Telugu Global
POLITICAL ROUNDUP

భారత్ మీడియాపై నేపాల్ లో తీవ్ర నిరసన...

ఏప్రిల్ 25న నేపాల్ లో సంభవించిన భీకర భూకంపం ఆ దేశాన్ని ఛిన్నాభిన్నం చేసింది. జన జీవితం అతలాకుతలమైపోయింది. రాజ్యాంగ రచన ఏడేళ్లుగా తెమలనందువల్ల నేపాల్ ప్రభుత్వ నిర్వహణ కూడా చాలా కాలంగా అస్తుబిస్తు వ్యవహారంగానే సాగుతోంది. ఈ ప్రళయాన్ని ఎదుర్కోవడంలో శక్తిహీనంగా తయారై చేతులెత్తేసింది. కానీ ప్రపంచ మానవాళి నేపాల్ భూకంప బాధితులను ఆదుకోవడానికి నడుం కట్టింది. సహజంగానే పొరుగు దేశమైన నేపాల్ కు ఆసరా అందించడానికి భారత్ హుటాహుటిన సహాయ కార్యక్రమాలకు సన్నద్ధమైంది. భూకంపం […]

భారత్ మీడియాపై నేపాల్ లో తీవ్ర నిరసన...
X

RV Ramaraoఏప్రిల్ 25న నేపాల్ లో సంభవించిన భీకర భూకంపం ఆ దేశాన్ని ఛిన్నాభిన్నం చేసింది. జన జీవితం అతలాకుతలమైపోయింది. రాజ్యాంగ రచన ఏడేళ్లుగా తెమలనందువల్ల నేపాల్ ప్రభుత్వ నిర్వహణ కూడా చాలా కాలంగా అస్తుబిస్తు వ్యవహారంగానే సాగుతోంది. ఈ ప్రళయాన్ని ఎదుర్కోవడంలో శక్తిహీనంగా తయారై చేతులెత్తేసింది. కానీ ప్రపంచ మానవాళి నేపాల్ భూకంప బాధితులను ఆదుకోవడానికి నడుం కట్టింది. సహజంగానే పొరుగు దేశమైన నేపాల్ కు ఆసరా అందించడానికి భారత్ హుటాహుటిన సహాయ కార్యక్రమాలకు సన్నద్ధమైంది. భూకంపం సంభవించిన ఆరేడు గంటల్లోనే భారత విమానం అవసరమైన సరంజామాతో నేపాల్ గడ్డ మీద వాలింది.
చైనాతో సహా మరో 33 దేశాలు భూకంప బాధితులను ఆదుకోవడానికి శాయశక్తులా కృషి చేశాయి. శిథిలాలను తొలగించడంలో, శిథిలాల్లో చిక్కుకుని కొన ఊపిరితో ఉన్న వారెవరైనా ఉన్నారేమో అన్వేషించడంలో, క్షతగాత్రులను కాపాడి వారికి వైద్య సహాయం అందించడంలో ఇతర దేశాల సహాయక బృందాలతో పాటు భారత్ నిర్విరామ కృషి చేసింది. ఆ మాటకొస్తే భూకంప బాధితులను ఆదుకోవడంలో భారత్ సహాయ కార్యక్రమాలలో నిమగ్నమైన ఇతర దేశాలకన్నా ఒక అడుగు ముందే ఉంది.
మానవీయ దృక్పథంతో భారత్ సహాయం అందజేసినందుకు నేపాల్ ప్రభుత్వం కూడా తగిన రీతిలో కృతజ్ఞతలు చెప్పింది. “భయంకరమైన భూకంపం బారిన పడ్డ వారికి భారత్ అందించిన ఆపన్న హస్తానికి తమ దేశం రుణపడి ఉందనీ, భారత్ చేసిన సహాయానికి అభినందనలు తెలియజేయడానికి నాకు మాటలు చాలడం లేదు” అని నేపాల్ ప్రధాన మంత్రి సుశీల్ కొయిరాలా అన్నారు.
