అంబేద్కర్‌ అందరివాడు కాదు!

            అంబేద్కరే లేకపోతే నేనిక్కడ వుండేవాణ్ణికాదని నరేంద్రమోడి ఒప్పుకున్నారు. ఆయన అధికారంలోకొచ్చిన తర్వాత మొదటిసారి డా|| అంబేద్కర్‌ గురించి మాట్లాడాడు. ఇదే విషయాన్ని ఆయన ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఏర్పాటు చేసిన సమావేశంలో చెప్పివుంటే బావుండేది. పార్లమెంటు ముందు మోకరిల్లి ఇది ప్రజాస్వామ్య దేవాలయం, నావంటి చాయ అమ్ముకొనే వ్యక్తి ఈ దేశ ప్రధాని అయ్యాడంటే అది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనమని చెప్పిన మోడి, అదే నోటితో ఆ ప్రజాస్వామ్య దేవాలయాన్ని డా|| అంబేద్కర్‌ నిర్మించాడనీ, ఆయన రాజ్యాంగం ద్వారా స్థాపించిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వల్లే తాను దేశ అత్యుత్తమ స్థానం అలంకరించగలిగానని చెప్పి వుంటే బావుండేది. కానీ అంబేద్కర్‌ ప్రస్తావనే ఆయన నోటివెంట రాలేదు. ఆయనొకరున్నారనే సంగతి ఎరుగనట్టు ఎన్నోసార్లు ప్రవర్తించాడు. ఆయన పేరును ప్రస్తావించాల్సిన సందర్భాలలో నేర్పుతో తప్పుకోవటం ఈ దేశమంతా గమనించింది. తను విశ్వసిస్తున్న సిద్ధాంతాలకీ రాజకీయాలకూ కట్టుబడి వున్నాననీ, ఆ సిద్ధాంతాలను రూపొందించిన వారికి పూర్తి విధేయుడిగా విశ్వాసిగా వుంటున్నాననీ, ఆ పునాదుల మీదే తన పాలన ఉంటుందని ప్రజలకు తెలియ చేయడానికి ఎంతో శ్రమపడ్డాడు. అలాంటి మోడి అకస్మాత్తుగా అంబేద్కర్‌ను ప్రశంసించటం, ఆయన అనుభవించిన సామాజిక, రాజకీయ అస్పృశ్యతను ప్రస్తావించటంతో పాటు, అంబేద్కర్‌ లేకపోతే నేను లేననే మాట అనటం వెనక చాలా పెద్ద రాజకీయమే వుంది.

            ఢిల్లీ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న మోడికి మరోరెండేళ్లలో ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికలు మెడమీద కత్తిలా వేలాడుతున్నాయి. అంబేద్కర్‌ గురించి మాట్లాడపోతే అక్కడ ఓట్లు రాలవు. బహుజన మహాపురుషుల సిద్ధాంతం, పోరాటం, త్యాగాలు, విజయాలు అక్కడి ప్రజలకు లోతుగా తెలుసు. కదిలిస్తే గంటల తరబడి మామూలు వ్యక్తి కూడా ఆ మహనీయుల గురించీ, గాంధీ కపట రాజకీయాల గురించి వివరించగలడు. ఈ అవగాహన, చైతన్యం అక్కడ మొదటి నుంచీ లేవు. మాన్యశ్రీ కాన్షిరాం అక్కడికి చేరుకొని సుదీర్ఘ కాలంపాటు మహాత్మ జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, బాబాసాహేబ్‌ అంబేద్కర్‌, సాహు మహారాజ్‌, పెరియార్‌, అచూతానంద్‌, మంగురామ్‌ వంటి బహుజన నేతలను పరిచయం చేశాడు. మనువాద సిద్ధాంతానికి అంబేద్కరిజమే పరిష్కారమని బోధించాడు. అంబేద్కర్‌ అంటే సిద్ధాంత చర్చలు కాదు. రాజకీయాలు చేయటమనీ, అధికారాన్ని చేజిక్కించుకోవటమనీ బోధించాడు. దేశవ్యాప్తంగా అంబేద్కర్‌ ఉద్యమాన్ని నిర్మాణం చేశాడు. డియస్‌4 స్థాపించి ఎన్నికల గోదాలోకి దిగాడు. ఇందిరాగాంధి హత్య తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా డియస్‌4 గుర్తించదగిన విజయాలను నమోదు చేసింది. ఆ తర్వాత బియస్పీ ఏర్పాటు చేసి మాయావతితో పాటు ఎంతోమంది మామూలు వ్యక్తులను ఎంఎల్యేలుగా ఎంపీలుగా గెలిపించాడు. ఎవరికీ మెజార్టీ రాకుండా బహుజనుల అంబేద్కర్‌ వైపుకు మళ్లించాడు. అంబేద్కర్‌ను నమ్ముకుంటే ఓట్లు రావు, సీట్లు రావని ప్రచారం చేసిన వారికి తన విజయాలతో జవాబు చెప్పాడు. ఏకంగా మాయవతిని ముఖ్యమంత్రిని చేసి దేశ చరిత్రనే మార్చేశాడు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయంటే, ఆయనే కారణం. కాంగ్రెస్‌ను, బిజెపీని నేలమట్టం చేసి బియస్పీ, ఎస్పీ రాజకీయాలకు ఉత్తర ప్రదేశ్‌ను కేంద్రం చేశాడు.

