ఆహారంతోనూ బరువు తగ్గవచ్చు

 బరువు తగ్గాలంటే తినడం మానేయాలనుకుంటుంటాం. కానీ ఆహారం తిన్నా కూడా బరువు తగ్గుతామా? అలాంటి బరువును తగ్గించే ఆహారపదార్ధాలేమిటో చూద్దామా…
 – ఉదయాన్నే ఓట్స్‌ని అల్పాహారంగా తీసుకుంటే రోజంతా శరీరానికి కావలసిన సహజ శక్తి నిదానంగా విడుదల అవుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. క్రమం తప్పకుండా తీసుకుంటే కొవ్వు తగ్గుతుంది.
 – బరువును తగ్గించడానికి వేరుశనక్కాయలు చక్కగా పనిచేస్తాయి. రెండు భోజనాలకు మధ్య గుప్పెడు వేరుశనగ గింజలు తినడం వల్ల ఎక్కువ తినకుండా ఉంటాం. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, పీచు, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి.
 – ఆకుకూరల్లో కేలరీలు తక్కువగా, పీచు అధికంగా ఉంటుంది. వాటిలోని విటమిన్లు శరీర క్రియలు సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. ఖనిజాలు పొట్టలో నీరు చేరకుండా చూస్తాయి.
 – పచ్చి మిరపలో బీటా కెరొటిన్ అధికంగా ఉంటుంది. ఒక్క మిరపకాయలో రోజంతటికి సరిపడా బీటా కెరొటిన్ లభిస్తుంది. విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇందులోని ఇతర పోషకాలు శరీరంలోని మలినాలను తొలగించి రక్తం శుద్ధి కావడానికి దోహదపడతాయి. అంతేకాదు పచ్చిమిరపతో మెటబాలిజం మెరుగుపడుతుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
 – వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే రసాయనం శరీరంలోని విషపదార్థాలపై పోరాడుతుంది. అది రక్తంలో చేరి హాని చేసే క్రిములను నిర్మూలించే రసాయనాన్ని విడుదల చేస్తుంది.
 – దాల్చిన చెక్క పొత్తికడుపులోని కొవ్వుని తగ్గించడానికి బాగా ఉపకరిస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని ఉత్తేజపరిచి రక్తంలో సుగర్ స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది.
 – శరీంలోని కొవ్వు కరగడానికి గ్రీన్ టీ చక్కగా ఉపయోగపడుతుంది. జీవక్రియలను వేగవంతం చేస్తుంది. 
 – రోజుకో యాపిల్ తింటే అనారోగ్యం దరిచేరదని, డాక్టర్ అవసరం ఉండదని అంటుంటారు. అంతేకాదు యాపిల్‌లో అధికంగా ఉండే కేలరీలు కొవ్వు ఎక్కువగా కరగడానికి ఉపకరిస్తాయి.