ఆంధ్రాకు ఇద్దరు ముఖ్యమంత్రులా !?

     ఆంధ్రప్రదేశ్‌కు ఇద్దరు ముఖ్యమంత్రులా ?! వింటే ఆశ్చర్యం – అనుమానం కలగటంలేదా ? కాని ఇది నిజం. దీని సమాధానం కోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై అవగాహన ఉన్నవారెవ్వరైనా ఇట్టే సమాధానం చెప్పేస్తారు. వారే ఒకరు చంద్రబాబునాయడు మరొకరు ఆయన తనయుడు లోకేష్‌.  ముఖ్యమంత్రి తనయుడు లోకేష్‌ ఇక్కడ ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలలో నేరుగా జోక్యం చేసుకున్నా ఎవ్వరూ పెద్దగా ఆశ్చర్యపోలేదుగాని…. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అంటూ గతంలో తాను చదువుకున్న అమెరికాకు ఇద్దరు అధికారులతో కలిసివెళ్ళటం విస్తుపోవటమేకాదు…. ఇద్దరు ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పాలిస్తున్నారనే అభిప్రాయాన్ని ఖచ్చితంగా కలిగిస్తోంది. మరి కాకపోతే ఆయన ఏ హోదాలో అమెరికాకు ఇద్దరు రాష్ట్ర అధికారులను వెంటబెట్టుకుని వెళ్లి పారిశ్రామికవేత్తలను కలుస్తున్నారు ? ఏమని పరిచయం చేసుకుంటున్నారు ? ముఖ్యమంత్రి తనయుడననా ? అది చెల్లుబాటు అవుతుందా ? లేక కాబోయే ముఖ్యమంత్రి అనా ? లేదా ముఖ్యమంత్రికి సమయం లేకపోవటం వల్ల ఆయన తనయుడు వెళ్ళారనా ? ఏవిధంగా చూసినా  ముఖ్యమంత్రి తరహా హోదాలోనే ఆయన పర్యటిస్తున్నారనేది ఎవ్వరూ కాదనలేని నిజం. ఇద్దరు అధికారులు ఒకరు అభీష్ట (ముఖ్యమంత్రి కార్యాలయ ఒఎస్డీ), మరొకరు పరిశ్రమల శాఖ డైరక్టర్‌ కార్తికేయ మిశ్రా (ఐఎఎస్‌ అధికారి)తో వెళ్ళటం ముఖ్యమంత్రికి సమాంతరంగా ఎపి నుంచి మరొక ముఖ్యమంత్రి అమెరికా వెళ్ళినట్లు కనిపించటంలేదా ? ముఖ్యమంత్రి తనయుడు స్వంత ఖర్చులతోనే వెళ్ళి ఉండవచ్చు. ఆ స్ధాయిలో ఉన్నవారికి స్వంత, ప్రైవేటు, ప్రభుత్వం అనే తేడా ఉండదనేది అందరికీ తెలిసిందే. ఆ ఇద్దరు అధికారుల వెంట లోకేష్‌ వెళ్ళినట్లు ఏమాత్రం కనిపించటంలేదు. అలా వెళ్లటానికి కూడా చట్టం ఒప్పుకోదు. అధికారులు తమ అధికారిక పర్యటనల్లో భాగంగా కుటుంబసభ్యులను తీసుకువెళితే తప్పుపడతారు. కాని ఇక్కడ మాత్రం ఏకంగా ముఖ్యమంత్రి (తనయుడు) వెంట ఇద్దరు అధికారులు వెళ్ళినట్లు వారు పాల్గొన్న సమావేశాలు, సమావేశమైన పారిశ్రామిక వేత్తలను బట్టి స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి (తనయునికి) తోడుగా ఇద్దరు అధికారులు కనిపిస్తున్నారుగాని వారిద్దరు  వెంట ఆయన వెళ్ళినట్లు ఏ ఫొటోకూడా చెప్పటంలేదు. చిత్రాలు నిజాలనే చెబుతున్నాయి. వాస్తవాలను దాచిపెట్టడం సాధ్యంకాదుకదా? ఎపి ముఖ్యమంత్రి (తనయుడి) ఆహ్వానానికి పారిశ్రామిక వేత్తలు సానుకూలంగానే స్పందిస్తున్నారంట.  చంద్రబాబునాయుడు గతంలో ఆమెరికా, యూరప్‌కు సాగిలపడేవారు. ఇప్పుడు సింగపూర్‌, చైనా, జపాన్‌ల చుట్టూ  తిరుగుతుంటే ఆయన తనయుడు లోకేష్‌ మాత్రం సరాసరిగా ముఖ్యమంత్రి తరహాలో అమెరికాలో పర్యటిస్తున్నారు. బాబు గతాన్ని ఇప్పుడు లోకేష్‌ అందిపుచ్చుకుని వారసత్వాన్ని చాటుతున్నారు. బహుశా శాఖలు, దేశాలను వారిద్దరూ పంచుకున్నట్లు కనిపిస్తోంది కదూ.