తక్షణం సహాయ సామాగ్రితో ఓ విమానాన్ని పంపడమే కాదు. ఆ తర్వాత టెంట్లు, దుప్పట్లు, మందులు, వంట సామాగ్రి, ఆహార పదార్థాలు, మంచి నీళ్లు, ఇంజనీరింగ్ పరికరాలు, ఆక్సీజన్ ఉత్పత్తి చేసే పరికరాలు, తాత్కాలిక ప్రాతిపదికన రెండు ఆసుపత్రులు ఏర్పాటు చేయడానికి అనువైన సరంజామా, మంది మార్బలం మొదలైన వాటినన్నింటినీ భారత వైమానిక దళానికి చెందిన 32 విమానాలు తరలించాయి. వీటికి తోడు భారత సైన్యానికి చెందిన ఎనిమిది ఎం ఐ-17 విమానాలు, ఐదు ఎ ఎల్ హెచ్ హెలీకాప్టర్లు, 207 టన్నుల సామాగ్రిని భూకంపానికి గురైన ప్రాంతాలకు చేరవేశాయి. గాయపడిన 900 మందిని కాపాడాయి. నేపాల్ లో చిక్కుకుపోయిన 1700 మందిని తరలించాయి.
సహాయక బృందాలన్నీ నేపాల్ ప్రభుత్వంతో సమన్వయం కుదుర్చుకుని దివారాత్రాలు శ్రమించి శక్తివంచన లేకుండా బాధితులకు చేయూత అందించాయి. భారత వైద్య బృందాలు దాదాపు 3000 మందికి చికిత్స చేశాయి. భూకంప బాధితులకు సహాయం చేయడంలో భారత ప్రభుత్వం నిబద్ధతతో పని చేసింది. నేపాల్ సరిహద్దులో ఉన్న రాష్ట్రాలు మాత్రమే కాకుండా అనేక రాష్ట్రాలు విరాళాలు, దుస్తులు, వంట సామాగ్రి వంటివి సేకరించి పంపాయి. స్వచ్ఛంద సంస్థల కృషీ ఎన్నదగిందే.
అంతర్జాతీయ సమాజం కూడా భారత్ చేస్తున్న పనిని కొనియాడింది. నేపాల్ లో భారత సైన్యం, విపత్తు స్పందన దళం వంటివి చేస్తున్న ప్రయత్నాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజెప్పడంలో మీడియా, ముఖ్యంగా టీవీ ఛానళ్లు గత పది రోజులనుంచి ఎడతెరిపి లేకుండా నిరంతర వార్తా స్రవంతిని అందజేశాయి. ఇది మీడియా బాధ్యత. తప్పు లేదు. పత్రికలు అనుదిన సమాచారం మాత్రమే అందించగలవు. అనుక్షణ సమాచారం అందించే వెసులుబాటు టీవీ ఛానళ్లకు ఉంది. మన టీవీ ఛనళ్లు ఈ బాధ్యత నిర్వర్తించినందువల్లే అంతర్జాతీయ సమాజం సహాయం అందించడానికి ముందుకొచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల వారు ఉడతా భక్తిగా తమకు తోచిన సహాయం చేశారు.
అయితే అనుక్షణ ప్రసారాల తాపత్రయం కారణంగా మన టీవీ ఛానళ్లు శ్రుతి మించి ప్రవర్తించాయన్న విమర్శ ఎదుర్కోవాల్సి వచ్చింది. టీవీ ఛానళ్ల సిబ్బంది పోటీలు పడి సైన్యం హెలీకాప్టర్లలో దూరి చోరరాని ప్రాంతాలకు సహితం వెళ్లి సమాచారం సేకరించడంలో చూపిన చొరవను కాదనలేం. దీన్ని వార్తలు నివేదించడానికి పరిమితం చేసి ఉంటే సమస్యే ఉండేది కాదు. అలా కాకుండా కొన్ని ఛానల్స్ ఈ మొత్తం కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం తరఫున ప్రజా సంబంధాలకు ఉపకరించే ప్రక్రియగా మార్చినందువల్ల ఆ ప్రసారాలు జుగుప్సాకరంగా తయారయ్యాయి. టీవీ ఛానళ్ల సిబ్బంది హెలీకాప్టర్లలో దూరడానికి బదులు ఆ మేరకు సహాయ సామాగ్రిని పంపి ఉండవచ్చు కదా అని స్థానికులు భావించారు. బాధల్లో ఉన్న వారికి ఇలాంటి అభిప్రాయం కలగడంలో తప్పు లేదు.