            మాన్యశ్రీ కాన్షిరాం మరణం తర్వాత మాయావతి సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతిని ఓడించడానికి కాంగ్రెస్‌, బిజెపీ, సమాజ్‌వాది పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, ఇంకా అనేక ఇతర చిన్నాచితక పార్టీలు చేతులు కలిపాయి. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, బియస్పీ ప్రజాపునాది తగ్గలేదు. అదేవిధంగా 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా అన్ని పార్టీలు కలిసి బియస్పీని ఓడించాయి. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో కూడా బియస్పీ సంప్రదాయ ఓటు బ్యాంకు చెదిరిపోలేదు. పైగా సుమారు 18లక్షల ఓట్లు గతంలో కన్న ఎక్కువొచ్చాయి.

            అయితే, గడిచిన మూడేళ్లలో అఖిలేష్‌ యాదవ్‌, ములాయం సింగ్‌ల సారధ్యంలోని సమాజ్‌వాదీ ప్రభుత్వం ప్రజలను మెప్పించటంలో విఫలమైంది. ఉత్తరప్రదేశ్‌ ప్రజలు మాయావతి పాలనను తీపిగుర్తుగా స్మరించుకుంటున్నారు. తిరిగి మాయావతి ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారు. అదేవిధంగా యేడాదిలోపే నరేంద్రమోడి పట్ల నెలకొన్న భ్రమలన్నీ బద్ధలయ్యాయి. ఢిల్లీ ప్రజలే కాదు, ఉత్తర ప్రదేశ్‌ ప్రజలు కూడా గట్టి నిర్ణయం ప్రకటించడానికి సిద్ధంగా వున్నారు.

            ఉత్తర ప్రదేశ్‌లో మాయావతిని బలహీనురాలిని చేసే కుట్రలు చాలాకాలంగా కొనసాగుతూనే వున్నాయి. మాయావతిని అనుసరిస్తున్న దళిత కులాలను చీల్చడానికి ఎన్నో వ్యూహాలు అమలు చేస్తూనే వున్నారు. ఒక వైపు వామన్‌ మేశ్రాం, మరోవైపు ఉదిత్‌రాజ్‌ ఇద్దరూ బియస్పీ వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. వామన్‌ మేశ్రాం కొత్తగా బహుజన్‌ ముక్తి పార్టీ ఏర్పాటు చేసి లోకసభ ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపాడు. మాయావతి పట్ల అపనమ్మకాన్ని వ్యాపింపచేసి, అంబేద్కర్‌కు తానే అసలైన వారసున్నని నమ్మించటం ద్వారా కాన్షిరాం రాజకీయాలను లేకుండా చేయాలన్నది ఆయన తలంపు. ఉదిత్‌రాజ్‌ బుద్ధిజం పేరుతో హడావుడి చేసి చివరికి బిజెపీలో చేరి గెలిచి పార్లమెంటులో సేదతీరుతున్నాడు. రాందాస్‌ అత్వాలేను రాజ్యసభకు నామినేట్‌ చేసి బిజెపీ అతన్ని తన ఖాతాలో వేసుకున్నది. ఇలా ప్రతి రాష్ట్రాన్ని గమనిస్తే నకిలీ ఉద్యమాలను, దళారులను ప్రమోట్‌ చేయటం ద్వారా అంబేద్కర్‌ ఉద్యమాన్ని, కాన్షిరాం రాజకీయాలను కనుమరుగు చేయాలని అగ్రవర్ణాలు శ్రమిస్తున్నాయి.