        సాధారణంగా అయితే ముఖ్యమంత్రికి సమాంతరంగా పరిపాలన సాగించేవారిని ‘రాజ్యాంగేతర శక్తి, డీప్యాక్టో ముఖ్యమంత్రి ‘ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. ముఖ్యమంత్రి కుటుంబంలోని వారే ఈ విధంగా పెత్తనం చేస్తుండటం గతంలోనే కాదు ఇప్పుడూ చూస్తూనే ఉన్నాం. ముఖ్యమైన వ్యవహారాలలో నమ్మకంగా అన్ని విషయాలు చక్కబెట్టేవారు ఉండాలి కాబట్టి ఆ స్థానాన్ని ముఖ్యమంత్రి తనయుడు ఆక్రమించటం, పలు  ఆరోపణలు ఎదుర్కోవటం గతంలో చూశాం.

     తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు తారకరామారావుకూడా అమెరికా పర్యటనకు వెళ్ళారు. అయితే ఇక్కడ లోకేష్‌తో ఆయన పర్యటనను పోల్చడానికి లేదు. కెటిఆర్‌ తెలంగాణ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. పైగా ఐటి శాఖను కూడా నిర్వహిస్తున్నారు. అందువల్ల ఆయన పర్యటన అధికారికంగానే ఉంటుంది. కెసిఆర్‌పై కూడా కుటుంబ పెత్తనం సాగిస్తున్నారనే ఆరోపణలు బలంగానే ఉన్నాయి. తెలంగాణ టిడిపి నాయకులు కూడా ఆ విధమైన ఆరోపణలు తరచూ చేస్తున్నారు. కాని అదే నాయకులు తమ నాయకుడు (ఎపి ముఖ్యమంత్రి) చంద్రబాబు తనయుడు లోకేష్‌ నేరుగా ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నా గురువిందగింజ తరహాలో వ్యవహరిస్తున్నారు.

     తెలుగుదేశం పార్టీ కార్యాలయం వాస్తవాలను దాచిపెట్టడానికి ఏమాత్రం ప్రయత్నించటంలేదు. పార్టీ కార్యాలయం నుంచే ప్రకటనలు, ఫొటోలు విడుదల అవుతున్నాయి. ఈ విధంగా చేయటం ఇప్పుడు కొత్తేమీకాదు. నేరుగా మంత్రులను పార్టీ కార్యాలయానికి లోకేష్‌ పిలిపించి సమీక్షలు కూడా నిర్వహించారు. అప్పుడూ ఇప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్షం వైసిపి కనీసం నోరెత్తి ప్రశ్నించలేకపోతుండటంతో తమకు ఎదురులేదని టిడిపి అంచనాకు వచ్చేసి మరింత దూకుడుగా లోకేష్‌ను రంగంలోకి దింపుతోంది. ఆయన మంత్రులతో సమీక్ష నిర్వహించినప్పుడే వైసిపి తదితర పక్షాలు ప్రశ్నించి ఉంటే, దుమారం రేగి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదేమో. రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు తయారయ్యేవారు కాదేమో ? ఏ హోదాలో ఆయన శాఖలను సమీక్షించారనే విషయం తేలకముందే ఇప్పుడు ముఖ్యమంత్రి తరహాలో ఆయన నేరుగా అధికారులతో కలిసి అమెరికాలో పర్యటిస్తున్నారు. అప్పటికే ఆయన మంత్రులపైనా, శాఖలలోనూ, పార్టీలోనూ పట్టుబిగించడానికి కారణం పార్టీ నాయకులను ముఖ్యమంత్రి అలాచేయమని ఆదేశించటమే.

– ఎస్‌.వి.ఆర్‌