బాధితుల అభిప్రాయాలు సేకరించేటప్పుడు ఏ మాత్రం మానవతా వైఖరి లేకుండా వ్యవహరించడం నేపాల్ ప్రజలకు నచ్చలేదు. ఒక్క భారత్ మాత్రమే సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైన అభిప్రాయం కలిగించే విధంగా మన టీవీ ఛానళ్ల వ్యవహార సరళి కొన సాగింది. చౌకబారు ప్రచారం కోసం బాధితులను వాడుకున్నారన్న విమర్శలు చెలరేగాయి.
సహాయక చర్యల్లో భాగంగానే నేపాల్ లో ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా పునరుద్ధరించారు. అక్కడినుంచి స్థానిక ప్రజలు భారత టీవీ ఛానళ్లు అనుసరిస్తున్న వైఖరి అనుచితమని దుమ్మెత్తి పోస్తున్నాయి. దీనికోసం ట్విట్టర్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘గో హోం ఇండియా మీడియా’ లో వేలాది మంది తమ నిరసన గళాలు వినిపిస్తున్నారు. విచిత్రమేమిటంటే ప్రపంచ పత్రికా దినోత్సవం రోజుననే (ఏప్రిల్ 3, ఆదివారం) ఈ దుమారం రేగింది.
ఈ రాద్ధాంతం కారణంగా అని నేపాల్ ప్రభుత్వం అంగీకరించకపోయినా సహాయ కార్యక్రమాలలో నిమగ్నమైన దేశాల వారందరూ ఇక దయచేయవచ్చునని తేల్చి చెప్పింది. మిగతా సహాయ కార్యక్రమాలేమైన ఉంటే తమ సైనికులు, తమ పోలీసులు చూసుకుంటారని చెప్పింది. భార‌త మీడియా ప్రవర్తన వల్లే నేపాల్ ఈ నిర్ణయం తీసుకుందన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. భారత మీడియా నేపాల్ ను ఒక దేశంగా కాక భారత్ లోని ఓ రాష్ట్రంగా భావిస్తోందన్న వాదనలు బయలుదేరాయి. భారత మీడియా తమ టీఆర్పీ రేట్ల కోసం శవాలను కూడా అమ్మేస్తుందని ట్విట్టర్ లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వైఖరి వల్ల తమ సార్వభౌమాధికారానికి భంగం కలుగుతోందని నేపాలీలు భావిస్తున్నారు. భారత మీడియా కంపుగొడుతోందని, అది విరేచనాలు పట్టిన దానిలా వ్యవహరిస్తోందని తక్షణం తమ దేశం వదిలి వెళ్లాలనీ ఇంటర్నెట్ లో అభిప్రాయాలు వ్యక్తం చేసే వారు నానా యాగీ చేస్తున్నారు. మీడియా అతి వల్ల సహాయం చేసిన భారత్ మీదే ఏహ్య భావం కలుగుతోంది. భారత టీవీ ఛానళ్ల వార్తా ప్రసారాలు ఏదో టీవీ సీరియల్ చిత్రీకరణలా కొనసాగుతోందంటున్నారు. దీనితో శిథిలాల్లో చిక్కుకున్న వారిని అన్వేషించే బృందాలు వెళ్లిపోవచ్చునని నేపాల్ ప్రభుత్వం కోరింది. ఐతే సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైన బృందాలు మాత్రం ఉంటాయంటున్నారు. పునరావాస కార్యక్రమాలను భారత్ కొనసాగిస్తూనే ఉంటుందని జాతీయ విపత్తు స్పందన దళం అధిపతి ఓపీ సింఘ్ భరోసా ఇస్తున్నారు. గొట్టాలవారి అత్యుత్సాహం ఎంత పని చేసింది!
-ఆర్వీ రామారావ్

First Published:  5 May 2015 1:05 PM GMT
Next Story