            మాయావతిని ఓడించటం వల్ల బహుజన ఉద్యమానికి నైతిక దెబ్బతగిలింది. ఒక్క ఓటమితో అంతా కూలిపోయిందనీ, ఇక చేయగలిగిందేమీ లేదని చాలామంది నిరాశపడ్డారు. ఒక అంబేద్కర్‌ రాజకీయాలు కన్పించవని బెంగపడ్డారు. కాన్షిరాం లేని లోటును ఒక్కసారిగా గమనించి డీలాపడ్డారు. ఇలాంటి ఉద్వేగాల సంక్షోభ సమయంలోనే మరోదెబ్బ కొడితే ఇక అంబేద్కర్‌ రాజకీయాలేవీ భవిష్యత్తులో కన్పించవని మోడీతో సహా ఇతర పార్టీలు కూడా ఊహిస్తున్నాయి. అందుకే, అంబేద్కర్‌ను హైజాక్‌ చేయాలని చూస్తున్నాయి. వర్షిప్పింగ్‌ ఫాల్స్‌ గాడ్స్‌ అని ఏకంగా పుస్తకాలే రాయించిన ఆర్‌యస్‌యస్‌, స్వయంగా తానే అంబేద్కర్‌ను ఎందుకు గౌరవించాలో వివరిస్తూ పుస్తకాలు ప్రచురిస్తుంది. దేశవిభజన సందర్భంగా పాకిస్తాన్‌లో వున్న దళితులు, బిసీలు, గిరిజనులు, ముస్లింలు ఇండియాకు రావాలనుకుంటే రక్షణ కల్పిస్తామని అంబేద్కర్‌ చెప్పాడు. ఆయన ఉద్దేశం ఇండియా అనే దేశంలోకి రావొచ్చని. అంతేకాని, హిందూమతంలోకి రావొచ్చని కాదు. ఆయన మాటలను వక్రీకరిస్తూ ‘ఘర్‌వాపసీ’ ఉద్యమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఆయన్ను పెట్టుకోవాలని అనుకుంటున్నట్టు కాషాయదళాలు ఒక రాయి విసిరాయి. ‘బ్రాండ్‌ అంబాసిడర్‌’ అనడమే డా|| అంబేద్కర్‌ను అవమానించటం. ఒక కమాడిటిని అమ్ముకోవడానికి ప్రచారకర్తగా ఒక సెలబ్రిటీని/మోడల్‌ను కార్పోరేట్‌ సంస్థలు పెట్టుకుంటాయి. అంబేద్కర్‌ను ఒక మోడల్‌ స్థాయికి దిగజార్చి కాషాయపరివారం ఘోరంగా అవమానించింది. అంబేద్కర్‌కు భారతరత్న ఇప్పించిది నేనే అని చంద్రబాబు, గొప్ప తాత్వికుడు ఫూలే, గొప్ప సంఘసంస్కర్త అంబేద్కర్‌ అంటూ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అంబేద్కర్‌ను ఆక్రమిస్తున్నారు. అదే స్థాయిలో కమ్యూనిస్టులు కూడా ఫూలే, అంబేద్కర్‌ల జయంతులు, వర్ధంతులు చేస్తున్నారు. అంబేద్కర్‌వాదులు, కమ్యూనిస్టులు కలిసి పనిచేయాలని తమ్మినేని సెలవిచ్చారు. సిపియం, సిపిఐ, మావోయిస్టు పార్టీలు అంబేద్కర్‌ను అంగీకరిస్తూ, కుల, వర్గ పోరాటాల చర్చలు చేస్తున్నాయి. అటు కాషాయసంస్థలు, ఇటు కమ్యూనిస్టులు, ప్రాంతీయ పార్టీలన్నీ అంబేద్కర్‌ను ఆక్రమించటం ద్వారా తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. అంబేద్కర్‌ రాజకీయాలు లేకుండా చేయాలని శక్తిమేర తలపడుతున్నాయి.

