాండవులు. అయితే నపుంసకులతో కాని స్త్రీలతోకాని యుద్ధం చేయనని భీష్ముడు అంతకు మునుపే వ్రతం తీసుకున్నాడు. ఈ విషయం తెలిసిన పాండవులకు మార్గం సుగమమయింది. శిఖండి వుండనే వున్నాడు. యుద్ధంలోకి దించారు. శిఖండి భీష్ముణ్ని ఎదిరించడం తన వల్ల కాదన్నాడు. పాండవులు శిఖండిని ఒప్పించారు. అర్జునుడి శిఖండి వెనువెంటే వుంటానని చెప్పాడు. అలాగే శిఖండి వెనకాలే వుండి భీష్ముణి మీదకు శిఖండిని పురిగొల్పాడు. శిఖండిని చూసి భీష్ముడు విల్లంభులు వదిలేసాడు. అప్పుడు అర్జునుడు భీష్ముణి మీద విల్లంభులు కురిపించాడు. కౌరవుల బలాన్ని అలా నిర్వీర్యం చేసారు పాండవులు.

శిఖండి పాత్ర ద్వారా పాండవుల విజయం సులువయ్యిందనే చెప్పుకోవాలి!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  4 May 2015 8:19 PM GMT
Next Story