Telugu Global
Family

గాంధారి (FOR CHILDREN)

            కళ్ళున్న వారికి చూపుంటుంది. కళ్ళుండీ చూపులేని వాళ్ళెవరైనా ఉంటారా? నిజమే, ఉండరు. అయితే మహాభారతంలో అలాంటి ఒక పాత్ర ఉంది. ఆదర్శ పాత్ర. భర్త ధృతరాష్ట్రునికి కళ్ళులేకపోతే, తను కళ్ళు ఉండి కూడా అంధురాలిగానే జీవితాంతం కళ్ళకు గుడ్డకట్టుకొని చివరి వరకూ జీవించింది. వెలుగన్నదే చూడలేదు. అందుకెన్నడూ బాధ పడనూలేదు. ఇలాంటి పాత్ర మరొకటి లేనే లేదు.             గాంధారిది మొదట గాంధార దేశం. తండ్రి సుబలుడు. శకుని ఈమె అన్నదమ్ముడే. ధృత రాష్ట్రుని గుణగణాలను […]

కళ్ళున్న వారికి చూపుంటుంది. కళ్ళుండీ చూపులేని వాళ్ళెవరైనా ఉంటారా? నిజమే, ఉండరు. అయితే మహాభారతంలో అలాంటి ఒక పాత్ర ఉంది. ఆదర్శ పాత్ర. భర్త ధృతరాష్ట్రునికి కళ్ళులేకపోతే, తను కళ్ళు ఉండి కూడా అంధురాలిగానే జీవితాంతం కళ్ళకు గుడ్డకట్టుకొని చివరి వరకూ జీవించింది. వెలుగన్నదే చూడలేదు. అందుకెన్నడూ బాధ పడనూలేదు. ఇలాంటి పాత్ర మరొకటి లేనే లేదు.

గాంధారిది మొదట గాంధార దేశం. తండ్రి సుబలుడు. శకుని ఈమె అన్నదమ్ముడే. ధృత రాష్ట్రుని గుణగణాలను విన్నది. ఇష్టపడింది. అతన్ని తప్ప వేరొకరిని పెళ్ళిచేసుకోనన్నది. తండ్రి ఆమె ఇష్ట ప్రకారమే ధృత రాష్ట్రునికిచ్చి పెళ్ళి చేసాడు. భర్తకు కళ్ళులేనప్పుడు భార్యగా నాకు కళ్ళెందుకని అనుకొని కళ్ళకు నల్లని గుడ్డను కట్టుకుంది. జీవితంలో మళ్ళీ విప్పలేదు.

కృష్ణ ద్వైపాయనుడనే బ్రహ్మర్షి వరము వల్ల గాంధారి గర్భవతి అయింది. సంవత్సరకాలం గడిచినా ప్రసవం కాలేదు. అటు చూస్తే తోడికోడలు కుంతి కొడుకును కన్నది. తనకింక పిల్లలు కలగరేమోనని ఆందోళనతో గాంధారి తన గర్భం మీద కొట్టుకున్నది. మాంసపుముద్ద బయటపడింది. ఈ విషయం తెలిసి కృష్ణద్వైపాయనుడే వచ్చి – ఆ మాంసపు ముద్ద నుండి నూరుగురు కొడుకులు, ఒక కూతురు పుడతారని చెప్పాడు. ఆ ముద్దని ఖండ ఖండాలుగా చేసి విడివిడిగా పెట్టి పరీక్షించమని ఆనతి యిచ్చాడు. ఆప్రకారమే ధుర్యోధనుడు మొదలు దుశ్శల వరకు నూటొక్కమంది పుట్టారు.

కళ్ళుండీ చూడలేకపోయిన గాంధారి చూడాల్సినవి మనసుతో చూడనే చూసింది. అందుకని అన్నదమ్ముల బిడ్డలు మీరు, వైరం వద్దని పిల్లలకు చెపుతూనే వచ్చింది. నిండు కొలువులో ద్రౌపతి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు తను చూడలేనందుకు సంతోషించినా – తగదని వారించినా – ఆమె మాటలను ధుర్యోధన దుశ్శాసనులు లక్ష్య పెట్టలేదు. ఫలితం తాను అనుభవించింది. కడుపుకోత!

యుద్ధంలో తన బిడ్డలు చనిపోయినందుకు దుఃఖించింది. చూడడానికి వచ్చిన ధర్మరాజును శపించబోయింది. యుద్ధస్థలిలో ఉన్న శవాలను… తడిమి తడిమి పోల్చి చేతులతో చూసి విలవిలలాడింది. దీనంతటికీ కృష్ణుడే కారణమని నమ్మింది. నీ వాళ్ళు కూడా ఇలాగే చనిపోతారంటూ శపించింది.

గాంధారీ ధృతరాష్ట్రుల పుత్రశోకాన్ని చూసి వ్యాసుడే వచ్చి ఓదార్చాడనీ – తరువాత గాంధారీ తన భర్తతో అరణ్య వాసానికి వెళితే వ్యాసుడే ఆదరించాడనీ – వీరిని చూసుకోవడానికి అప్పుడూ ఇప్పుడూ సంజయుడే అంటిపెట్టుకొని ఉన్నాడనీ – పాండవులు చూడడానికి అప్పుడప్పుడూ వచ్చేవారనీ, వెళ్ళేవారనీ – అయితే ఓసారి అరణ్యంలో దావానలం పుట్టి అడవి తగలబడిపోతూ ఉంటే – దాటే దారిలేక సంజయుణ్ని పంపించి వేశారనీ – అలాగే తూర్పుకి తిరిగి కూర్చొని నమస్కరించి అగ్నికి ఆహుతి అయ్యారనీ గాంధారిని గురించిన కథ ఉంది!

కళ్ళుండీ చూపులేకపోయినా దృష్టివున్న పాత్రగా గాంధారి తీర్చిదిద్దబడింది!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  8 May 2015 1:10 PM GMT
Next Story