            అంబేద్కర్‌ అందరివాడని చెప్పటంలోనే ఆయన్ని రాజకీయంగా హత్య చేసే ఎత్తుగడ దాగుంది. అంబేద్కర్‌ ఫిలాసఫీని ఈ పార్టీలేవీ ఒప్పుకోవు. పైగా ఆయన బతికున్న కాలంలోనే ఆయన ఫిలాసఫీమీద, ఆయన నడిపిన రాజకీయాల మీద కాంగ్రెస్‌, మ్యూనిస్టు, హిందూమహాసభ, ఆర్‌యస్‌యస్‌ తీవ్రంగా దాడి చేశాయి. ఆయన్ని దేశద్రోహి అన్నాయి. సార్వత్రిక వయోజన ఓటు హక్కును అంబేద్కర్‌ డిమాండ్‌ చేసినప్పుడు ఈ సంస్థలన్నీ ఆయన్ని బ్రిటీషువాళ్ల ఏజెంటని బురదజల్లాయి. ఆయన సంపాదించిన ఆ ఓటు హక్కు వల్లే ఛాయ అమ్ముకొనే నరేంద్రమోడి దేశ ప్రధాని అయ్యాడు. గాంధీ, కాంగ్రెస్‌, హిందూమహాసభ చెప్పినట్టు పదోతరగతి పైన చదువుకున్నవాళ్లకు, నెలకు మూడు రూపాయల పన్ను కట్టగలినవాళ్లకు మాత్రమే ఓటు హక్కుఉంటే నరేంద్ర మోడి కేవలం ప్రచారకుడిగానే మిగిలిపోయేవాడు. మోడల్స్‌ను తలదన్నే కోట్ల రూపాయల విలువైన దుస్తులేసుకునే హక్కుకూడా ఆయనకు ఉండేదికాదు. ఆయన బట్టకట్టుకున్నా, దేశప్రధాని అయినా, గుజరాతు ముఖ్యమంత్రి అయినా అదంతా డా|| అంబేద్కర్‌ చలవే.

            మనువాదాన్ని తార్కికంగా తాత్వికంగా తప్పని నిరూపించిన అంబేద్కర్‌ సిద్ధాంతంతో గానీ భావజాలంతోగానీ ఈ పార్టీలకు సంబంధం లేదు. ఆయన్ని కేవలం ఉత్సవ విగ్రహంగా మాత్రమే చూస్తున్నారు. సూటు, బూటు వేసుకొని రాజ్యాంగం పట్టుకున్న ఒక మేధావిగా మాత్రమే చూపిస్తున్నారు. నిజానికీ, కాంగ్రెస్‌కు, హిందూమహాసభకు వ్యతిరేకంగా ఆయన చేసిన రాజకీయ పోరాటం ప్రజల స్మృతిపథం నుంచి ఎప్పుడో చెరిగిపోయింది. ఆయన చనిపోయాక పూర్తిగా మరిచిపోయారు. అలాంటి సమయంలోనే మాన్యశ్రీ కాన్షిరాం ఆయన చేసిన రాజకీయ పోరాటాలను, సాధించిన విజయాలను గుర్తుచేసి ప్రజలను మేల్కొల్పాడు. కాన్షిరాం పేరువింటేనే కాంగ్రెస్‌, బిజెపీ, కమ్యూనిస్టు, ప్రాంతీయపార్టీలకు గుండెదడ. అందుకే, కాన్షిరాం గురించి పెదవి విప్పరు. అంబేద్కర్‌తో పాటు కాన్షిరాంను కనీసం ప్రస్తావించరు. ఉత్తర ప్రదేశ్‌లో తప్ప మిగతా రాష్ట్రాల్లో కాన్షిరాం గురించి ప్రజలకు తెలియకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూనే వున్నారు. అగ్రకులాల చీకటి గదుల్లో బంధించబడిన అంబేద్కర్‌ను విముక్తి చేసి బహుజనులకు కాన్షిరాం అప్పగించాడు. ఇప్పుడు మళ్లీ మనువాద పార్టీలు అంబేద్కర్‌ను చీకటి బంధీఖానాలోకి నెట్టేయాలని చూస్తున్నాయి. అంబేద్కర్‌ అందరివాడేలే అనే పాటలు పాడుతున్నాయి. అంబేద్కర్‌ను కాపాడుకోవాలంటే కాన్షిరాంను జోడించాలి. మాన్యశ్రీ కాన్షిరాం లేకుండా అంబేద్కర్‌ భావజాలానికి, రాజకీయాలకు అర్థం లేదు. కాన్షిరాం రాజకీయం ఒంటపట్టించుకోపోతే భవిష్యత్తులేదు. రాజకీయ కాన్షిరాంను చంపకపోతే మనువాదానికి భవిష్యత్తులేదు. అందుకే, మాయావతిని ఓడించడానికి నరేంద్రమోడి అంబేద్కర్‌ అనుభవించిన అస్పృశ్యత గురించి మాట్లాడుతున్నాడు. మరి, మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం?

– డా|| జిలుకర శ్రీనివాస్‌